Iran Downs US Transport Plane: మధ్యప్రాచ్యంలో అగ్రరాజ్యం అమెరికాకు, ఇరాన్‌కు మధ్య సాగుతున్న గగనతల పోరాటం ఇప్పుడు ప్రమాదకర స్థాయికి చేరుకుంది. అమెరికాకు చెందిన అధునాతన ఫైటర్ జెట్లను, రెస్క్యూ విమానాలను వరుసగా కూల్చివేస్తున్నట్లు ఇరాన్ చేస్తున్న ప్రకటనలు కలకలం రేపుతున్నాయి. అమెరికాకు చెందిన ఐదవ తరం యుద్ధ విమానాలు, రవాణా విమానాలను తమ స్వదేశీ రక్షణ వ్యవస్థల ద్వారా అడ్డుకుంటున్నామని ఇరాన్ ఐఆర్‌జీసీ (IRGC) ప్రకటించడం, అమెరికా సైనిక ఆధిపత్యానికి పెద్ద సవాల్‌గా మారింది. అగ్రరాజ్యం తన పైలట్ల కోసం చేపడుతున్న రెస్క్యూ ఆపరేషన్లను కూడా ఇరాన్ దళాలు భగ్నం చేస్తుండటం ఇరు దేశాల మధ్య ప్రత్యక్ష యుద్ధానికి దారితీసేలా కనిపిస్తోంది.
అమెరికాకు చెందిన F-15E ఫైటర్ జెట్ కూలిపోయిన ఘటనలో గల్లంతైన రెండో పైలట్‌ను రక్షించామని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన కొద్దిసేపటికే ఇరాన్ మరో షాకిచ్చింది. ఆ పైలట్ కోసం రెస్క్యూ ఆపరేషన్లో పాల్గొన్న అమెరికా వైమానిక దళానికి చెందిన C-130 రవాణా విమానాన్ని ఇస్ఫహాన్ దక్షిణ ప్రాంతంలో తమ దళాలు ధ్వంసం చేసినట్లు ఇరాన్ ఐఆర్‌జీసీ ప్రకటించింది. ఇతర ఫైటర్ జెట్లకు గగనతలంలోనే ఇంధనం నింపే ప్రక్రియలో ఉన్న ఈ విమానాన్ని ఫరాజ్ రేంజర్స్ అనే పోలీసు కమాండో యూనిట్ కూల్చివేసినట్లు అంతర్జాతీయ మీడియా పేర్కొంది. ఈ ఘటనలో విమానంలోని సిబ్బంది పరిస్థితిపై ఇంకా స్పష్టత రాలేదు.
మరోవైపు ఇరాన్ సాయుధ దళాలు జరిపిన సంయుక్త దాడుల్లో అమెరికాకు భారీ నష్టం వాటిల్లినట్లు తెలుస్తోంది. ఖతమ్ అల్-అన్వియా కేంద్ర ప్రధాన కార్యాలయ ప్రతినిధి వెల్లడించిన వివరాల ప్రకారం.. కూల్చివేసిన వాటిలో ఒక C-130 విమానంతో పాటు, రెండు Black Hawk హెలికాప్టర్లు కూడా ఉన్నాయి. ఈ దాడుల్లో అమెరికా దళాలకు చెందిన ఐదుగురు ప్రాణాలు కోల్పోయినట్లు ఇరాన్ మీడియా పేర్కొంది.
అమెరికా వైమానిక దళానికి చెందిన ఒక కల్నల్ స్థాయి అధికారిని ఇరాన్ సరిహద్దుల లోపల నుండి సాహసోపేతంగా రక్షించినట్లు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. అత్యంత ప్రమాదకరమైన ఇరాన్ పర్వత ప్రాంతాల్లో జరిగిన ఈ సెర్చ్ అండ్ రెస్క్యూ ఆపరేషన్ విజయవంతమైందని ఆయన వెల్లడించారు. “మేము అతడిని రక్షించాం.” అంటూ తన ‘ట్రూత్ సోషల్’ వేదికగా ట్రంప్ హర్షం వ్యక్తం చేశారు. శత్రు దేశం భూభాగంలోకి వెళ్లి ఇద్దరు పైలట్లను వేర్వేరుగా రక్షించడం సైనిక చరిత్రలోనే ఇదే మొదటిసారి అని ఆయన కొనియాడారు.
అయితే ఈ ఆపరేషన్ విజయవంతమైనప్పటికీ, వెనక్కి వచ్చే క్రమంలో అమెరికా దళాలు తమ స్వంత విమానాలను పేల్చివేయాల్సి వచ్చిందని వాల్ స్ట్రీట్ జర్నల్ నివేదిక వెల్లడించింది. రెండు MC-130J రవాణా విమానాలు ఈ ఆపరేషన్‌లో పాల్గొన్నాయి. అయితే మిషన్ సమయంలో ఈ విమానాలు సాంకేతిక కారణాల వల్ల లేదా భౌగోళిక పరిస్థితుల వల్ల అక్కడ ఇరుక్కుపోయాయని సమాచారం. శత్రువుల చేతికి చిక్కకుండా ఉండేందుకు, తిరుగు ప్రయాణంలో అమెరికా దళాలే తమ విమానాలను పేల్చివేసి ధ్వంసం చేసినట్లు తెలుస్తోంది. తమ విమానాల కూల్చివేత.. సైనికుల మరణాలపై అమెరికా అధికారికంగా ఇంకా ఎటువంటి ప్రకటన చేయలేదు.
Read Also: ఇరాన్‌పై మరోసారి అధ్యక్షుడు ట్రంప్ సంచలన వ్యాఖ్యలు.. ఇదిగో వీడియో, వెనక్కి తగ్గేది లేదన్న ఇరాన్