మిడిల్ ఈస్ట్ వివాదాలు ఎప్పుడూ నివురుగప్పినా నిప్పులా ఉంటాయనడంలో సందేహం లేదు. ఇది అక్కడి చరిత్ర చెబుతున్న వాస్తవం. దీన్ని మరోసారి రుజువు చేసింది ఈ ఒప్పందం. అందుకే, ఈ కాల్పుల విరమణ ఒప్పందాన్ని లొంగుబాటు చర్యగా అనుకొవద్దని కూడా రెండు పక్షాలూ స్పష్టంగానే చెబుతున్నాయి. అంటే, యుద్ధం ముగిసినట్లు కాదుగా..? ఇదే ఇప్పుడు అందర్నీ ఆలోచనలో పడేసింది. మరి ఈ ఒప్పందం ఎందుకు చేసుకున్నట్టూ…? 60 రోజుల సీజ్‌ఫైర్ అయినా సక్రమంగా అమలౌతుందా..? అసలు, ఈ ఒప్పందంపై ఇరాన్ స్పందనేంటీ..? గాజాలో యుద్ధం ఆగకపోతే ఒప్పందంలో అర్థమేముంది..?
మిడిల్ ఈస్ట్‌కు మంచి కబురు అందింది. మొత్తానికి, ఓ మెట్టు దిగిన ఇజ్రాయెల్… లెబనాన్‌లో యుద్ధానికి బ్రేక్ ఇస్తానని చెప్పింది. ఏడాదిగా నడుస్తున్న యుద్ధంలో కాల్పుల విరమణ ఒప్పందం కుదిరింది. ఇజ్రాయెల్-హిజ్బుల్లా షేక్ హ్యాండ్స్ ఇచ్చుకున్నాయి. వార్‌లో వచ్చిన బ్రేక్‌తో రెండు సైన్యాలు యుద్ధ భూమి నుండి వెనక్కి మళ్లాయి. కండీషనల్ సీజ్‌ఫైర్ అయినప్పటికీ… ఇంత త్వరగా కాల్పులు విరమణ ఓ కొలిక్కి రావడంతో… ‘హమ్మయ్యా! యుద్ధం ఆగతుందనే ఆశ వచ్చిందని’ అంతా గాలి పీల్చుకుంటున్నారు. ఇలాంటి ట్విస్ట్ ఇంత త్వరగా వస్తుందని చాలా మంది ఊహించలేదు. ఎందుకంటే, ఈ ఒప్పందం ఖరీదు ఎన్నో ప్రాణాలు. ఇజ్రాయెల్ దాడులకు అటు గాజా, ఇటు లెబనాన్‌లో వేల మంది ప్రాణాలు కోల్పోయారు. ఇందులో, చిన్నారులు, మహిళలు, వృద్ధులే అధికం. ఇక, ఇజ్రాయెల్‌లో మరణాలు తక్కువే అయినప్పటికీ… నష్టం మాత్రం భారీగానే కనిపించింది. ఇజ్రాయేలీలతో పాటు విదేశీ పౌరుల్ని కూడా బంధీలుగా తీసుకెళ్లిన హమాస్… వాళ్లను ఇంకా వదిలిపెట్టలేదు. మరోవైపు, ఇరాన్, హిజ్బుల్లా, హమాస్, హౌతీ తీవ్రవాదుల నుండి పడుతున్న బాంబులను ఎదుర్కోడానికి ఇజ్రాయెల్ నానా కష్టాలు పడింది. ఎంతో నష్టపోయింది. ఎట్టకేలకు, ఇప్పుడు ఇజ్రాయెల్ యుద్ధానికి బ్రేక్ ఇచ్చింది
