UK France Warn Israel| గాజా వాసులు తిండి నీరు లేక మానవ సంకోభంతో కొట్టుమిట్టాడుతున్న ఇజ్రాయెల్ దాడులు కొనసాగిస్తూనే ఉంది. గాజా ప్రాంతంపై పూర్తి విజయం సాధించాలనే లక్ష్యంతో సైనిక దాడులను ఇజ్రాయెల్ మరింత ఉధృతం చేసింది. ఈ క్రమంలో ఇటీవల ‘ఆపరేషన్ గిడియన్స్ చారియట్స్’ అనే పేరుతో మే 17న ఒక కొత్త ఆపరేషన్‌ను ప్రారంభించింది. ఈ దాడులు ప్రధానంగా ఉత్తర, దక్షిణ గాజాలోని ప్రాంతాలపై కేంద్రీకృతమయ్యాయి. ఈ చర్యల నేపథ్యంలో వందలాది మంది పాలస్తీనియన్లు ప్రాణాలు కోల్పోయారు. మే 14న జబాలియాలో జరిగిన ఇజ్రాయెల్ వైమానిక దాడుల్లో 48 మంది మృతి చెందగా, వారిలో 22 మంది చిన్నారులుగా గుర్తించారు. ఈ పరంపర ఏడాదికి పైగా జరుగుతూనే ఉంది.
ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ఈ దాడులపై స్పందిస్తూ.. హమాస్‌ను పూర్తిగా నిర్మూలించడం, నిరాయుధీకరణ చేయడం, బందీలను విడుదల చేయడమే లక్ష్యమని స్పష్టంగా చెప్పారు. అయితే ఇజ్రాయెల్ చేస్తున్న దాడులు హద్దులు దాటుతున్నాయని ప్రపంచ దేశాలు విమర్శిస్తున్న నేపథ్యంలో.. ఇజ్రాయెల్ మిత్ర దేశాలైన బ్రిటన్, ఫ్రాన్స్, కెనడా దేశాల నేతలు కూడా ముక్త కంఠంతో ఇజ్రాయెల్ ను హెచ్చరించారు. మే 19న ఒక ఉమ్మడి ప్రకటన విడుదల చేసి, ఇజ్రాయెల్ చేపడుతున్న సైనిక దాడులపై తీవ్ర విమర్శలు చేశారు. అమాయక ప్రజల ప్రాణాలను బలిగొంటున్న ఈ దాడులను తక్షణం ఆపకపోతే కఠిన ఆంక్షలు విధిస్తామని హెచ్చరించారు.
ఈ దేశాలు గాజాలో తక్షణ కాల్పుల విరమణ కోసం అమెరికా, ఖతార్, ఈజిప్ట్‌లు చేస్తున్న ప్రయత్నాలకు మద్దతు ప్రకటించాయి. అయితే గాజాలో ప్రస్తుతం తీవ్ర మానవతా సంక్షోభం నెలకొంది. మునుపటి దాడుల అనంతరం మార్చి నుండి గాజాకు ఆహారం, ఔషధాలు, ఇంధనాన్ని ఇజ్రాయెల్ నిలిపివేసింది. ఫలితంగా పౌరులు తాగునీటి కోసం తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. ఇజ్రాయెల్ ఇటీవలే గాజాకు పరిమిత ఆహార సహాయాన్ని అనుమతించింది. కానీ ఐక్యరాజ్య సమితి (యూఎన్) ఈ సహాయాన్ని “సముద్రంలో ఒక చుక్క”గా అభివర్ణిస్తూ.. పరిస్థితిని బట్టి మరింత సహాయం అవసరమని పేర్కొంది.
Also Read: ఏఐ ఉందిగా అని ఉద్యోగులను తొలగించిన కంపెనీ.. నిండా మునిగింది
ఇక శాంతి చర్చల విషయానికి వస్తే.. ఖతార్ రాజధాని దోహాలో మధ్యవర్తిత్వ చర్చలు జరుగుతున్నాయి. అమెరికా, ఖతార్, ఈజిప్ట్ ఈ చర్చల్లో పాల్గొంటుండగా.. హమాస్ 60 రోజుల కాల్పుల విరమణ, రోజుకు 400 సహాయ ట్రక్కుల ప్రవేశానికి అనుమతి వంటి ప్రతిపాదనలు ఇచ్చింది. అయితే ఇజ్రాయెల్ ఈ ప్రతిపాదనలపై ఇంకా స్పష్టంగా అంగీకరించలేదు. గతంలో గాజా నుంచి సైన్యం ఉపసంహరించేందుకు ఇజ్రాయెల్ నిరాకరించింది. పైగా సైనిక దాడులు మరింత ఉధృతం చేసింది. ఇప్పుడు కూడా హమాస్ పూర్తిగా ఆయుధాలు వదిలి సరెండర్ చేయకపోతే యుద్ధం ఆగదని తేల్చి ఇజ్రాయెల్ ప్రధాని నెత్యన్యాహు తేల్చి చెప్పారు.
కానీ ఇంతవరకు జరిగిన దాడుల వల్ల అమాయక గాజా పౌరులపై తీవ్ర ప్రభావం పడుతోంది. పిల్లలు, మహిళలు సహా వేలాది మంది నిరాశ్రయులయ్యారు. పౌర సదుపాయాలు నాశనమయ్యాయి. మానవతా సంక్షోభం నెలకొంది. పోషకాహార లోపంతో పిల్లలు చనిపోతున్నారు. ఇప్పటికైనా ఇజ్రాయెల్, హమాస్ ఇరుపక్షాలు చర్చలతో ముందుకు సాగి శాంతి మార్గం ఎంచుకోవాలన్నది అంతర్జాతీయ సమాజం ఆకాంక్షిస్తోంది.