Israel Iran War| ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. లెబనాన్ లో హిజ్బుల్లా చీఫ్ హసన్ నస్రల్లా మృతి తరువాత తాజా ఇజ్రాయెల్ పై ఇరాన్ 200 క్షిపణులు ప్రయోగించింది. ఈ దాడిలో ఎంతమంది చనోపోయారు, ఎలాంటి నష్టం జరిగిందో ఇంతవరకు ఇజ్రాయెల్ వెల్లడించలేదు. అయితే సమయం వచ్చినప్పడు ప్రతీకారం తీర్చుకుంటామని ఇజ్రాయెల్ చెప్పింది. ఈ నేపథ్యంలో భారతదేశంలోని ఇరాన్ రాయబారి ఇరాజ్ ఎలాహి యుద్ధ ఘటనలపై స్పందించారు.
ఇజ్రాయెల్ పై ఇరాన్ క్షిపణలు ప్రయోగించడం.. ఒక ప్రతిచర్యగా ఆయన వర్ణించారు. విదేశాల్లోని ఇరాన్ ఆస్తులపై ఇజ్రాయెల్ దాడులు చేయడం ఆపకపోతే ఇజ్రాయెల్ పై మరోసారి క్షిపణలు ప్రయోగించేందుకు ఇరాన్ వెనుకాడదని చెప్పారు. అంతర్జాతీయ స్థాయిలో ఇరాన్ సంబంధాలు, జాతీయ భద్రత గురించి ఇరాన్ ప్రభుత్వం చాలా సీరియస్ గా వ్యవహరిస్తుందని అన్నారు.
Also Read: బేరుట్‌లో కూలిపోయిన ఇళ్లు.. బాంబుల భయంతో రోడ్లపై నిద్రిస్తున్న వేలాది ప్రజలు..
ఎన్‌డీటీవి కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. ”ప్రపంచవ్యాప్తంగా ప్రజలు ఇజ్రాయెల్ దురాగతాలను చూస్తున్నారు. ముఖ్యంగా పశ్చిమాసియా దేశాల్లో ఇజ్రాయెల్ అరచకాలు హద్దు మీరిపోయాయి. 21వ శతాబ్దపుల హిట్లర్ గా నెతన్యాహు వ్యవహరిస్తున్నాడు. గాజాలో దక్షిణ లెబనాన్ లో ఇజ్రాయెల్ చేస్తున్న రక్తపాతం చూసి ప్రపంచదేశాలు సైతం ఆగ్రహంగా ఉన్నాయి. మానవ హక్కులు, అంతర్జాతీయ చట్టాలు, అన్నింటినీ ఇజ్రాయెల్ ఉల్లంఘించింది. ఇజ్రాయెల్ పై ఇరాన్ చేసిన క్షిపణుల దాడిని చాలా దేశాలు సమర్థిస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా యూనివర్శిటీల్లో విద్యార్థులు నిరసనలు చేస్తున్నారు. పేద పాలస్తీనా ప్రజలను ఇజ్రాయెల్ అన్యాయంగా చంపుతోంది.. దీన్ని ఏ దేశం కూడా సమర్థించడం లేదు.” అని ఆవేశంగా అన్నారు.
మరోవైపు ఇజ్రాయెల్ కు అమెరికా సైన్యం రంగంలోకి దిగడంపై ఇరాన్ రాయబారి సమాధానమిస్తూ.. ”మనమంతా చూశాం. ఆఫ్ఘనిస్తాన్, ఇరాక్, లిబ్యా లాంటి దేశాల్లో అమెరికా ఎంతటి విధ్వంసం సృష్టించిందో. పశ్చిమాసియాలో జరుగుతున్న హింస వెనుక అమెరికా హస్తం కూడా ఉందనేది మేము నమ్ముతున్నాం. ఇజ్రాయెల్ ని ఇలాగే అమెరికా మద్దుతు చేస్తే యుద్ధం తీవ్రం అవుతుందనడంలో సందేహం లేదు. యుద్ధం మొదలు పెట్టాలా? లేదా? అనేది ఇజ్రాయెల్ చేతిలో ఉంది.” అని వ్యాఖ్యానించారు.
”అయితే యుద్ధాన్ని ఆపే విషయంలో భారతదేశం కీలక పాత్ర పోషించగలదని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఇజ్రాయెల్, అమెరికా, ఇరాన్… అన్ని దేశాలతో ఇండియాకు మంచి సంబంధాలున్నాయి. ఇకనైనా ఇజ్రాయెల్ దాడులు ఆపేయాలని భారత ప్రధాన మంత్రి నచ్చజెబితే.. పరిస్థితి మెరుగుపడుతుందని నేను ఆశిస్తున్నాను,” అని ఇరాజ్ ఎలాహీ చెప్పారు.