అమెరికా మధ్యవర్తిత్వంతో లెబనాన్‌లోని హిజ్బుల్లాతో ఇజ్రాయెల్ చేసుకున్న కాల్పుల విరమణ ఒప్పందం నవంబర్ 27 తెల్లవారుజామున నుండి అమలులోకి వచ్చింది. ఈ ఒప్పందం 60 రోజుల కాల్పుల విరమణకు పిలుపునిచ్చింది. ఇప్పుడు, ఇజ్రాయెల్ దళాలు లెబనాన్ నుండి వెనక్కి వెళ్లిపోతున్నారు. అటు, హిజ్బుల్లా దక్షిణ లెబనాన్ నుండి ఉపసంహరించుకుంటుంది. అయితే, ఈ ఆరవై రోజుల్లో హిజ్బుల్లా ఒప్పందాన్ని ఉల్లంఘిస్తే తిరిగి దాడి చేసే హక్కు ఇవ్వాలంటూ ఇజ్రాయెల్ పట్టుబట్టింది. కానీ, లెబనాన్ ఈ కండీషన్‌ను వ్యతిరేకించింది. ఏది ఏమైనప్పటికీ… ఇద్దరి మధ్య వివాదం కాస్త ఊపిరి పీల్చుకునే గ్యాప్ ఇచ్చింది. ఇప్పటికే, దాదాపు లక్షన్నర మంది మంది లెబనీస్… 50 వేల మంది ఇజ్రాయెలీయుల వారి సొంత ప్రదేశాలను వదిలి వెళ్లిపోయారు. ఇజ్రాయెల్ బాంబు దాడుల ఫలితంగా లెబనాన్‌లో 3 వేల 700 కంటే ఎక్కువ మంది ప్రాణాలు కోల్పోయారు. ఇక, లెబనాన్ అధికారుల ప్రకారం, ఇజ్రాయెల్ వైపు 130 మందికి పైగా మరణించారు.
ఇక, ఒప్పందంలో ఉన్న నిబంధనలు చూస్తే… 60 రోజుల ఈ కాల్పుల విరమణలో భాగంగా… నవంబర్ 27 నుండి ఇజ్రాయెల్ దళాలు తమ సరిహద్దు వైపుకు తిరిగి వెళ్లిపోవాలి. అలాగే, హిజ్బుల్లా దక్షిణ లెబనాన్‌లో తన సైనిక ఉనికిని నిలిపివేయాలి. అలాగే, లిటాని నదికి దక్షిణంగా ఉన్న ప్రాంతంలో వేలాది మంది లెబనీస్ సైనికులు, ఐక్యరాజ్య సమితి శాంతి పరిరక్షకులను మోహరించాలని ఒప్పందంలో పేర్కొన్నారు. దీనికి సంబంధించి, అమెరికా నేతృత్వంలోని అంతర్జాతీయ పర్యవేక్షక బృందం రెండు పక్షాల సమ్మతిని పర్యవేక్షిస్తుంది.
అయితే, ఇజ్రాయెల్ తన దాడులను మళ్ళీ మొదలు పెట్టదనే హామీపైనే ఈ ఒప్పందానికి హిజ్బుల్లా గ్రూప్ ఒప్పుకుందని హిజ్బుల్లా నాయకులు చెబుతున్నారు. “ఇజ్రాయెల్ ప్రభుత్వం సంతకం చేసిన ఈ ఒప్పందాన్ని సమీక్షించిన తర్వాత… హిజ్బుల్లా పేర్కొన్న నిబంధనలకు, లెబనాన్ అధికారులు అంగీకరించిన వాటికి మధ్య ఏవైన సమస్యలు ఉన్నాయో లేదో చూడాల్సిన అవసరం ఉందని కూడా హిజ్బుల్లా లీడర్లు అంటున్నారు. ప్రస్తుతానికైతే తీవ్రమైన యుద్ధంలో దూకుడుకు ముగింపు పలకాలనుకుంటున్నామనీ.. ఆ తర్వాత ఏం జరుగుతుందనేది కాలం నిర్ణయిస్తుందని అన్నారు. అయితే, తమ దేశ సార్వభౌమాధికారానికి ప్రమాదం వాటిల్లనంత వరకే ఏ ఒప్పందమైన పనిచేస్తుందంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఇక, ఇజ్రాయెల్ ఈ ఒప్పందానికి ఓకే చెప్పడానికి మూడు ప్రధాన కారణాలున్నాయని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహూ అన్నారు. గత సంవత్సరం నుండి నడుస్తున్న సెవన్ ఫ్రంట్ వార్‌లో ఇజ్రాయెల్ సూపర్ సక్సెస్ అయ్యింది కాబట్టే ప్రస్తుతం కాల్పుల విరమణ ఒప్పందానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు పేర్కొన్నారు. ఈ యుద్ధంలో ఇజ్రాయెల్, హిజ్బుల్లాను దశాబ్ధాల వెనక్కి నెట్టిందనీ… అది ఇంతకు ముందు ఉన్న సమూహంగా నిలబడలేని పరిస్థితికి వచ్చిందని అన్నారు. అలాగే, అంతర్జాతీయంగా ఎంత వ్యతిరేకత ఉన్నప్పటికీ ఇజ్రాయెల్… గాజాలో, లెబనాన్‌లో, ఇతర శత్రు స్థావరాల్లో తన పోరాటాన్ని విజయవంతంగా పూర్తి చేసిందని… దీనితో, ఇజ్రాయెల్ బలాన్ని ప్రపంచానికి చూపించిందని అన్నారు. అందుకే, తాత్కాలికంగా కాల్పుల విరమణకు ఒప్పుకున్నట్లు తెలిపారు. అలాగే, ఈ ఒప్పందం ఇచ్చిన గ్యాప్‌లో ఇజ్రాయెల్, ఇరాన్ నుండి వచ్చే ముప్పుపై దృష్టి పెడతామని కూడా వెల్లడించారు. ఇక, కొత్తగా హిజ్బుల్లా ఏదైనా ముప్పు తలపెడితే… దాన్ని ఎదుర్కోవడానికి ఇజ్రాయెల్ పూర్తి సైనిక సామర్థ్యాన్ని పటిష్ఠం చేసుకునే సమయం ఉంటుందని ఇజ్రాయెల్ ప్రజల్ని ఉద్దేశించి చెప్పారు.
ఇక, రెండు వైపుల నుండి శత్రుత్వాలకు శాశ్వత ముగింపు సాధించడమే ఈ ఒప్పందం లక్ష్యం అని యూఎస్ అధ్యక్షుడు జో బైడెన్ అంటున్నారు. యుఎస్ ప్రెసిడెంట్ బైడెన్, యుకె ప్రధాని కైర్ స్టార్మర్ ఇద్దరూ ఈ కాల్పుల విరమణ ఒప్పందాన్ని “శుభవార్తగా” పేర్కొన్నారు. అయితే, “గాజాలో కాల్పుల విరమణ ఒప్పందం… హమాస్ చెరలో ఉన్న బందీలందరినీ విడుదల చేయడం, అత్యవసరంగా అవసరమైన మానవతా సహాయంపై ఆంక్షలను తొలగించడం తక్షణమే చేయాలని” అని కైర్ స్టార్మర్ ఒక ప్రకటనలో తెలిపారు. మధ్యవర్తులుగా వీళ్ల అభిప్రాయాలు ఎలా ఉన్నప్పటికీ… గాజాలో జరుగుతున్న వివాదాన్ని పరిష్కరించడానికి ఈ ఒప్పందం ఎంత ప్రభావం చూపుతుందన్నదానిపై సందేహాలు లేకపోలేదు. 2023 అక్టోబర్‌లో సౌత్ ఇజ్రాయెల్‌పై హమాస్ చేసిన దాడిలో 12 వందల మందిని చనిపోయిన తర్వాత ప్రారంభమైన ఈ యుద్ధం ఇప్పటి వరకూ ఎలాంటి క్లియర్ కట్ పరిష్కారం లేకుండా కొనసాగుతూనే ఉంది. గాజాలో ఇజ్రాయెల్ తన సైనిక చర్యలను నిలిపివేస్తేనే ఇజ్రాయెల్‌పై తన దాడులను నిలిపివేస్తామని గతంలో హిజ్బుల్లా కూడా పేర్కొంది. కాబట్టి, ఈ ఒప్పందం తాత్కాలిక ఉపసమనానికి తప్ప శాశ్వత శాంతికి మార్గం కాదని స్పష్టంగానే అర్థమవుతుంది.
