Trump Israel Iran| ఇరాన్‌పై ఇజ్రాయెల్ మరోసారి దాడులు చేసింది. శుక్రవారం ఉదయం దాడులు జరిగిన 24 గంటల్లోనే మళ్లీ ఇరాన్‌లోని అణు, సైనిక స్థావరాలపై దాడులు చేపట్టింది. ఇస్ఫహాన్‌లోని అణు స్థావరంపై దాడి చేసినట్లు ఇజ్రాయెల్ సైన్యం (ఐడీఎఫ్) తెలిపింది. రాజధాని టెహ్రాన్‌తో సహా 200 లక్ష్యాలను ధ్వంసం చేసినట్లు పేర్కొంది. ఇజ్రాయెల్ యుద్ధ విమానాలు ఇస్ఫహాన్‌లోని అణు స్థావరాలను లక్ష్యంగా చేసుకుని దాడి చేశాయి. అక్కడ యురేనియం శుద్ధి ప్రక్రియ జరుగుతున్నట్లు ఇజ్రాయెల్ సైన్యం వెల్లడించింది. యురేనియం తయారీకి ఉపయోగించే ప్రయోగశాలలు, ఇతర సౌకర్యాలను నాశనం చేసినట్లు తెలిపింది. ఈ దాడులకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియా వేదిక ఎక్స్‌లో షేర్ చేసింది.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్‌తో అణు ఒప్పందం కోసం దౌత్యపరమైన మార్గాలను అనుసరించాలని చెప్పారు. ఇరాన్ అణు కార్యక్రమాలపై ఒప్పందం కుదుర్చుకోవాలని ట్రంప్ హెచ్చరించారు. దాడులతో ఎలాంటి పరిష్కారం రాదని, ఇరాన్ తమతో చర్చలు జరపాలని సూచించారు. ఇరాన్ నేతలు తన సలహాలను పట్టించుకోవడం లేదని, ఈ దాడుల వల్ల భారీ నష్టం జరిగిందని ట్రంప్ సోషల్ మీడియాలో రాసుకొచ్చారు. అమెరికాతో ఒప్పందం చేసుకోకపోతే ఇంకా దారుణమైన పరిణామాలు ఎదురవుతాయని హెచ్చరించారు.
అమెరికా అత్యాధునిక సైనిక సామగ్రిని తయారు చేస్తోందని.. ఈ పరికరాలు ఇజ్రాయెల్ వద్ద ఉన్నాయని, వాటిని ఎలా ఉపయోగించాలో ఇజ్రాయెల్‌కు తెలుసని ట్రంప్ చెప్పారు. ఇరాన్ ఇప్పటికే చాలా ప్రాణ నష్టాన్ని, విధ్వంసాన్ని చవిచూసిందని, ఇక చర్చల ద్వారా ఒప్పందం చేసుకోవాలని సూచించారు. ఒప్పందం కుదిరితే ఇక మరణాలు, నష్టాలు ఉండవని ట్రంప్ అన్నారు.
ఈ దాడుల్లో ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్ చీఫ్ హొస్సేన్ సలామీ, మిలిటరీ చీఫ్ మహమ్మద్ బాఘేరి మరణించారు. ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ఈ దాడులను ‘ఆపరేషన్ రైజింగ్ లయన్’ అని పేర్కొన్నారు. ఇరాన్ అణు కార్యక్రమాలను అడ్డుకోవడానికి ఈ దాడులు జరిగాయని తెలిపారు.
Also Read: ఇజ్రాయెల్ వైమానిక దాడుల్లో ఇరాన్ సైనికాధిపతి హతం.. ఇక యుద్ధమే?
ఇరాన్‌పై ట్రంప్ కక్ష
ఇరాన్ పై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కక్ష కట్టినట్లు కనిపిస్తోంది. అందుకే ఈ దాడులను సమర్థిస్తూ, ఇజ్రాయెల్ అద్భుతంగా పనిచేస్తోందని ఆయన కొనియాడారు. అమెరికా ఒప్పందాన్ని ఇరాన్ తిరస్కరించడం వల్లే ఈ పరిణామాలు ఎదురవుతున్నాయని పేర్కొన్నారు. ఇరాన్ నేతలు తమ సలహాలను విస్మరిస్తున్నారని, దీనివల్ల మరింత నష్టం జరుగుతుందని హెచ్చరించారు. ఈ ఉద్రిక్తతలతో పశ్చిమాసియా మరోసారి యుద్ధ రంగంగా మారింది. ఇరాన్ అణు స్థావరాలపై దాడులు కొనసాగుతున్నాయి. ఈ పరిస్థితి ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతను మరింత పెంచింది. అంతర్జాతీయ సమాజం ఈ పరిణామాలను ఆందోళనతో గమనిస్తోంది.