Indus Waters Treaty: పహల్గామ్ ఉగ్రవాద దాడి తర్వాత, సింధు జలాల ఒప్పందాన్ని నిలిపివేయడం ద్వారా భారత్ పాక్‌కు బలమైన సందేశాన్ని ఇచ్చింది. పాకిస్తాన్ జీవనాధారమైన మూడు పశ్చిమ నదుల (జీలం, చీనాబ్, సింధు) నీటిని పూర్తిగా నిలిపివేయడానికి ఇండియాకు ఎక్కువ సమయమే పడుతుంది. కానీ భారత్ ఈ నదులపై పూర్తి హక్కులను కలిగి ఉండి, ప్రాజెక్టులపై వేగంగా పనిచేస్తే తొందరగానే ఉగ్రవాద సూత్రధారి అయిన పాకిస్తాన్‌కు నీటిని ఆపివేసి, ప్రతి నీటి చుక్క కోసం ఆ దేశం ఆరాటపడేలా చేయవచ్చు.
సింధు జలాల ఒప్పందాన్ని నిలిపివేయడం వల్ల ఇండియా ఈ ప్రాజెక్టులపై వేగంగా పని చేయడానికి మార్గం సుగమం అయింది. ఈ నేపథ్యంలోనే కేంద్రం కూడా మూడు దశల ప్రణాళికను రూపొందించింది. నీటి ఒప్పందం నిలిపి వేయడంతో.. ప్రాజెక్టుల పనులు కూడా త్వరగా చేపట్టే అవకాశం ఉంది.
సింధు జలాల ఒప్పందం ప్రకారం పాకిస్తాన్ వాటాకు వచ్చే నీటిలో 10 MAF నీటిని ఇండియా ప్రస్తుతం నిల్వ చేస్తోంది. ఈ ఒప్పందం కారణంగా భారత్ ఈ నదులపై ఆనకట్టలు నిర్మించడం ద్వారా నీటిని అడ్డుకునే బదులు, రన్-ఆఫ్ ఆనకట్టలను నిర్మించడానికి, అంటే జల విద్యుత్ ప్రాజెక్టులకు నీటిని ఉపయోగించుకోవడానికి మాత్రమే అనుమతి ఉంది. పాకిస్తాన్ తరచుగా దీనిపై నిరసన వ్యక్తం చేస్తూనే ఉంది. ప్రస్తుతం ఈ ఒప్పందం ముగియడంతో.. ఇప్పుడు ఆన కట్టలు నిర్మించడానికి, నిల్వ సామర్థ్యాన్ని పెంచడానికి , కాలువ వ్యవస్థలను నిర్మించడానికి అవకాశం ఉంటుంది. ఫలితంగా భవిష్యత్తులో రైతులు, పరిశ్రమలు, విద్యుత్ ఉత్పత్తి , తాగు నీటికి ఈ నీరు ఉపయోగపడుతుంది. ఇదిలా ఉంటే భారత్ తన వాటాలోకి వచ్చే రావి, బియాస్ , సట్లెజ్ అనే మూడు నదుల 33 MAF నీటిలో ఎక్కువ భాగాన్ని పూర్తిగా ఉపయోగించుకుంటోంది. ఈ నీటితో రాజస్థాన్ వరకూ పొలాలు సస్యశ్యామలం అవుతున్నాయి.
3 దశల్లో పని:
ప్రాజెక్టుల కోసం మొదట బురదను తొలగించడం ద్వారా పని ప్రారంభమైంది. ఈ ప్రాంతాల్లోనే ఆనకట్టలు, కాలువలు నిర్మించాల్సి ఉంటుంది.
1. తక్షణ పరిష్కారం: ప్రస్తుతం సింధూ జలాలపై ఉన్న ప్రాజెక్టు పనులు వేగవంతం చేయడం అవసరం. నదీ జలాల నియంత్రణలో పాకిస్తాన్ అభిప్రాయానికి లేదా జోక్యానికి అవకాశం లేదు కాబట్టి భారత్ అవసరాలకు అనుగుణంగా నీటిని ఉపయోగించుకోవచ్చు. దీనివల్ల పాకిస్తాన్ కు ఇబ్బంది కలుగుతుంది. నీటి కోసం అక్కడి ప్రజలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా గొంతెత్తుతారు.
2. మధ్యకాలిక: ప్రస్తుత ప్రాజెక్టుల ఆనకట్టల సామర్థ్యం పెంచడం వల్ల నీటి నిల్వ సామర్థ్యం పెరుగుతుంది. అంతేకాకుండా, పశ్చిమ నదులపై చిన్న చిన్న ఆనకట్టలు, జలవిద్యుత్ ప్రాజెక్టులు నిర్మించవచ్చు. ఇలాంటి ప్రాజెక్టును నిర్మించడం వల్ల నీటి నిల్వ సామర్థ్యం కూడా చాలా వరకు పెరుగుతుంది.
Also Read: పాక్‌లో మందుల కొరత, పిట్టల్లా రాలిపోతున్న జనం
3. దీర్ఘకాలిక: 3 నదులపై నీటిని మళ్లించడానికి పెద్ద ప్రాజెక్టులు , కాలువలు నిర్మించాలి. ఇవి విద్యుత్ ఉత్పత్తికి మాత్రమే కాకుండా నీటి నిల్వ కోసం కూడా ఉపయోగపడతాయి. ఇవి పూర్తి చేయడానికి 5 నుండి 10 సంవత్సరాలు పడుతుంది.