Lebanon Ceasefire Hezbollah| లెబనాన్ దేశంలోని హిజ్బుల్లా మిలిటెంట్లు బుధవారం తాము ఇజ్రాయెల్ పై యుద్ధంలో విజయం సాధించినట్లు ప్రకటించారు. ఇజ్రాయెల్, హిజ్బుల్లా మిలిటెంట్ల మధ్య గత రెండు నెలలకు పైగా కొనసాగిన యుద్ధంలో ఇరువర్గాలు బుధవారం నవంబర్ 27, 2024న సంధికి అంగీకారం తెలుపుతూ కాల్పుల విరమణ చేశాయి. ఆ వెంటనే హిజ్బుల్లా మిలిటెంట్లు.. “తాము యుద్ధంలో అల్లా దయవల్ల గెలిచామని.. ఒక వేళ మళ్లీ పోరాడాల్సి వస్తే.. తమ సైనికులు సిద్ధంగా ఉన్నారని” ప్రకటించారు.
మరోవైపు ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహు లెబనాన్ లో కాల్పుల విరమణపై మీడియాతో సమావేశం చేశారు. కాల్పుల విరమణకు ఆయన మూడు కారణాలు తెలిపారు. ఇజ్రాయెల్ సైనికులు సుదీర్ఘంగా పోరాడుతున్నారని.. వారికి విశ్రాంతినివ్వడం తొలి కారణమన్నారు. భవిష్యత్తులో యుద్ధం చేయడానికి తమ వద్ద కావాల్సిన వనరులు సమకూర్చుకునేందుకు సమయం కావాలన్నారు. ఇదే రెండో కారణమన్నారు. ఇక మూడో కారణం చాలా పెద్దదన్నారు. హిజ్బుల్లాకు మాస్టర్ అయిన ఇరాన్ తో నేరుగా ఢీ కొనేందుకు ఈ యుద్ధం ఆపాల్సిన అవసరముందన్నారు. అయితే హిజ్బుల్లా మిలిటెంట్లు సంధికి అంగీకరించిన షరతులను ఉల్లంఘిస్తే.. వెంటనే యుద్ధం ప్రారంభింస్తామని హెచ్చరించారు.
Also Read: బద్ధ శత్రువు కిమ్ జాంగ్‌తో భేటీ కానున్న ట్రంప్.. రష్యాకు చెక్ పెట్టడానికేనా?
రాజకీయంగా ఈ పరిణామాలన్ని జరుగుతుంటే లెబనాన్ ప్రజలు మాత్రం యుద్ధం ముగిసినందకు సంబారలు చేసుకుంటున్నారు. లెబనాన్ రాజధాని బేరుట్ నగరంలో కూలిపోయిన తమ ఇళ్లను తిరిగి నిర్మించుకునే పనిలో పడ్డారు. సెప్టెంబర్ నెలలో ప్రారంభమైన హిజ్బుల్లా మిలిటెంట్లు, ఇజ్రాయెల్ మధ్య యుద్దంలో దాదాపు 12 లక్షల మంది లెబనాన్ ప్రజలు, సరిహద్దుల్లోని దాదాపు 60 వేల మంది ఇజ్రాయెల్ ప్రజలు తమ ఇళ్లు వదిలి సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లారు. ఇప్పుడు యుద్ధం ఆగిపోవడంతో తమ ఇళ్లకు చేరుకుంటున్నారు. బేరుట్ నగరంలో రోడ్లపై లెబనాన్ యువకులు సంతోషంగా డ్యాన్సులు వేస్తున్నారు.
లెబనాన్ లో యుద్దం ఆగిపోయవడంపై బేరుట్ నగరంలో నివసించే 59 ఏల్ల ముహమ్మద్ కాఫరాని స్పందించారు. ఆయన బేరుట్ నగరానికి సమీపంలోని బిడియాస్ గ్రామంలో నివసిస్తున్నారు. “గత 60 రోజులు చాలా వికారంగా గడిచాయి. ప్రాణాలు కాపాడుకోవడానికి సురక్షిత ప్రాంతం కోసం వెతుకుతూ ఇళ్లు వదిలి చాలా చోట్ల తిరగాం. కానీ ఎక్కడా స్థిరంగా ఉండకలేకపోయాం. ఇప్పుడు కాస్త ఊపిరి పీల్చుకునేందుకు సమయం దొరికింది.” అని మీడియాతో అన్నారు.
అమెరికా, ఫ్రాన్స్, కతార్ దేశాల జోక్యంతో లెబనాన్ లో దాడులు ఆపేందుకు ఇజ్రాయెల్ ప్రభుత్వం మంగళవారం అంగీకరించింది. అయితే ప్రస్తుతానికి ఈ కాల్పుల విరమణ రెండు నెలల వరకు సాగుతుందని సమాచారం. కాల్పుల విరమణ కోసం ఇజ్రాయెల్ షరతులు విధించింది. ముఖ్యంగా దక్షిణ లెబనాన్ ప్రాంతం నుంచి హిజ్బుల్లా మిలిటెంట్లు వెళ్లిపోవాలి. ఇజ్రాయెల్ సైన్యం కూడా తమ దేశ సరిహద్దులకు తిరిగి చేరుకుంటుంది.
ఈ షరతులు పాటిస్తున్నారా? లేదా? అని ధృవీకరించేందుకు ఐక్యరాజ్యసమితి పీస్ కీపర్స్ (శాంతి స్థాపకుల) బృందం, లెబనాన్ సైన్యం, అమెరికా నేతృత్వంలోని ఒక అంతర్జాతీయ ప్యానెల్ దక్షిణ లెబనాన్ లో పర్యవేక్షిస్తుంది.