July 2025 tsunami prediction: ఆమె కొన్నేళ్ల క్రితమే చెప్పింది… కాలం దగ్గర పడిందని… కానీ ఆమె చెప్పింది నిజమవుతుందని అందరూ అనుకున్నారు. ఆమె చెప్పిన మాట ఏమో కానీ, ఆ మాటలను నిజం చేసేలా ఘటన జరగడంతో ప్రస్తుతం ఆమె వార్తలోకి ఎక్కింది. ప్రపంచం మాత్రం సాధారణంగానే నడుస్తోంది అనుకున్నారు. కానీ ఒక్కసారిగా ప్రకృతి తేరుకుని ఊగిసలాడింది. ఎవరూ ఊహించని చోట, ఊహించిన కంటే భిన్నంగా ఓ హెచ్చరిక రూపం దాల్చింది. అసలేం జరిగిందంటే…
ఒక కల, ఒక భయంకరమైన ఊహ.. జూలై 2025లో సునామీ వస్తుందని 1999లో జపాన్ మాంగా కళాకారిణి రియో తత్సుకి చెప్పిన భవిష్యవాణి ఇప్పుడు మళ్లీ వార్తల్లోకెక్కింది. వతషి గ మితా మిరాయ్ (The Future I Saw) అనే ఆమె మాంగాలో పేర్కొన్న July 2025 భయంకర ప్రకృతి విపత్తు గురించి అప్పట్లో ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు. కానీ ఇటీవల రష్యా తూర్పు తీరంలో సంభవించిన 8.8 తీవ్రత గల భారీ భూకంపం తర్వాత, ఈ మాంగాలో చూపిన అంశాలపై మళ్లీ చర్చలు మొదలయ్యాయి.
ఈ భూకంపం వల్ల భారీ అలలు ఉత్పన్నం కాగా, అంతర్జాతీయ సముద్రపు తీరాలు అప్రమత్తం అయ్యాయి. ముఖ్యంగా జపాన్ పసిఫిక్ తీరప్రాంతాల్లో అధికారులు ముందస్తుగా సునామీ హెచ్చరికలు జారీ చేశారు. 3 మీటర్ల సునామీ అలలు వచ్చే అవకాశం ఉందని జపాన్ వాతావరణ శాఖ ప్రకటించింది. హొక్కైడో ప్రాంతంలో కేవలం 30 సెంటీమీటర్ల అలలే నమోదయ్యాయి. జనాల్లో భయం ఉన్నప్పటికీ, ఎలాంటి విధ్వంసం జరగలేదు. ప్రభుత్వం ముందుగానే అప్రమత్తమై తీర ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించింది. దీనితో పెద్ద ప్రమాదం తప్పింది.
ఇదే సమయంలో రష్యా కాంచట్కా తీరానికి సమీపంలో భూకంపం సంభవించి, అక్కడి తీరాలకు 3 నుంచి 4 మీటర్ల ఎత్తైన అలలు తాకాయి. అలల ప్రభావం రష్యాతో పాటు, అమెరికాలోని పశ్చిమ తీరానికి కూడా ఉన్నట్టు నిపుణులు తెలిపారు. అలాస్కా, హవాయి, కెలిఫోర్నియా తీర ప్రాంతాల్లో సునామీ హెచ్చరికలు జారీ అయ్యాయి. కొన్ని ప్రాంతాల్లో సముద్రపు నీరు లోపలికి ప్రవహించిన ఘటనలు సంభవించాయి. ఈ తరహా ప్రభావాలు తత్సుకి ఊహించిన మాదిరిగానే ఉన్నా.. ప్రాంతం మాత్రం భిన్నంగా ఉండడం గమనార్హం.
ఈ పరిణామాల నేపథ్యంలో తత్సుకి మాంగాలో చెప్పిన జపాన్‌లో సునామీ అనే హెచ్చరిక పట్ల ప్రజల్లో మళ్లీ చర్చ మొదలైంది. అవును, తత్సుకి July 2025లో సునామీ వస్తుందని చెప్పింది.. అది జపాన్‌ను తాకలేదేమో కానీ, సమీప దేశాలపై ప్రభావం చూపింది. తేడా ఏదైనా, హెచ్చరిక మాత్రం సమంజసంగా ఉందని సోషల్ మీడియాలో చర్చ మొదలైంది.
ఒక నెటిజన్ మాత్రం జపాన్‌లో పెద్ద సునామీ లేదని చూస్తే ఊపిరి పీల్చుకోవచ్చు. కానీ తత్సుకి చెప్పిన ప్రకృతి ప్రకోపం నిజంగానే జరిగినట్టుంది. కచ్చితమైన ప్రదేశం కాదు కానీ, కాలం సరిపోయిందంటూ కామెంట్ చేశారు. ఈ నేపథ్యంలో తత్సుకి చెప్పిన భవిష్యవాణిని విశ్లేషిస్తున్న వారిలో రెండు వర్గాల అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొందరికి ఇది యదార్థానికి దగ్గరగా అనిపిస్తుంటే, మరికొందరికి యాదృచ్చికంగానే కనిపిస్తోంది. అయినప్పటికీ, ఆమె మాంగాలో చెప్పిన విషయాలు కొన్ని వాస్తవ ఘటనలకు దగ్గరగా ఉండడం చాలా మందిని ఆశ్చర్యానికి గురిచేస్తోంది.
ప్రస్తుతం జపాన్ ప్రభుత్వం అప్రమత్తంగా వ్యవహరిస్తోంది. ప్రజలను ముందుగానే సురక్షిత ప్రాంతాలకు తరలించడం, సునామీ అలర్ట్‌లు సమర్థవంతంగా అమలు చేయడం వల్లే పెద్ద నష్టం తప్పింది. ఇది కూడా మానవ ప్రమేయంతో ప్రకృతి నష్టాన్ని ఎలా తగ్గించొచ్చో చూపించిన ఉదాహరణగా నిలిచింది.
చివరికి చెప్పాల్సిన విషయం ఒక్కటే.. ఒక కళాకారిణి ఊహించిందే నిజమయ్యేలా కనిపించింది. అయినా కూడా ప్రకృతి ఎప్పుడు, ఎక్కడ, ఎలా ప్రవర్తిస్తుందో మనం అంచనా వేయలేం. ముందు జాగ్రత్తలు, అప్రతిఖ్యాత పరిస్థితుల్లో అప్రమత్తంగా ఉండటం మాత్రమే మన చేతిలో ఉంటుంది. మాంగా ఒక గమనించదగ్గ హెచ్చరికను ఇచ్చిందా? లేదా అది కేవలం యాదృచ్ఛికతేనా? అనే ప్రశ్నలు కొనసాగుతూనే ఉన్నాయి. కానీ ఈ వాస్తవ సంఘటన మళ్లీ మానవాళికి ఒక స్పష్టం చేసిన బోధన ఒక్కటే.. ప్రకృతిని తక్కువ అంచనా వేయవద్దు.