CIA Secret Base In India| ఒకప్పుడు భారతదేశంలో అమెరికా రహస్యంగా సీఐఏ (Central Intelligence Agency – CIA) స్థావరాలను నిర్వహించింది. 1963లో ఆ దేశ మాజీ అధ్యక్షుడు జాన్ ఎఫ్ కెన్నడీ హత్యకు గురయ్యారు. దీనికి సంబంధించిన కీలకమైన ఫైల్స్ (JFK Files)ను తాజాగా ట్రంప్ ప్రభుత్వం బహిర్గతం చేయడంతో భారత్ లో సిఐఎ రహస్య స్థావరాలు కలిగి ఉన్న విషయం వెలుగులోకి వచ్చింది. రష్యాకు చెందిన ఆర్టీ మీడియా హౌస్ ఆ వివరాలను వెల్లడించే పత్రాన్ని.. ఎక్స్‌లో పోస్ట్ చేసింది. భారత్‌లోని న్యూఢిల్లీ, కోల్‌కతాల్లో అమెరికా నిఘా సంస్థ అయిన సీఐఏకు రెండు స్థావరాలు ఉండేవని దీనిలో ఉంది. వీటిని “బ్లాక్ సైట్స్”గా అభివర్ణించేవారు. అనుమానాస్పద వ్యక్తులను బంధించడంతో సహా పలు రకాల రహస్య ఆపరేషన్లకు వీటిని వినియోగించేవారని తెలుస్తోంది.
ఇక జాబితాలో కేవలం భారత్‌లోని ప్రదేశాలే కాదు.. ప్రపంచవ్యాప్తంగా ఆ నిఘా సంస్థకు గతంలో స్థావరాలున్న నగరాల పేర్లున్నాయి. వీటిలో పాకిస్థాన్‌కు చెందిన రావల్ఫిండి, శ్రీలంకలోని కొలంబో, ఇరాన్‌లోని టెహ్రాన్, దక్షిణ కొరియాలోని సియోల్, జపాన్‌లోని టోక్యో వంటి నగరాల పేర్లున్నాయి. ఈ స్థావారాల్లో అమెరికాకు వ్యతిరేకంగా ఎవరైనా కుట్రలు పన్నుతున్నారు లేదా ఏదైనా కార్యలు చేస్తున్నారనే అనుమానితులను చట్టవ్యతిరేకంగా అరెస్టు చేసి నిర్బంధిచేవారని సమాచారం. వారిని కోర్టులో ప్రవేశ పెట్టడం అనేది జరగదు. నిఘా వర్గాలు ఆ అనుమానితులను బంధించి చిత్రహింసలు పెట్టి సమాచారం రాబట్టేవారని తెలుస్తోంది.
భారత్ సిఐఏ మధ్య అనుబంధం
రెండో ప్రపంచ యుద్ధం తరువాత అమెరికా, రష్యా దేశాల మధ్య కోల్డ్ వార్ జరిగింది. ప్రపంచంలో అతిపెద్ద శక్తిగా ఎదిగిన అమెరికాకు రష్యా అతిపెద్ద శత్రు దేశంగా అవతరించింది. కానీ ఈ రెండు దేశాల మధ్య ఎప్పుడూ నేరుగా యుద్ధాలు జరగలేదు కానీ వియత్నాం, కొరియా అంతర్యుద్ధాల్లో రెండు దేశాలు ఎదురెదురుగా నిలబడ్డాయి. దీంతో రష్యాను బలహీన పరిచేందుకు అమెరికా ప్రపంచవ్యాప్తంగా గూఢాచార స్థావరాలు ఏర్పాటు చేసుకుంది. ఈ క్రమంలో అమెరికాతో మంచి సంబంధాలున్న ఇండియా కూడా నిఘా సమాచారం కోసం సిఐఏ తో సహకరించింది.
గతంలో కూడా సీఐఏకు సంబంధించి భారత్‌లో కార్యకలాపాలు జరిగినట్లు కథనాలు వెలువడ్డాయి. 2013లో బహిర్గతం చేసిన అధికారిక పత్రాలను ఉటంకిస్తూ ఆంగ్ల వార్తా సంస్థ పీటీఐ ఓ కథనం ప్రచురించింది. గతంలో ఒడిశాలోని చార్బాటియా ఎయిర్‌బేస్‌ను వాడుకొనేందుకు అమెరికాకు భారత ప్రభుత్వమే అనుమతించిందన్నది దీని సారాంశం. 1962లో చైనా భూభాగంపై నిఘా కోసం సీఐఏకు చెందిన యూ-2 విమానం రీఫ్యూయలింగ్ కోసం దీనిని వాడారని పేర్కొంది. వాస్తవానికి ఆ ఎయిర్‌బేస్‌ను రెండో ప్రపంచ యుద్ధ సమయంలో ఉపయోగించారు. ఈ రహస్య గూఢాచార స్థావరాలు ముఖ్యంగా రష్యాకు వ్యతిరేకంగా పనిచేసేవి. ఆసియా దేశాలతో పాటు ఉక్రెయిన్, ఇతర యురోప్ దేశాల్లో కూడా అమెరికా రహస్య స్థావరాలున్నాయి.
ట్రంప్ ఆదేశాలతో రహస్య దస్తావేజులు బహిర్గతం
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీని నిలబెట్టుకొంటూ జాన్ ఎఫ్ కెన్నడీ హత్య దర్యాప్తు ఫైల్స్‌ను విడుదల చేశారు. దీనిలో సీఐఏ పాత్రపై పలు ఆసక్తికర విషయాలు ఉన్నాయి. కెన్నడీ హత్య రహస్య ఫైల్స్ సమాచారం మొత్తం 2,200 ఫైల్స్ లో ఉన్నాయి. ఇందులో 63 వేల పేజీలు ఉండడం గమనార్హం. అమెరికాలోని నేషనల్ ఆర్కీవ్స్ అండ్ రికార్డ్స్ అడ్మినిస్ట్రేషన్ వీటిని బహిర్గతం చేసింది. 1961లో అమెరికా 35వ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన జాన్ ఎఫ్.కెనడీ.. 1963 నవంబరు 22న డల్లాస్‌లో హత్యకు గురయ్యారు. డల్లాస్ లో ఆయన ప్రయాణిస్తుండగా.. ఆ కాన్వాయ్ లోకి దూసుకొచ్చిన ఒక దుండగుడు వెనక నుంచి ఆయనపై కాల్పులు జరిపాడు. ఆ వ్యక్తి పేరు లీ హార్వే ఓస్వాల్డ్ అని తెలిసింది. అయితే లీ హార్వేని పోలీసుల ఆధీనంలో ఉన్నప్పుడు.. హత్యకు గురికావడం షాకింగ్ విషయం. హార్వేను హత్య చేసిన నేరస్తుడు కూడా జైలు శిక్ష అనుభవిస్తున్న సమయంలో క్యాన్సర్ సోకి మరణించాడు. ఆ నాటినుంచి కెనడీ హత్య కేసు మిస్టరీ పరిష్కారం కాలేదు.