ఇజ్రాయెల్-హమాస్… ఇజ్రాయెల్-హిజ్బుల్లాల మధ్య సంథి కోసం చాలా దేశాలు, చాలా కాలంగా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాయి. యూఎస్, యూకే, ఫ్రాన్స్, ఈజిప్ట్, టర్కి, అరబ్ దేశాలు వంటివి ఇందులో కీలకంగా వ్యవహరిస్తున్నాయి. అయినా, ఇజ్రాయెల్ మాత్రం మొండి పట్టు వీడలేదు. ఇజ్రాయెల్ కోపానికి అర్థం ఉన్నప్పటికీ… దానికి బలైన అమాయక ప్రజల ప్రాణాలు మాత్రం ఇప్పుడు ఇజ్రాయెల్ మెడకు చుట్టుకున్నాయి. తాజాగా, ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహూపైన అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు అరెస్ట్ వారెంట్ జారీ చేసే వరకూ ఈ వ్యవహారం పోయింది. ప్రపంచవ్యాప్తంగా నెతన్యాహూ వ్యవహారశైలిపైన తీవ్రమైన విమర్శలు వచ్చాయి. ఎప్పటి నుండో అమెరికా బతిమాలుతున్నా నెతన్యాహూ గాజాలో యుద్ధాన్ని ఆపలేదు. యుద్ధ భూమిలో ప్రజలకు ఆహార సహాయాన్ని కూడా అందించడానికి ఇజ్రాయెల్ నిరాకరించింది. అంతెందుకు, హిజ్బుల్లాతో కాల్పుల విరమణ ఒప్పందం నవంబర్ 27 తెలవారుజాము నుండి అమలు అవ్వగా… నవంబర్ 26న లెబనాన్‌పై బాంబులు వర్షం కురించింది ఇజ్రాయెల్ సైన్యం. గత 24 గంటల్లో లెబనాన్‌లోని 180 లక్ష్యాలను చేధించినట్లు ఇజ్రాయెల్ సైన్యం తెలిపింది.
129 సెకన్ల కాలంలో 20 మంది హిజ్బుల్లా స్థావరాలను బాంబులతో పేల్చేసింది ఇజ్రాయెల్ సైన్యం. మిలిటెంట్లు అధికంగా ఉన్న లెబనాన్ రాజధాని బీరుట్ దక్షిణాన ఉన్న దాహియేహ్ ప్రాంతాన్ని జల్లెడ పట్టింది. ఎలాంటి ముందస్తు సమాచారం, హెచ్చరికలు లేకుండా చేసిన ఈ దాడి… హిజ్బుల్లా మౌళిక సదుపాయాలపై చేసిన దాడి కాదు.. ఇది ఇజ్రాయెల్ చేసిన హత్యాప్రయత్నం అంటూ లెబనీస్ మీడియా మండిపడింది. కాల్పుల విరమణ ఒప్పందంపై ఇజ్రాయెల్ కేబినెట్ సంతకం చేయడానికి కొన్ని గంటల ముందే ఇది జరగడం నెతన్యాహూ కఠిన వైఖరికి అద్దం పడుతుంది. మరి అలాంటి వ్యక్తి ఇప్పుడు ఈ ఒప్పందాన్ని సక్రమంగా అమలు చేస్తారా? అనే సందేహం కలుగుతుంది.
