Wrong Baby In Woman Womb| కొన్ని సార్లు చిన్న చిన్న తప్పులు కూడా భయానక పరిస్థితులకు దారితీస్తాయి. వాటివల్ల జీవితాలే తారుమారవుతాయి. అప్పుడు కేవలం క్షమాపణలు కోరితే సరిపోదు.. భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. తాజాగా అస్ట్రేలియాలోని ఒక ఐవిఎఫ్ (IVF) సెంటర్ ఆస్పత్రిలో వైద్యులకు అదే పరిస్థితి ఎదురైంది. వారు చేసిన చిన్న తప్పు వల్ల వందల కోట్లు మూల్యం చెల్లించాల్సి వచ్చింది. అంతేకాదు వారి వద్ద చికిత్స చేయించుకున్న పేషెంట్ల జీవితాలు అయోమయ స్థితిలో ఉన్నాయి.
ఐవిఎఫ్ అంటే కృత్రిమ పద్ధతి ద్వారా పిల్లల్ని కనే ఒక వైద్య విధానం. మారుతున్న జీవనశైలి, జన్యుపరమైన సమస్యల కారణంగా చాలా మంది సంతాన సాఫల్య సమస్యలతో బాధపడుతున్నారు. సహజంగా గర్భం ధరించలేని వారు ఇప్పుడు కృత్రిమ పద్ధతుల ద్వారా పిల్లల్ని కనాలని చూస్తున్నారు. ఇది ప్రపంచవ్యాప్తంగా ఒక సాధారణమైన అంశంగా మారిపోయింది. దీని ఫలితంగా ఈ IVF సెంటర్ల బిజినెస్ జోరుగా సాగుతోంది. ప్రతి నగరంలో ఐవిఎస్ సెంటర్లు వెలుస్తున్నాయి. అయితే ఈ కృత్రిమ పద్ధతుల సంతాన సాఫల్య కేంద్రాలు చాలా మందికి ఆనందాన్ని ఇస్తుంటే.. మరికొందరికి చేదు అనుభవాలను మిగులుస్తున్నాయి.
ఇలాంటి విషాదకరమైన సంఘటన ఒకటి ఆస్ట్రేలియాలో చోటుచేసుకుంది. అక్కడి ప్రముఖ IVF సెంటర్ అయిన మోనాష్ IVF సెంటర్ లో జరిగిన ఒక పెద్ద తప్పిదం వెలుగులోకి వచ్చింది. ఆస్ట్రేలియాలో ఒక మహిళ సాధారణ పద్దతుల్లో గర్భం దాల్చలేక IVF ద్వారా గర్భం ధరించడానికి మోనాష్ ఐవిఎప్ తో చికిత్స తీసుకుంది. అదే సమయంలో మరో జంట కూడా బ్రిస్బేన్‌లోని అదే కేంద్రానికి గర్భవతి కావడానికి అక్కడి వైద్యుల సాయం తీసుకుంది. కానీ ప్రమాదవశాత్తూ, ఒక జంటకు చెందిన పిండాన్ని మరో మహిళ గర్భంలోకి ప్రవేశపెట్టారు. ఆ మహిళకు గర్భం సఫలమై, నవమాసాలు మోసి, ఎంతో ఆనందంతో బిడ్డకు జన్మనిచ్చింది. కానీ చివరికి తెలిసింది ఏమిటంటే, ఆమెకు పుట్టిన బిడ్డ ఆమెది కాదు –పూర్తిగా అపరిచితమైన మరో జంటకు చెందిన శిశువు.
ఈ తప్పిదం వల్ల తీవ్ర చట్టపరమైన, నైతిక సమస్యలు ఉత్పన్నమయ్యాయి. 2024 ఫిబ్రవరిలో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. దీనిపై స్పందించిన IVF కేంద్రం మోనాష్ తన తప్పును అంగీకరించింది. బాధితులందరికీ క్షమాపణలు తెలియజేసింది. అంతేకాకుండా వారికి భారీ నష్టపరిహారం కూడా చెల్లించింది. ఆ మొత్తం భారత కరెన్సీలో దాదాపు రూ.480 కోట్లు అని ఆస్ట్రేలియన్ బ్రాడ్‌కాస్టింగ్ కార్పొరేషన్ వెల్లడించింది.
Also Read: అందరికీ మటన్ బిర్యానీ పెట్టాలి లేకపోతే పెళ్లి క్యాన్సిల్.. వరుడు బ్లాక్ మెయిల్
ఇక్కడ అసలు సమస్య ఏంటంటే – ఇప్పుడు ఆ బిడ్డ ఎవరిది? నిజమైన బయోలాజికల్ తల్లిదండ్రులు ముందుకు వస్తే.. వారికి బిడ్డ అప్పగించాలా? లేదా? అన్నదానిపై చర్చ జరుగుతోంది. మోనాష్ IVF నిపుణులు ఈ ఘటనలో తమ తప్పును అంగీకరిస్తూ.. చికిత్సలో పాల్గొన్న రెండ జంటల జీవితాలను ప్రభావితం చేస్తుందని చెప్పారు. అయినప్పటికీ, ఈ తప్పు చేసిన ఓ శాస్త్రవేత్త(ఐవిఎఫ్ నిపుణుడు) బాధ్యతను ఎక్కువగా మోయాల్సి వస్తుందని వ్యాఖ్యానించారు.
అయితే ఆస్ట్రేలియాలో లేదా ఇతర దేశాల్లో ఇలాంటి ఘటనల గురించి కోర్టు కేసులు జరిగినట్లు దాఖలాలు లేవు. దీంతో అస్ట్రేలియాలోని ప్రస్తుత చట్టాల ప్రకారం.. జన్మనిచ్చిన తల్లిదండ్రులకే ఆ బిడ్డ చెందుతుందని న్యాయనిపుణులు అభిప్రాయపడుతున్నారు. అయితే జన్యు పరమైన తల్లిదండ్రుల అధికారాల గురించి ఇలాంటి కేసుల ప్రస్తావన రావడంతో కొత్త చట్టం తీసుకురావాల్సిన అవసరం ఏర్పడింది.