Israel Army Chief : హమాస్ తో కాల్పుల విమరణ ఒప్పందం కుదిరిన తర్వాత ఇజ్రాయిల్ లో కీలక పరిణామం చోటుచేసుకుంది. అక్టోబరు 7, 2023న గాజాకు చెందిన పాలస్తీనా హమాస్ ముష్కరుల చొరబాటును సమర్థవంతంగా నిరోధించడంలో వైఫల్యం చెందినట్లు అంగీకరించిన ఇజ్రాయిన్ ఆర్మీ చీఫ్.. తన పదవికి రాజీనామా చేశారు. సరిహద్దుల్లో భారీ దాడులకు ఛాందస ఉగ్రవాదులు పాల్పడినప్పుడు ఎదుర్కోవడంలో ఇజ్రాయిల్ ఆర్మీ విఫలమైందని అన్నారు. ఆ ఘటనకు తానే పూర్తి బాధ్యత వహిస్తానన్న ఇజ్రాయెల్ ఆర్మీ చీఫ్ హెర్జి హలేవి.. మార్చి 6న రాజీనామా చేస్తానని ప్రకటించారు. ప్రస్తుత పరిస్థితుల్లో.. పశ్చిమాసియాలో ఇదో పెద్ద మార్పుగా విశ్లేషకులు భావిస్తున్నారు.
కొద్దిసేపటి క్రితం ఇజ్రాయిల్ ఆర్మీ చీఫ్ తన రాజీనామా లేఖను విడుదల చేయగా.. అందులో కొన్ని ఆసక్తికర విషయాల్ని పంచుకున్నారు. అక్టోబరు 7 నాటి ఘటనకు సంబంధించి.. ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ విచారణను పూర్తి చేస్తానని హామి ఇచ్చారు. సరిహద్దుల్లో, చుట్టుపక్కల ఉన్న ఉగ్రవాదుల నుంచి ఎదురవుతున్న భద్రతా సవాళ్లను సమర్థవంతంగా ఎదుర్కొనేలా.. IDF సంసిద్ధతను బలోపేతం చేస్తానని హలేవి ప్రకటించాడు. IDF కమాండ్ గా సమర్థుడైన అధికారిని సిఫార్సు చేస్తానని వెల్లడించిన ఇజ్రాయిల్ ఆర్మీ చీఫ్.. తన స్థానంలో రానున్న వ్యక్తి పేరును ప్రకటించలేదు.
అక్టోబరు 7న ముష్కరులు జరిపిన దాడుల్లో 1,200 మంది ఇజ్రాయెల్‌లు మరణించగా.. దాదాపు 250 మందిని బందీలుగా పట్టుకున్నారు. ఆ దేశ చరిత్రలోనే అతిపెద్ద భద్రతా వైఫల్యంగా దీన్ని పరిగణిస్తున్నారు. కాగా.. ఈ ఘటనపై స్టేట్ ఎంక్వైరీకి ఆదేశించాలని అక్కడి ప్రజలు, ప్రతిపక్షాల నుంచి డిమాండ్ ఉంది. కానీ.. ఇజ్రాయిల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు ప్రభుత్వం ఆర్మీ, భద్రతా సంస్థలపై స్టేట్ ఎక్వైరీని తీవ్రంగా ప్రతిఘటిస్తోంది. ఈ నేపథ్యంలోనే.. రాజీనామా లేఖలో ఆర్మీ చీఫ్ కీలక వ్యాఖ్యలు చేశారు. అక్టోబర్ 7న ఇజ్రాయెల్ పౌరులను రక్షించే విషయంలో.. ఇజ్రాయిల్ డిఫెన్స్ ఫోర్స్ తన లక్ష్యాల్ని నెరవేర్చడంలో విఫలమైందని.. రక్షణ మంత్రి ఇజ్రాయెల్ కాట్జ్‌కి రాసిన లేఖలో వెల్లడించారు.
ఒకవైపు హమస్, మరోవైపు ఇరాన్ సహా ఇతర ఛాందస, అతివాద ముష్కర సంస్థలతో ఏకకాలంలో యుద్ధాన్ని నడిపిన ఇజ్రాయిల్.. ఆయా సంస్థల్ని తీవ్రంగా దెబ్బతీసింది. వాటి ఉనికిని ప్రశ్నార్థకం చేసింది. అయితే.. ఇజ్రాయెల్ నిర్దేశించుకున్న యుద్ధ లక్ష్యాలలో అన్నింటినీ సాధించలేదని తెలిపిన ఆర్మీ చీఫ్ హెర్జి హలేవి.. కొన్ని ముఖ్యమైన విజయాలను సాధించి, దేశాన్ని రక్షించుకున్నట్లు ప్రకటించారు. అలాగే.. హమాస్, దాని పాలక సామర్థ్యాలను మరింత కూల్చివేయడానికి, బందీలను తిరిగి వచ్చేలా చేయడానికి సైన్యం పోరాడుతూనే ఉంటుందని తెలిపారు.
యుద్ధ సంక్షోభ సమయంలో వలసలు వెళ్లిన ఇజ్రాయిల్ దేశస్తులు తిరిగి వారివారి ప్రాంతాలకు తిరిగి చేరుకునేందుకు ఇజ్రాయిల్ సైన్యం సాయం చేస్తుందని తెలిపారు. కాగా.. ఆనాటి ఘటనలో కీలక వైఫల్యం చోటుచేసుకున్న గాజా వైపు సైనికాధికారులు కూడా ఇదే బాట పట్టారు. దేశంపై దాడులకు బాధ్యత వహిస్తున్న ఇజ్రాయెల్ దక్షిణ సైనిక కమాండ్ అధిపతి మేజర్ జనరల్ యారోన్ ఫింకెల్మాన్ కూడా రాజీనామా సమర్పించారు.
Also Read : ఇకపై పౌరసత్వం సులువు కాదు.. ట్రంప్ ఆదేశాలు చూసి అంతా షాక్.. ఎందుకు ఇంత తొందర..
ఇజ్రాయెల్ చరిత్రలోనే అత్యంత ఘోరమైన దాడిగా నిలిచిపోతూ.. దాదాపు 15 నెలల పాటు యుద్ధం కొనసాగింది. అనంతరం.. అంతర్జాతీయ ఒత్తిళ్లు, హమాస్ నేతల సంప్రదింపులతో ఇరువురి మధ్య కాల్పుల విరమణ ఓ కొలిక్కి వచ్చింది. ఆ వెంటనే సైన్యాధిపతి, కమాండ్ సెంటర్ అధిపతులు రాజీమానాలు సమర్పించడం చర్చనీయాంశమవుతోంది.