Lebanon Beirut | లెబనాన్ రాజధాని బేరుట్ నగరంలో ప్రజలు భయం గుప్పిట్లో బతుకుతున్నారు. గత వారం రోజులుగా ఇజ్రాయెల్ బేరుట్ నగరాన్ని టార్గెట్ చేసుకొని క్షిపణులు ప్రయోగిస్తోంది. దాడులు చేసేముందు ప్రజలు నగరం నుంచి వెళ్లిపోవాలని ఇజ్రాయెల్ హెచ్చరించింది. రాజధాని నగరం కావడంతో బేరుట్ లో భారీ సంఖ్యలో ప్రజలు నివసిస్తున్నారు. హెజ్బుల్లాతో యుద్ధం కారణంగా ఇజ్రాయెల్ లెబనాన్ నగరాలపై నిరంతరాయంగా దాడులు చేస్తోంది. ఈ దాడులతో నగరం దద్దరిల్లిపోతోంది. ఇప్పటి వరకు ఇజ్రాయెల్ చేసిన దాడుల్లో కేవలం బేరుట్ నగరంలోనే 700 మందికి పైగా చనిపోయారు.
బేరుట్ లో చాలామంది బాంబు పేలుళ్ల ఘటనలకు భయపడి ఇల్లు వదిలి వేరే నగరాలకు, ఇతర దేశాలకు వలసపోతున్నారు. చాలా ఇళ్లలో ప్రజలు తమ విలువైన వస్తువులని సైతం వదిలి వెళ్లిపోయారు. ఇజ్రాయెల్ క్షిపణులు బేరుట్ లోని భవనాలను టార్గెట్ చేస్తుండడంతో జనాలు ఇళ్లు వదిలి రోడ్లపై నివసిస్తున్నారు. రాత్రివేళ అందరూ ఇళ్లు ఖాళీ చేసి నగర ప్రధాన కూడళ్లు, సహాయక శిబిరాల వద్ద ఆరుబయట నిద్రపోతున్నారు. రోడ్లపై కొందరు టెంపరరీ టెంట్లు వేసుకొని జీవిస్తున్నారు.
Also Read: ‘ఇరాన్ లో ఏ మూలలోనైనా ఇజ్రాయెల్ దాడి చేయగలదు’.. ఐరాసలో నెతన్యాహు వార్నింగ్!
ఇలా ఇల్లు వదిలి రోడ్లపై నివసిస్తున్నవారిలో కొందరు మీడియాతో తమ సమస్యల గురించి మాట్లాడారు. సౌత్ బేరుట్ లో నివసించే 56 ఏళ్ల రిహాబ్ నసీఫ్ మీడియాతో మాట్లాడుతూ.. ”ఇజ్రాయెల్ తో యుద్ధం జరుగుతుందని తెలుసు. కానీ యుద్ధం ఇలా సామాన్యుల ఇంటి వరకు చేరుతుందని అసలు ఊహించలేదు. రాకెట్ దాడులు చేయాలనుకుంటే మిలిటరీ స్థావరాలపై చేయాలి. సాధారణ ప్రజల నివాసాలపై పిల్లలపై చేయడం చాలా అన్యాయం. నేను రాత్రిళ్లు సమీపంలోని చర్చి ఆవరణలో నిద్రపోతున్నాను. ఎవరికి తెలుసు ఒక రాకెట్ నా ఇంటిపై కూలుతుందేమో. మా ఇంటి సమీపంలో ఒక రాకెట్ పడింది. నేను బట్టలు కూడా తీసుకోకుండా.. ఇల్లు వదిలి వచ్చేశాను. నేనెప్పుడూ పరిస్థితి ఇంతవరకూ దిగజారుతుంది అని అనుకోలేదు. ఇల్లు రోడ్లపై ఉండాల్సి వస్తోంది. ఇప్పుడు నేను ఈ నగరం వదిలి వెళ్లిపోతున్నాను. నాకు ఎక్కడికి వెళ్లాలో తెలియదు. చాలా భయంగా ఉంది. నా ఇల్లు వదలి వెళ్లి పోతున్నాను. తిరిగి వస్తానో? లేదో? తెలీదు. ” అని అన్నారు.
హెజ్బుల్లా కు చెందిన అల్ మానర్ టీవి ఛానెల్ లో బేరుట్ నగరంపై కురుస్తున్న ఇజ్రాయెల్ రాకెట్లు ప్రత్యక్ష ప్రాసారం జరుగుతోంది. పెద్ద పెద్ద భవనాలపై రాకెట్లు పడడంతో అవి కూలిపోతున్న దృశ్యాలు కనిపిస్తున్నాయ. భవనాలు కూలిపోవడంతో రోడ్లపై భవన శిధిలాలు, దుమ్ము వచ్చే పొగతో వాతావరణం నిండిపోయింది.
ఇళ్లు కూలిపోయి ఉండడానికి చోటు లేక రోడ్డున పడ్డ కుటుంబాలతో బేరుట్ నగరంలోని మార్టిర్స్ స్క్వేర్ నిండిపోయింది. ”రాత్రి మా ఇంటి పక్కనే రాకెట్ పడింది. దీంతో మా ఇల్లు కూలిపోయింది. మాకు ఉండడానికి చోటు లేదు. మేం ఎక్కడికి వెళ్లాలి? రాత్రంతా ఇక్కడే రోడ్డుపై పడుకున్నాను. నేను నా కుటుంబం ఏం తప్పు చేశామని మాకు ఈ శిక్ష. గాజాలో లాగా ఇక్కడ కూడా మారణహోమం జరగబోతోందనిపిస్తోంది. ఇజ్రాయెల్ తో శత్రుత్వం అవసరమా? హెజ్బుల్లా నాయకులు మాకు న్యాయం చేయగలరా?” అని ఆవేదనతో 55 ఏళ్ల హాలా ఎజెడైన్ చెప్పారు. ఆమె బేరుట్ నగరంలోని దహియే ప్రాంతంలో నివసించేవారు. ఆమె భర్త మాట్లాడుతూ.. ”మేము భగవంతుడిపై నమ్మకంతో చాలా సహనంతో పరిస్థితులను ఎదుర్కొంటున్నాం” అని చెప్పారు.
ఇళ్లు కోల్పోయిన వారిలో మరొకరు హవ్రా అల్ హుసేనీ అనే 21 ఏళ్ల యువతి మాట్లాడుతూ.. ”నిన్న రాత్రి చాలా కష్టంగా గడిచింది. ఇక్కడే రోడ్డుపై నా కుటుంబంతో పడుకున్నాను. ఇజ్రెయెల్ రాకెట్లు మా ఇంటిని కూల్చేశాయి. మా పిల్లలు భయంతో పెట్టిన అరుపులు కేకలు ఇంకా నా చెవుల్లో మార్మోగుతున్నాయి. తిరిగి ఒకసారి ఇంటికి వెళ్లి అవసరమైన వస్తువులు తీసుకొని ఆ తరువాత ఎక్కడికైనా సురక్షిత ప్రాంతానికి వెళ్లాలను కుంటున్నాను. ఈ దేశంలో నివసించడం అంత సురక్షితం కాదనిపిస్తోంది. ఇంటి వద్దకు వెళ్లాలంటేనే భయంగా ఉంది.” అని చెప్పింది.
హెజ్బుల్లా చీఫ్ హసన్ నస్రల్లా చనిపోవడంతో ఇప్పుడు ఈ యుద్ధంలో ఇరాన్ ఎంటర్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.