Botulism Outbreak: ఇటలీలో జరిగిన ఒక విషాదకర సంఘటన ప్రపంచవ్యాప్తంగా వార్తల్లో నిలిచింది. ఒక ప్రసిద్ధ సంగీతకారుడు — లూయిజీ డి సార్నో… కేవలం ఒక సాండ్‌విచ్ తిన్నందుకు ప్రాణాలు కోల్పోయాడు. ఆ సాండ్‌విచ్‌లో ఏముంది? ఎలా అతని జీవితం ఒక్కసారిగా ఆగిపోయింది? ఇంకా ‘బోటులిజం’ అని పిలిచే ఈ ప్రాణాంతక వ్యాధి అసలు ఏమిటి? ఇవన్నీ ఈ రోజు తెలుసుకుందాం.
ఇటలీకి చెందిన 52 ఏళ్ల లూయిజీ డి సార్నో నాపుల్స్ ప్రావిన్స్‌లోని సెర్కోలా ప్రాంతానికి చెందిన మ్యూజీషియన్. ఇటీవలే కుటుంబంతో కలిసి కాలాబ్రియా ప్రాంతానికి సెలవుల కోసం వెళ్లి వచ్చాడు. తిరుగు ప్రయాణంలో, డైమాంటే పట్టణంలో ఒక వీధి ఫుడ్ ట్రక్ వద్ద ఆగి బ్రోకోలీ, సాసేజ్ సాండ్‌విచ్ ఆర్డర్ చేశారు. సాదాసీదా వీధి భోజనం అనుకున్నా… అదే అతనికి చివరి భోజనం అయ్యింది. సాండ్‌విచ్ తిన్న తరువాత వారు తమ ప్రయాణం కొనసాగించారు. కానీ లాగోనెగ్రో దగ్గర హైవేపై డ్రైవ్ చేస్తుండగా, లూయిజీ అకస్మాత్తుగా అస్వస్థతకు గురయ్యాడు.
శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, తల తిరగడం, శరీరం బలహీనపడటం — కొన్ని నిమిషాల్లోనే అతను కుప్పకూలిపోయాడు. కుటుంబ సభ్యులు వెంటనే అత్యవసరంగా ఆసుపత్రికి తరలించేందుకు ప్రయత్నించినా, సమీపంలోని అన్నున్జియాటా హాస్పిటల్ చేరుకునేలోపు ప్రాణాలు విడిచాడు. అతనితో పాటు, అదే చోట సాండ్‌విచ్ తిన్న మరో తొమ్మిది మంది కూడా ఆసుపత్రికి తరలించబడ్డారు. వారిలో ఇద్దరు టీనేజర్లు, నలభై ఏళ్ల వయసు గల ఇద్దరు మహిళలు ఉన్నారు. వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. ఈ ఘటనతో, ఇటలీలో ఇప్పటికే ఆందోళన కలిగిస్తున్న ‘బోటులిజం’ వ్యాధి వ్యాప్తిపై మరింత భయం పెరిగింది.
బోటులిజం అంటే ఏమిటి?
అమెరికా CDC (Centers for Disease Control and Prevention) వివరాల ప్రకారం, బోటులిజం అనేది అత్యంత ప్రమాదకరమైన వ్యాధి. దీన్ని Clostridium botulinum అనే బాక్టీరియా కలిగించే విషం కారణంగా వస్తుంది. ఈ టాక్సిన్ శరీరానికి వెళ్లిన వెంటనే నరాలను దెబ్బతీసి, మసిల్ ప్యారాలిసిస్ (కండరాల మూర్చ), శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, కంటి చూపు మందగించడం, కనురెప్పలు వంగిపోవడం వంటి లక్షణాలు కలిగిస్తుంది. కొన్ని సందర్భాల్లో మరణానికీ దారి తీస్తుంది.
సాధారణంగా బోటులిజం ఆహారం ద్వారా వ్యాపిస్తుంది — దీనిని ఫుడ్‌బోర్న్ బోటులిజం అంటారు. సరిగా ఉడికించని, లేదా పులియబెట్టిన ఆహారంలో ఈ బాక్టీరియా టాక్సిన్ ఏర్పడుతుంది. CDC చెబుతున్నదేమిటంటే — ఇంట్లో తయారు చేసిన కాచిన పదార్థాలు, సరిగా సీల్ చేయని ఆహారంలో ఇది ఎక్కువగా కనిపిస్తుంది. కానీ కొన్ని సందర్భాల్లో స్టోర్‌లో దొరికే రెడీ ఫుడ్‌లో కూడా ఈ విషం ఉండే అవకాశం ఉంది.
ఈ ఘటనకు కొద్ది రోజుల ముందు ఇటలీలోని సర్దీనియా ద్వీపంలో మరొక దారుణం జరిగింది. 38 ఏళ్ల మహిళ, ఒక ఉత్సవంలో టాకో విత్ గ్వాకమోలే తిన్న తరువాత బోటులిజం వల్ల మృతి చెందింది. అదే ఆహారం తిన్న 11 ఏళ్ల బాలుడు పరిస్థితి విషమించడంతో సర్దీనియా నుంచి రోమ్‌కు ఎయిర్ లిఫ్ట్ చేసి చికిత్స అందిస్తున్నారు. లూయిజీ డి సార్నో మరణం ఇటలీ అంతా కాక, ప్రపంచానికి ఒక హెచ్చరిక. ఆహారం తీసుకునే ముందు దాని నాణ్యత, భద్రత పట్ల జాగ్రత్తగా ఉండాలి. ఒక చిన్న నిర్లక్ష్యం… జీవితాన్ని సెకన్లలో మార్చేస్తుంది.