Joe Biden On US Elections | అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో తాను పోటీ చేయకపోవడం ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్ (Joe Biden) అసంతృప్తి వ్యక్తం చేశారు. మీడియా సమావేశంలో మాట్లాడుతూ, తాను ఎన్నికల్లో పోటీ చేసి ఉంటే డొనాల్డ్ ట్రంప్ (Donald Trump)ను తప్పకుండా ఓడించేవాడినని చెప్పారు.
అమెరికా అధ్యక్ష భవనం వైట్ హౌస్‌లో శుక్రవారం ప్రెసిడెంట్ బైడెన్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఓ జర్నలిస్ట్ అడిగిన ప్రశ్న.., “మీరు ఎన్నికల్లో పోటీ చేయకూడదని నిర్ణయించుకున్నందున, ఆ నిర్ణయం ట్రంప్ మళ్లీ అధ్యక్షుడి అవ్వడంలో సహాయపడిందని మీరు అనుకుంటున్నారా?”. దీనికి బైడెన్ ఇలా సమాధానమిచ్చారు: “నేను అలా అనుకోవడం లేదు. నేను పోటీ చేసి ఉంటే, ట్రంప్‌ను కచ్చితంగా ఓడించేవాడినని నాకు ఆ నమ్మకం ఉంది.”
అయితే.. , ట్రంప్‌ను ఓడించగలిగేందుకు కమలా హారిస్ (Kamala Harris) కూడా సమర్థురాలని ఆయన చెప్పారు. ఆమె అద్భుతంగా పని చేస్తుందని, ఆ కృషి వలన ట్రంప్‌ను ఓడించగలదనే నమ్మకం తనకు కలిగిందని నమ్మకంతోనే ఆమెకు మద్దతునిచ్చానని బైడెన్ స్పష్టం చేశారు. డెమోక్రటిక్ పార్టీలో ఐక్యత కోసమే తాను పోటీ నుంచి వైదొలిగినట్లు బైడెన్ తెలిపారు.
Also Read: హష్ మనీ కేసులో ట్రంప్ దోషి.. కానీ శిక్ష లేదు.. అధ్యక్ష పదవి చేపడతారా?
82 ఏళ్ల జో బైడెన్ అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో తొలుత పోటీ చేయాలని అనుకున్నప్పటికీ, తన ఆరోగ్య సమస్యలు, సొంత పార్టీ లోని వ్యతిరేకత రావడం కారణంగా పోటీ నుంచి వైదొలిగే నిర్ణయం తీసుకున్నారు. తరువాత, డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థిగా కమలాహారిస్‌కు మద్దతు ప్రకటించారు. ప్రజాస్వామ్యం రక్షణపై కేంద్రీకృతంగా, పదవుల కంటే ప్రజాస్వామ్యమే ముఖ్యమని, అందుకే తన నిర్ణయాన్ని సమర్థించుకున్నట్లు తెలిపారు. సమాజంలో ఉన్న విభజనను తొలగించడమే అవసరమని, నిరంకుశత్వం కంటే దేశం గొప్పదని బైడెన్ వ్యాఖ్యానించారు.
కమలా హ్యారిస్ నాలుగేళ్ల తరువాత మళ్లీ పోటీ చేస్తారు
2028 అంటే నాలుగేళ్ల తరువాత జరిగే అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో కమలా హ్యారిస్ పోటీచేసేందుకు సమర్థురాలని.. ఆమె తప్పకుండా మళ్లి పోటీ చేస్తారని బైడెన్ ఆశాభావం వ్యక్తం చేశారు. కానీ ఎన్నికల్లో పోటీ చేయాలనే నిర్ణయం మాత్రం చివరగా కమలా హ్యారిస్ తీసుకుంటారని అన్నారు.
భారత, ఆఫ్రికా మూలాలున్న అమెరికన్ కమలా హ్యారిస్ ను 2020లో బో బైడెన్ ప్రెసిడెంట్ గా ఎన్నికల్లో విజయం సాధించాక.. వైస్ ప్రెసిడెంట్ పదవి కట్టబెట్టారు. తొలి ఇండియన్ అమెరికన్, ఆఫ్రికన్ అమెరికన్ మహిళ అమెరికా ఉపాధ్యక్షురాలు కావడంతో ఆమె రికార్డు సృష్టించారు.
జనవరి 19, 2025న తన పదవికాలం పూర్తి కానుండడంతో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ జనవరి 15 జాతీయ టీవి ఛానెల్ లో తన వీడ్కోలు ప్రసంగం చేయనున్నారు. ఆ తరువాత జనవరి 20న ట్రంప్ అధ్యక్ష బాధ్యతలు చేపట్టనున్నారు.