Hanuman Song In Pak Temple: ఆంజనేయుడి గుడిలో రాముడి పాట వినిపించింది. ఇందులో విశేషం ఏముంది అనుకుంటున్నారా? హనుమాన్ గుడిలో రాముడి పాట వినిపించడం మామూలే కదా అంటారా? అవును. ఆంజనేయుడి గుడిలో రాముడి పాట వినిపించడం మామూలే. కానీ… రాముడి పాట వినిపించిన ఆ ఆంజనేయుడి గుడి పాకిస్థాన్‌లో ఉంది. ఆ రాముడి పాట కూడా తెలుగు పాట కావడం మరో విశేషం.
పాకిస్థాన్ గూఢచారిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న భారత యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా… రెండు నెలల కిందట పాకిస్తాన్ పర్యటనకు వెళ్లినప్పుడు… అక్కడి కటాస్‌రాజ్ ఆలయంపై ఓ వీడియో చేసి యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేసింది. ఆ వీడియోలో ఓ చోట తెలుగుపాట వినిపిస్తోంది. హనుమాన్ మందిరంలో కూర్చున్న ఓ భక్తుడు… భూకైలాస్ సినిమాలోని రాముని అవతారం, రవికుల సోముని అవతారం అనే పాటను పాడుతుండగా జ్యోతి మల్హోత్రా వీడియో షూట్ చేసింది. మందిరం గురించి వివరిస్తూ గుళ్లోకి వెళ్లిన ఆమె… ఆ భక్తుని పాటను డిస్టర్బ్ చేయకుండా… కాసేపు మౌనంగా ఉండిపోయింది.
Also Read: గాజాపై దాడులు ఇక చాలు.. ఇజ్రాయెల్‌కు మిత్ర దేశాల మాస్ వార్నింగ్
దాంతో… పాకిస్తాన్‌లోని ఆంజనేయుడి గుడిలో రాముడి పాట, అది కూడా తెలుగు పాట వినిపించడంతో.. పాడిన ఆ భక్తుడు ఎవరనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతం జ్యోతి మల్హోత్రా తీసిన వీడియో వైరల్ గా మారింది. తెలుగు వ్యక్తి పాకిస్తాన్ పర్యటనకు వెళ్లినప్పుడు గుళ్లో ఆ పాట పాడారా? లేక అక్కడే ఉంటున్న తెలుగు తెలిసిన భక్తుడు ఆ పాట పాడారా? అనే చర్చ జరుగుతోంది.