ఈ ఒప్పందానికి ఒప్పుకున్న తర్వాత నెతన్యాహూని ఇజ్రాయెల్‌లో ప్రతిపక్షాలు, కొందరు అధికార పార్టీ నేతలు కూడా విమర్శించారు. నెతన్యాహూ లొంగిపోయాడు కాబట్టే కాల్పుల విరమణకు ఓకే చెప్పారంటూ దుయ్యబట్టారు. తాజాగా చేసిన అభిప్రాయ సేకరణ ప్రకారం… నెతన్యాహు మద్దతుదారుల్లో 80% కంటే ఎక్కువ మంది ఈ ఒప్పందాన్ని వ్యతిరేకిస్తున్నట్లు తెలిసింది. ఇక, ఈ యుద్ధం వల్ల ఇళ్ల నుండి వెళ్లిపోయిన ఇజ్రాయేలీలు కూడా కోపంగా ఉన్నారు. దేశవ్యాప్తంగా చూస్తే…. 37% మంది ఇజ్రాయెల్‌లు కాల్పుల విరమణకు అనుకూలం కాగా… 32% మంది వ్యతిరేకంగా.. 31% మంది తమకు తెలియదని చెప్పారు. ఏది ఏమైనప్పటికీ, ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహూకి ఈ అడుగు ఆవశ్యకంగా ఉంది. సుదీర్ఘంగా కొనసాగుతున్న యుద్ధంలో ఇజ్రాయెల్ సైన్యం అలసిపోయిన మాట వాస్తవం. ఆర్థికంగానూ ఆ దేశం నలిగిపోయింది. వేలమంది ఇజ్రాలీయులు డిస్‌ప్లేస్ అయ్యారు. అయితే, ఇంత కష్టం ఉన్నా.. నెతన్యాహూ యుద్ధాన్ని ఆపడానికి ఎక్కువ మంది సమర్థించట్లేదు.
మరోవైపు, ఈ ఒప్పందానికి ముందుగా మద్దతు ఇచ్చిన హిజ్బుల్లాపై కూడా విమర్శలు వస్తున్నాయి. అయినప్పటికీ, హిజ్బుల్లాకు ఇంతకుమించిన మార్గం కూడా లేదు. ఏడాదిగా కొనసాగుతున్న యుద్ధంలో తమ కీలక లీడర్లను కోల్పోయిన హిజ్బుల్లా ఇప్పుడు చాలా బలహీన పడింది. అమెరికా, మిత్ర దేశాల నుండి ఆయుధ సహకారం పొందుతున్న ఇజ్రాయెల్‌తో పోల్చితే.. హిజ్బుల్లా ఆయుధగారం ఖాళీ అవడానికి రెడీగా ఉంది. ఇజ్రాయేల్ చేసిన బాంబు దాడుల్లో హిజ్బుల్లా మౌళిక సదుపాయాలు చాలా వరకూ నష్టపోయాయి. మరోవైపు, హిజ్బుల్లాకు సహకారంగా ఉన్న హౌతీ తీవ్రవాదుల్ని కట్టడి చేయడంలో ఇజ్రాయెల్‌తో పాటు అమెరికా కూడా ప్రత్యక్షంగా పాలుపంచుకుంటుంది. ఇక, ఇరాన్ మాట సరే సరి. ప్రత్యక్ష యుద్ధంలో అడుగుపెట్టడానికి వణికిపోతుంది. ఇస్లామిక్ దేశాల్లో పరపతి తగ్గకుండా ఉండటానికి గిల్లికజ్జాలు ఆడుతున్నప్పటికీ… పూర్తి స్థాయి యుద్ధం చేయడానికి ఏమాత్రం సిద్ధంగా లేదు. ఇలాంటి పరిస్థితుల మధ్య హిజ్బుల్లాకు ఒప్పందం తప్పలేదు. అయితే, దీని వల్ల ఇప్పటి వరకూ హమాస్‌పై ఉన్న సంఘీభావం కూడా హిజ్బుల్లా బ్రేక్ చేసుకున్నట్లయ్యింది.
