Iran Israel Truce| ఇజ్రాయెల్‌తో ఉద్రిక్తతలు తీవ్రమవుతున్న సమయంలో.. ఇరాన్ శాంతి కోరుకున్నట్లు తెలుస్తోంది. హింసను ఆపి, తన అణు కార్యక్రమంపై చర్చలకు తిరిగి రావడానికి సిద్ధంగా ఉన్నట్లు ఇరాన్ తెలిపింది. వాల్ స్ట్రీట్ జర్నల్ నివేదిక ప్రకారం.. ఇరాన్ పొరుగులో ఉన్న అరబ్బు దేశాల ప్రతినిధులు, యరోప్ దౌత్యవేత్తలను మధ్యవర్తులగా ఇజ్రాయెల్, అమెరికాకు ఇరాన్ సందేశాలు పంపింది.
ఈ సందేశాల్లో సంఘర్షణను నియంత్రించాలని, ఇరు వైపులా ఉద్రిక్తతను నివారించడం మేలని ఇరాన్ పేర్కొంది. అయితే ఇందుకోసం ఒక కఠినమైన షరతు పెట్టింది. ఇజ్రాయెల్‌కు మద్దతు ఇవ్వడం అమెరికా ఆపేయాలి.. అంతేకాకుండా ఏ విధంగానూ ఇరాన్, ఇజ్రాయెల్ సంఘర్షణలో చేరకూడదు. అప్పుడే కాల్పుల విరమణ చర్చలకు సిద్ధమని ఇరాన్ తెలిపింది.
అయిదు రోజులుగా ఇరు దేశాల మధ్య సంఘర్షణ
మంగళవారం నాటికి ఇజ్రాయెల్-ఇరాన్ మధ్య సైనిక సంఘర్షణ అయిదవ రోజుకు చేరుకుంది. రెండు దేశాలు కూడా దాడులను కొనసాగిస్తున్నాయి. ఈ నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. ఇరాన్ రాజధాని టెహ్రాన్‌లోని పౌరులు వెంటనే ఖాళీ చేయాలని పిలుపునిచ్చారు. అణు కార్యక్రమాన్ని పరిమితం చేసే ఒప్పందాన్ని ఇరాన్ తిరస్కరించడంతోనే ఈ సమస్య వచ్చిందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇరాన్ మొండి వైఖరి కారణంగా అమాయక ప్రజలు శిక్ష అనుభవిస్తున్నారని చెప్పారు.
సోషల్ మీడియాలో ట్రంప్ హెచ్చరిక
ట్రంప్ తన ట్రూత్ సోషల్ ప్లాట్‌ఫామ్‌లో.. “ఇరాన్ నేను ప్రతిపాదించిన ఒప్పందంపై సంతకం చేసి ఉండాల్సింది. ఇరాన్‌కు అణు ఆయుధం ఉండకూడదు. టెహ్రాన్‌ను వెంటనే ఖాళీ చేయండి!” అని రాశారు.
వైట్ హౌస్ ప్రకారం.. ట్రంప్ కెనడాలో జరిగే జీ7 సదస్సు నుండి ఒక రోజు ముందుగా బయలుదేరి ఈ సంక్షోభాన్ని పరిష్కరించడానికి తన జాతీయ భద్రతా మండలిని సమావేశపరుస్తారు. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయెల్ మాక్రాన్.. ఈ చర్య సకాలంలో జరిగిందని, శాంతి ఒప్పందానికి దోహదపడవచ్చని అన్నారు.
టెహ్రాన్, నటాంజ్‌లో పేలుళ్లు.. టెల్ అవీవ్‌లో సైరన్లు
ట్రంప్ సందేశం తర్వాత, టెహ్రాన్‌లోని ఇరాన్ అధికారిక మీడియా మంగళవారం ఉదయం పేలుళ్లు, యాంటీ-ఎయిర్‌క్రాఫ్ట్ ఫైర్ గురించి నివేదించింది. రాజధాని నుండి 320 కిలోమీటర్ల దూరంలో ఉన్న నటాంజ్‌లో, ఇరాన్ అణు స్థావరాలు ఉన్న కీలకమైన ప్రదేశంలో కూడా ఇలాంటి దాడులు జరిగాయి. అటు ఇజ్రాయెల్ రాజధాని టెల్ అవీవ్‌లో అర్ధరాత్రి తర్వాత ఎయిర్ రైడ్ సైరన్లు మోగాయి. ఇరాన్ క్షిపణులు ఇజ్రాయెల్ భూభాగంపై దాడి చేయడంతో పేలుళ్లు సంభవించాయి.
ఇజ్రాయెల్ ఆపరేషన్ రైజింగ్ లయన్
జూన్ 13న ఇజ్రాయెల్.. ‘ఆపరేషన్ రైజింగ్ లయన్’ అనే పేరుతో ఇరాన్ అణు సౌకర్యాలపై పెద్ద ఎత్తున సైనిక దాడిని ప్రారంభించింది. అమెరికా, ఇరాన్ అధికారులు అణు చర్చలను తిరిగి ప్రారంభించేందుకు రెండు రోజుల ముందు ఈ దాడి జరిగింది. ఇరాన్ అణు ఆయుధాలను అభివృద్ధి చేయకుండా నిరోధించేందుకు ఈ దాడి నిరోధక చర్యగా ఇజ్రాయెల్ వర్ణించింది. ఇరాన్ మాత్రం అణు ఆయుధాలను తయారు చేసే ఉద్దేశం లేదని ఖండించి, ఇజ్రాయెల్‌పై ప్రతీకార క్షిపణి దాడులతో స్పందించింది.
అణు ఒప్పందం కోసం ప్రయత్నాలు
2015లో జాయింట్ కాంప్రహెన్సివ్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ (JCPOA) అనే అణు ఒప్పందాన్ని పునరుద్ధరించేందుకు దౌత్యపరమైన ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. ఈ ఒప్పందం ఇరాన్ అణు కార్యక్రమాన్ని నియంత్రించడం కోసం ఫ్రాన్స్, బ్రిటన్, జర్మనీలతో కలిసి సంతకం చేయబడింది. 2018లో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఈ ఒప్పందం నుండి వైదొలిగిన తర్వాత ఉద్రిక్తతలు పెరిగాయి.
Also Read: ఇరాన్‌కు వార్నింగ్ ఇచ్చిన ట్రంప్.. ఇజ్రాయెల్‌పై ప్రశంసలు
ఇరాన్ అధికారుల ప్రకారం.. ఐదు రోజుల సంఘర్షణలో 224 మంది మరణించారు. వీరిలో ఎక్కువ మంది పౌరులు. ఇజ్రాయెల్ కూడా 24 మంది పౌరుల మరణాలను నివేదించింది. ఇరాన్ దాడుల వల్ల సుమారు 3,000 మందిని ఇళ్లు ఖాళీ చేయించి సురక్షిత ప్రదేశాలకు తరలించబడ్డారని ఇజ్రాయెల్ ఆర్థిక మంత్రి బెజాలెల్ స్మోట్రిచ్ తెలిపారు.