Iran President Ebrahim Raisi Dead in Helicopter Crash: హెలికాఫ్టర్ ప్రమాదంలో ఇరాన్ అధ్యక్షుడు రైసీ మృతి చెందినట్లు వస్తున్న వార్తలపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. హెలికాప్టర్ ప్రమాదంలో ఆయన మరణించినట్లు ఆ దేశ మీడియా ధృవీకరించింది. ప్రమాదానికి కారణం వాతవారణం అనుకూలించకపోవడమే అని ప్రాథమిక అంచనాకు వచ్చినా.. ప్రమాదం జరిగిన తీరు పలు అనుమానాలకు దారి తీస్తోంది. జోల్ఫా నగర సమీపంలోకి రాగానే.. రైసీ ప్రయాణిస్తున్న హెలికాఫ్టర్ ప్రమాదానికి గురైంది. అయితే.. ఆయన వెంట బయలుదేరిన మిగతా రెండు హెలికాఫ్టర్లు మాత్రం సురక్షితంగా ల్యాండయ్యాయి. దీంతో.. అసలు ఇది ప్రమాదమా? లేకపోతే కుట్ర? అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి.
అధ్యక్షుడి హెలికాప్టర్ ప్రమాదానికి గురైన 12 గంటల తర్వాత.. హెలికాప్టర్ క్రాష్ అయిన ప్రదేశాన్ని రెస్క్యూ సిబ్బంది గుర్తించారు. హెలికాప్టర్ శిథిలాలు ఉన్న ప్రాంతానికి చేరుకున్న సిబ్బంది.. అక్కడ ఎవరూ బతికి ఉన్న ఆనవాళ్లు కనిపించలేదని ఉన్నతాధికారులకు నివేదిక ఇచ్చారు. ఇరాన్ రాజధాని టెహ్రాన్‌కు వాయువ్యంగా 600 కిలోమీటర్ల (375 మైళ్ళు) దూరంలో అజర్‌బైజాన్ దేశం సరిహద్దులో ఉన్న జోల్ఫా అనే నగరానికి సమీపంలో హెలికాప్టర్ కుప్పకూలింది. అజర్ బైజాన్ నుంచి రైసీ తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ప్రమాద సమయంలో హెలికాప్టర్ లో 9 మంది ఉన్నారు.
ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ, ఇరాన్ విదేశాంగ మంత్రి హోస్సేన్ అమీర్ అబ్దోల్లాహియాన్, తూర్పు అజర్‌బైజాన్ ప్రావిన్స్ గవర్నర్ మాలెక్ రహ్మతి, తబ్రిజ్, ఇమామ్ మొహమ్మద్ అలీ అలెహాషెమ్, పైలట్, కోపైలట్, క్రూ చీఫ్, భద్రత సిబ్బంది ఉన్నారు.
Also Read: రణరంగంగా తైవాన్ పార్లమెంట్, సభ్యల మధ్య ఫైటింగ్, ఆపై పరుగులు
ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్న సమయంలోనే హెలికాప్టర్ ప్రమాదం జరగడం కూడా అనుమానాలను పెంచుతున్నాయి. గత నెల ఇజ్రాయిల్‌పై దాడి ప్రయత్నిస్తున్న సమయంలో ఇరాన్ ఏకంగా అమెరికాకు వార్నింగ్ ఇచ్చింది. ఇజ్రాయిల్ పై దాడి చేస్తున్నామని.. ఈ విషయంలో అమెరికా కలుగజేసుకోవద్దని హెచ్చరించింది. ఒకవేళ అమెరికా ఎంటర్ అయితే మాత్రం ఆ దేశంపై కూడా దాడికి వెనకాడబోమని స్పష్టం చేసింది. ఇజ్రాయిల్ పై దాడి చేయొద్దని ఆమెరికా హెచ్చరించినా ఇరాన్ ఖాతరు చేయలేదు. ఇజ్రాయిల్ పై ఇరాన్ చేసిన దాడిలో రైసీ కీలక పాత్రపోషించారు. దీంతో.. రైసీ మృతి వెనుక అమెరికా ఉందని కొందరు అనుమానిస్తున్నారు.
రైసీపై గత కొంతకాలంగా అమెరికా ఆంక్షలు విధించింది. 1988లో ఇరాక్-ఇరాన్ యుద్ధంలో చిక్కిన ఖైదీలకు ఇబ్రహీం రైసీ సామూహిక మరణశిక్ష విధించి అమలు చేశారు. మరణశిక్షకు గురైన వారిలో మైనర్లు కూడా ఉండడాన్ని అమెరికా తీవ్రంగా తప్పుబట్టింది. తమ దేశానికి రాకుండా రైసీపై ఆంక్షలు విధించింది. అప్పటి నుంచి అవకాశం దొరికిన ప్రతీసారి అమెరికాకు వ్యతిరేకంగా రైసీకి తన వాయిస్ వినిపిస్తున్నారు. దీంతో.. రైసీని అమెరికా అంతం చేయడానికి సమయం కోసం ఎదురు చూసిందని అనుకుంటున్నారు.
Also Read: Mob Violence in Kyrgyzstan : కిర్గిస్తాన్ లో ఆగని హింస.. మళ్లీ పెరిగిన దాడులు
ఒకవేళ ఈ ప్రమాదం వెనుక అమెరికా ఉందని తేలితే ఇరాన్ ఎలా స్పందిస్తుందనే దానిపై ఉత్కంఠ నెలకొంది. ఇరాన్ దగ్గర పెద్ద ఎత్తున అణ్వాయుధాలు ఉన్నాయి. ఇంతవరకు ఇరాన్, అమెరికా మధ్య ఉన్న ప్రచ్ఛన్న యుద్ధం.. ప్రత్యక్ష యుద్దంగా మారే అవకాశం లేకపోలేదు. రైసీ మరణం వెనుక యూఎస్ ఉందని తేలితే ఇరాన్.. అమెరికాపై దాడి చేయొచ్చు. ఒకవేళ అదే జరిగితే మూడో ప్రపంచ యుద్దానికి దారి తీస్తుందని భయాందోళనలు వ్యక్తం అవుతున్నాయి. పశ్చిమాసియా ఇప్పటికే యుద్దాలతో అట్టుడుకుతోంది. ఇప్పుడు ఇరాన్.. అమెరికాపై దాడి చేస్తే.. ఈ యుద్ధ ప్రభావం యావత్ ప్రపంచ దేశాలపై పడే ప్రమాదం ఉంది.