Israel Hamas Ramadan Deal | గాజా యుద్ధంలో ఇజ్రాయెల్, హమాస్ మధ్య తొలి దశ కాల్పుల విరమణ ఒప్పందం గడువు శనివారం నాటికి ముగిసింది. అయితే ముస్లింల పవిత్ర మాసమైన రంజాన్ సందర్భంగా గాజాలో కొనసాగుతున్న తొలి దశ కాల్పుల విరమణను పొడిగించాలనే ప్రతిపాదనకు ఇజ్రాయెల్ అంగీకరించింది. అమెరికా చేసిన ఈ ప్రతిపాదనకు తాము మద్దతు ఇస్తున్నట్లు ఇజ్రాయెల్ ప్రధానమంత్రి కార్యాలయం ఆదివారం ఒక ప్రకటనలో తెలిపింది.
ఈజిప్టు, ఖతార్ దేశాల మధ్యవర్తిత్వంతో ఇజ్రాయెల్, హమాస్ మధ్య కుదిరిన తొలి దశ కాల్పుల విరమణ ఒప్పందం శనివారం నాటికి ముగిసినా.. రంజాన్ మాసం ప్రారంభం కావడంతో తొలి దశ ఒప్పందాన్ని కొనసాగించాలని అమెరికా ప్రత్యేక రాయబారి స్టీవ్ విట్కోవ్ ప్రతిపాదించారు. ఈ ప్రతిపాదనకు ఇజ్రాయెల్ తాజాగా అంగీకరించింది. ఈ ఒప్పందం ప్రకారం.. హమాస్ తమ చెరలో ఉన్న బందీల మృతదేహాలను రెడ్ క్రాస్‌కు అప్పగించనున్నట్లు తెలుస్తోంది. దీనికి బదులుగా ఇజ్రాయెల్ తమ జైళ్లలో ఉన్న అనేక పాలస్తీనా ఖైదీలకు స్వేచ్ఛ కల్పించనున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. ఈ క్రమంలో కాల్పుల విరమణ రెండో దశ ఒప్పందంపై ఇరుపక్షాల మధ్య ఏకాభిప్రాయం కుదరడానికి అవకాశం ఉంది. అయితే రెండో దశ ఒప్పందాలను త్వరగా పూర్తి చేయాలని ఇజ్రాయెల్ ప్రజలు బిగిన్ స్ట్రీట్‌లో నిరసనలు చేశారు. ఈ నిరసనలలో ఎక్కువ శాతం హమాస్ చెరలో ఉన్న బందీల కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.
Also Read: గాజా యుద్ధం మళ్లీ ప్రారంభం?.. ఒప్పందంపై ఇజ్రాయెల్ యూ టర్న్
అమెరికా నుంచి 300 కోట్ల డాలర్ల ఆయుధాలు
ఒకవైపు గాజాలో శాశ్వత శాంతి కోసం చర్చలు జరుగుతున్న సమయంలో.. అమెరికా 300 కోట్ల డాలర్ల విలువైన ఆయుధాలను ఇజ్రాయెల్‌కు పంపేందుకు అనుమతి ఇచ్చింది. ఈ ఆయుధాలలో గాజా యుద్ధంలో హమాస్‌కు వ్యతిరేకంగా ఇజ్రాయెల్ ఉపయోగించిన 2 వేల పౌండ్ల బాంబులు కూడా ఉన్నాయి. ఈ ఆయుధాల సరఫరాకు సంబంధించిన నోటిఫికేషన్‌లను ట్రంప్ ప్రభుత్వం అమెరికా కాంగ్రెస్‌కు పంపినట్లు అమెరికా విదేశాంగ శాఖ తెలిపింది. ఈ ఆయుధాల సరఫరా వచ్చే ఏడాది ప్రారంభమవుతుంది.
బందీల విడుదల, రెండో దశ చర్చలు
ఇజ్రాయెల్, హమాస్ మధ్య తొలి దశ కాల్పుల విరమణ ఒప్పందం ప్రకారం.. హమాస్ తమ చెరలో ఉన్న 94 మంది బందీలలో ఇప్పటికే చాలా మందికి స్వేచ్ఛ కల్పించగా, ఇజ్రాయెల్ తమ జైళ్లలో ఉన్న పాలస్తీనా ఖైదీలను విడుదల చేసింది. ఈ తొలి దశ ఒప్పందం శనివారం ముగిసింది. రెండో దశ ఒప్పందానికి సంబంధించిన చర్చలు ఈజిప్టు రాజధాని కైరోలో కొనసాగుతున్నాయి. కానీ ఈ చర్చల్లో ఎలాంటి పురోగతి లేదని హమాస్ పేర్కొంది. ఈ చర్చలలో హమాస్ నేరుగా పాల్గొనకపోయినా, తన అభిప్రాయాన్ని మధ్యవర్తులైన ఈజిప్ట్, ఖతార్ ద్వారా తెలుపుతోంది. అమెరికా కూడా మధ్యవర్తగా ఉన్న చర్చలకు ఇజ్రాయెల్ తరపున ప్రతినిధుల బృందం కైరోకు చేరుకుంది.