MMTS Extension To Airport: హైదరాబాద్ లో విస్తృతమైన రైల్వే విస్తరణ పనులు కొనసాగుతున్నాయి. ఓ వైపు మెట్రో ఫేజ్-II ప్రాజెక్ట్ పనులు వేగంగా జరుగుతున్నాయి. అదే సమయంలో మెరుగైన కనెక్టివిటీ కోసం ఉమ్దానగర్ నుంచి రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం వరకు మల్టీ-మోడల్ ట్రాన్స్ పోర్ట్ సిస్టమ్ (MMTS) లైన్ ను విస్తరించే ప్రతిపాదన తెరపైకి వచ్చింది. గతంలో, MMTS ఫేజ్-II కింద దక్షిణ మధ్య రైల్వే (SCR) ఉమ్దానగర్ నుంచి విమానాశ్రయానికి రైల్వే లైన్ ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఈ రైల్వే లింక్ కోసం అవసరమైన భూమిని GMR అధికారులు కేటాయించినట్లయితే, ప్రయాణీకులు రైలు ద్వారా నేరుగా విమానాశ్రయానికి చేరుకోవడానికి వీలు కల్పించడం ఈ ప్రణాళిక లక్ష్యం.
అవసరమైన భూమి అప్పగించకపోవడంతో..
కానీ, ప్రాజెక్ట్ అమలు సమయంలో ముఖ్యంగా డబ్లింగ్, విద్యుదీకరణ పనుల సమయంలో, GMR పూర్తి లింక్ కోసం అవసరమైన ఆరు కిలోమీటర్లకు బదులుగా మూడు కిలోమీటర్ల భూమిని మాత్రమే ఇచ్చింది. ఈ కేటాయింపు వల్ల పనులు పూర్తి కాలేకపోయాయి. ప్రయాణికులు మిగిలిన దూరాన్ని కవర్ చేయడానికి ఖరీదైన ప్రత్యామ్నాయ ప్రయాణ ఎంపికలపై ఆధారపడవలసి వస్తుంది. అప్పటి SCR జనరల్ మేనేజర్ పదే పదే ఈ రైల్వే లైన్ కు సంబంధించిన భూ కేటాయింపుల కోసం ప్రయత్నాలు చేసినప్పటికీ, రాష్ట్ర ప్రభుత్వం, GMR రెండింటితో అనేక రౌండ్ల చర్చలు జరిపినప్పటికీ, రూ. 85 కోట్లతో ప్రత్యక్ష రైలు కనెక్టివిటీ ప్రతిపాదనను పక్కన పెట్టాల్సి వచ్చింది.
మరోసారి తెరమీదికి వచ్చిన రైల్వే లైన్ విస్తరణ పనులు
ఉమ్దానగర్ నుంచి విమానాశ్రయానికి రైల్వే లైన్ ఏర్పాటు చేయడం వల్ల నగరం అంతటి నుంచి MMTS సేవలు పొందే అవకాశం ఉంది. ఈ స్టేషన్ కు హైదరాబాద్ లోని అన్ని ప్రాంతాలన నుంచి MMTS సర్వీసులు వస్తాయి. ఇక్కడి నుంచి 22 రోజువారీ రైళ్లు నడుస్తాయి. ఇది ప్రస్తుతం రోజుకు 1,800 నుంచి 2,000 మంది ప్రయాణికులు ఉమ్దానగర్ స్టేషన్ నుంచి రాకపోకలు కొనసాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ స్టేషన్ అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద ప్రయాణీకులకు మెరుగైన సౌకర్యాలు, మౌలిక సదుపాయాలను అప్ గ్రేడ్ చేయడానికి రూ. 12.37 కోట్లు కేటాయించింది కేంద్ర ప్రభుత్వం. ప్రస్తుతం ఈస్టేషన్ పునరుద్ధరణ పనులు కొనసాగుతున్నాయి.
Read Also: పండుగ సీజన్ లో కన్ఫార్మ్ టికెట్ కావాలా? ఈ టిప్స్ ఫాలో అయిపోండి!
ఇప్పుడు ఉమ్దానగర్ నుంచి శంషాబాద్ వరకు MMTS రైల్వే లైన్ విస్తరించేందుకు ప్రభుత్వం దగ్గరికి ప్రతిపాదనలు వస్తున్నాయి. ఢిల్లీలో మాదిరిగానే, ఇక్కడ కూడా MMTS రైల్వే లైన్ ఉంటే, ప్రయాణీకులు హైదరాబాద్ అంతటికీ ఈజీగా రాకపోకలు కొనసాగించే అవకాశం ఉందని భావిస్తున్నారు. పర్యావరణ అనుకూల ప్రజా రవాణాకు మద్దతు ఇస్తూ రహదారులపై రద్దీని గణనీయంగా తగ్గిస్తుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ప్రభుత్వం ఈ రైల్వే లైన్ కోసం అవసరమైన భూమితో పాటు నిధులు కేటాయించాలని సూచిస్తున్నారు. ఈ రైల్వే లైన్ ద్వారా భవిష్యత్ లో రాకపోకలకు ఎంతో మేలు కలగనుందన్నారు.
Read Also: రూట్ అంతా ఒకే స్పీడ్.. ఈ ఐదు వందేభారత్ రైళ్లు వెరీ వెరీ స్పెషల్!