ఇక, ఇంత భారీ యుద్ధానికి పరోక్షంగా కారణమైన ఇరాన్ ఈ ఒప్పందంపై తెలివిగా స్పందించింది. ఇరాన్ ఎలాగూ ఇజ్రాయెల్‌తో పూర్తి స్థాయి యుద్ధానికి సిద్ధంగా లేదు. ఇప్పటి వరకూ ఎన్ని సందర్భాలు వచ్చినా యుద్ధాన్ని కొనసాగిచడానికి ఆసక్తి చూపలేదు. మొన్నటి వరకూ హమాస్, హిజ్బుల్లా, హౌతీ తీవ్రవాదులను ఎగదోసి, యుద్ధాన్ని పెంచిందే తప్ప… దూకుడుగా అడుగేయలేదు. ఇజ్రాయెల్‌పై రెండు మూడు సార్లు బాంబులతో దాడికి దిగినా… అది ప్రతిస్పందన తప్ప మరేమీ లేదంటూ సైడయ్యింది. అలాంటి ఇరాన్‌కు ఇజ్రాయెల్-హిజ్బుల్లా మధ్య ఒప్పందం అనుకోకుండా దొరికిన సదావకాశం. అందుకే, ఈ ఒప్పందాన్ని ఆహ్వానిస్తున్నామంటూ పేర్కొంది. అయితే, మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శించాలి కాబట్టి… లెబనాన్‌లో ఇజ్రాయెల్ అక్రమదాడులు ఆగడం స్వాగతించాల్సిన అంశమంటూ వెల్లడించింది. మాటలో మాటగా… లెబనీస్‌కు ఇరాన్ సపోర్ట్ ఎప్పుడూ ఉంటుందనీ… లెబనాన్ ప్రభుత్వానికి, ఆ దేశానికి, అది చేసే ప్రతిఘటనకు మద్దతు ఇస్తామంటూ కామెంట్ చేసింది.
Also Read: బాంబుల మోత.. తుపాకుల రోతకు విరామం.. ఆ దేశాల నిర్ణయానికి ఇండియా ఫిదా
ఎలాగూ ఇదంతా అమెరికా ఆడిస్తున్న ఆట అని అందరికీ తెలిసిందే. యుద్ధాలు ఆపేస్తానని హామీ ఇచ్చిన డోనాల్డ్ ట్రంప్ ప్రెసిడెంట్ సీటు ఎక్కకముందే… మరో రెండు నెలలు మాత్రమే ఉండే ప్రెసిడెంట్ బైడెన్ ఏదో ఒక యుద్ధాన్ని హాల్ట్ చేయాలని నిర్ణయించుకున్నట్లు ఉన్నారు. అందుకే, అనూహ్యంగా ఈ ఒప్పందం పట్టాలెక్కినట్లు కనిపిస్తుంది. ఏది ఎలాగున్నా… ఈ ఒప్పందం క్షేత్ర స్థాయిలో చాలా వాస్తవాలను బయటపెట్టింది. నిన్నటి వరకూ తమకు చాలా మంది అండగా ఉన్నారని భావించిన హమాస్‌కు అసలు సంగతి బోధపడింది. ఇప్పుడు, గాజాలో ఇజ్రాయేల్‌తో పోరాడుతున్న హమాస్‌కు అతిపెద్ద మద్దతుగా ఉన్న హిజ్బుల్లా విరమించుకున్నట్లే లెక్క. ఈ 60 రోజుల ఒప్పందం పర్మినెంట్‌గా ఉండాలని అమెరికా అన్న మాటలు నిజమవ్వాలని లెబనాన్ ప్రభుత్వంతో పాటు హిజ్బుల్లా కూడా కోరుకుంటుంది. ఇదే వాళ్లకు క్షేమమని కూడా తెలుసు. ఇక, గంప గుత్తుగా లేని హౌతీలు కూడా వెనక్కి తగ్గే అవకాశం లేకపోలేదు. ఈ పరిస్థితుల మధ్య హమాస్‌కు ఇప్పటి వరకూ ఉన్న మోరల్ సపోర్ట్ సన్నగిల్లింది. హమాస్ పోరాడుతున్న పాలస్తీనా లక్ష్యం మళ్లీ మొదటి నుండీ ప్రారంభం అవ్వాల్సిన పరిస్థితి వచ్చింది. ఇక, రాబోయే రోజుల్లో మిడిల్ ఈస్ట్ సెగలు మళ్లీ రాజుకుంటాయో.. పూర్తిగా మాసిపోతాయో అనేది తేలాల్సి ఉంది.