ప్రయాణంలో మనకు రకరకాల మనుషులు ఎదురవుతుంటారు. కొందరు వెంటనే మాట కలుపుతారు, పుట్టు పూర్వోత్తరాల దగ్గర్నుంచి చెప్పుకొస్తారు, ఇంకొందరు పలకరించినా పట్టించుకోరు. ఇంకో రకం కూడా ఉంటారు. వీరు విపరీతమైన మనస్తత్వం గలవారు. మహిళల దృష్టిలో పడేందుకు రకరకాల కోతి వేషాలు వేస్తుంటారు. అంతవరకు పర్లేదు, కానీ అంతకు మించి అంటూ మరో వల్గర్ బ్యాచ్ తయారైంది. వీరు మహిళలు చూసే విధంగా తమ ప్రైవేట్ పార్ట్స్ చూపిస్తూ అసహ్యంగా ప్రవర్తిస్తుంటారు. విమానంలో అలాంటి సంఘటన ఎదుర్కొన్న ఓ మహిళ, తనకెందుకులే అని ఊరికే వదిలిపెట్టలేదు. విమానయాన సంస్థపై కేసు పెట్టింది. నిర్లక్ష్యంతోపాటు ఉద్దేశపూర్వకంగా సదరు విమానయాన సంస్థ సిబ్బంది తనను మానసిక క్షోభకు గురిచేసినందుకు నష్టపరిహారాన్ని కోరింది.
అసలేం జరిగింది..?
లగ్జరీ అనే లెదర్ బ్రాండ్ సంస్థకు సీఈఓ ఎల్షెరిఫ్. ఆమెకు మరికొన్ని వ్యాపార సంస్థలు కూడా ఉన్నాయి. న్యూయార్క్ లోని జేఎఫ్కే విమానాశ్రయం నుంచి ఆమె మిలన్ కి బయలుదేరారు. అమెరికన్ ఎయిర్ లైన్స్ లో ప్రీమియం ఎకానమీ క్యాబిన్ బుక్ చేసుకున్నారు. అందులో టికెట్ రేటు అక్షరాలా రెండున్నర లక్షల రూపాయలు. క్యాబిన్ లో ఆమె పక్క సీటులో ఒక పురుషుడిది. అతడి పేరు జాన్ డో. విమాన సిబ్బంది ఇచ్చే షాంపైన్ బాగా లాగించేసిన జాన్ డో ఆ తర్వాత కాస్త అతిగా ప్రవర్తించాడు. తన ఫ్యాంట్ ని కిందకు తీశాడు. పక్కన మహిళ ఉంది అనే ఆలోచన లేకుండా అసభ్యంగా ప్రవర్తించడం మొదలు పెట్టాడు. మద్యం మత్తులో అతను అలా చేస్తున్నాడని అనుకోలేం, మహిళ ఉన్నా కూడా అలా ప్రవర్తించాడంటే, అది కచ్చితంగా లైంగిక వేధింపుల కిందకే వస్తుంది. అప్పుడామెకు ఏం చేయాలో తోచలేదు. కనీసం ఆ సమయంలో ఎయిర్ లైన్స్ సిబ్బంది అటుగా వస్తారేమోనని ఎదురు చూసింది. కానీ రాలేదు. దీంతో విమానం ఆగిన తర్వాత సిబ్బందికి నేరుగా ఫిర్యాదు చేసింది ఎల్షెరిఫ్. కానీ వారు లైట్ తీసుకున్నారు. ఆ మహిళా సిబ్బంది అదేమంత పెద్ద విషయం కాదన్నట్టు వాదించారు. పైగా తన భర్త కూడా అప్పుడప్పుడు ఆలే చేసేవాడని చెప్పడం మరింత దారుణం. అంతే కాదు.. అసభ్యంగా ప్రవర్తించిన జాన్ డో కి ఆ తర్వాత సిబ్బంది మరింత మద్యం అందించారు. దీంతో ఎల్షెరిఫ్ బాగా హర్ట్ అయ్యారు.
అమెరికన్ ఎయిర్ లైన్స్ పై ఎల్షెరిఫ్ కోర్టులో కేసు వేశారు. సదరు విమానయాన సంస్థ తన సమస్యను పరిష్కరించకపోగా నిర్లక్ష్యంగా వ్యవహరించిందని ఆమె ఆరోపించారు. పైగా తప్పు చేసిన వ్యక్తిని సమర్థిస్తూ తనని మరింత మానసిక క్షోభకు గురి చేశారని అన్నారు. ఇందులో జాతి వివక్ష కూడా ఉందని ఎల్షెరిఫ్ పేర్కొనడం విశేషం. తాను అరబ్ జాతి మహిళను కాబట్టి తనకు ఎయిర్ లైన్స్ సంస్థ మద్దతివ్వలేదని ఆమె పేర్కొంది. ఫ్లైట్ లో అసహజంగా ప్రవర్తించిన జాన్ డో అనే వ్యక్తి శ్వేత జాతీయుడు కావడంతో ఎయిర్ లైన్స్ సిబ్బంది అతడికే మద్దతుగా నిలిచారని ఆరోపించింది.