Mark Zuckerberg Covid Vaccine | కోవిడ్ సమయంలో ప్రెసిడెంట్ జో బైడెన్ (Joe Biden) నేతృత్వంలోని ప్రభుత్వంపై మెటా సీఈఓ మార్క్ జుకర్‌బర్గ్ తీవ్ర ఆరోపణలు చేశారు. కరోనా వైరస్ సమయంలో వ్యాక్సిన్‌ల గురించి, వాటి దుష్ఫ్రభావాల గురించి ఫెస్ బుక్, ఇన్‌స్టాగ్రామ్ ల నుంచి పోస్టులు తొలగించాలని తమపై ఎంతో ఒత్తిడి చేసిందన్నారు. ప్రజలకు ప్రభుత్వం వ్యాక్సిన్లు ఇస్తున్న నేపథ్యంలో చాలా మంది సహేతుకంగా అనుమానాలు వ్యక్తం చేశారని.. వారు చేసిన పోస్టులన్నీ తొలగించాలని ప్రభుత్వం తమను ఎంతో బెదిరించిందన్నారు. కానీ ఆ సమయంలో తాము ఎటువంటి ఒత్తిడికి తలొగ్గలేదని.. అప్పుడు ప్రజలు అనుమానపడడం సహజమేనని.. అందులో తనకు ఏ తప్పు కనిపించలేదన్నారు. కానీ ఇప్పుడు వ్యాక్సిన్ల వేయించుకోవాలని తనే చెబుతున్నానని కూడా అన్నారు. ‘ది జో రోగన్’ పాడ్ కాస్ట్‌లో ఆయన ఓ ఇంటర్‌వ్యూ సమయంలో ఈ వ్యాఖ్యలు చేశారు.
‘‘బైడెన్ (Biden) ప్రభుత్వం కొవిడ్ టీకాలను అందుబాటులోకి తీసుకురావాలని ప్రయత్నిస్తున్నప్పుడు ఈ పరిస్థితి ఎక్కువగా కనిపించింది. వ్యక్తిగతంగా నేను టీకాలకు అనుకూలంగా ఉంటాను. వాటి వల్ల ప్రతికూల ఫలితాలు కంటే సానుకూల ఫలితాలు ఎక్కువ. అయితే, కొవిడ్ టీకాలను తీసుకురావడానికి ప్రయత్నాలు జరుగుతున్న సమయంలో వాటి గురించి వినిపించిన వాదనలను సెన్సార్ చేయడానికి ప్రయత్నించారని నాకు తెలిసింది.
Also Read: : ప్రిన్సెస్ డయానాకు సైట్ కొట్టిన ట్రంప్.. ఛీకొట్టిన యువరాణి.. ఆ లవ్ స్టోరీ తెలుసా?
వ్యాక్సిన్‌లతో సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయని చెప్పే పోస్టులన్నీ తీసేయాలని, తమ కంపెనీకి చెందిన అన్ని సోషల్ మీడియా ప్లాట్ ఫామ్స్ లలో.. వ్యాక్సిన్లపై అభ్యంతరకరంగా పరిగణించిన కంటెంట్‌ను సెన్సార్ చేయాలని వైట్ హౌస్ సిబ్బంది నుంచి ఒత్తిడి వచ్చింది. అది చాలా హాస్యాస్పదంగా ఉండటమే కాక, అలాంటి చర్యలు తీసుకోవడం సరైనది కాదని నాకు అనిపించేది’’ అని జుకర్‌బర్గ్ తెలిపారు.
సోషల్ మీడియాలో వ్యాక్సిన్లపై మీమ్స్ వచ్చాయి. వాటిలో టైటానిక్ నటుడు లియోనార్డో డికాప్రియోపై వచ్చిన మీమ్ కూడా వారు తీసేయమన్నారు. కొన్ని సంవత్సరాల తర్వాత వ్యాక్సిన్ దుష్ఫ్రభావాల కారణంగా ప్రజలు భారీగా పరిహారం పొందుతారేమోనని అన్నట్టుగా ఉన్న ఆ మీమ్ వైరల్ అయింది.
ఇదిలా ఉంటే.. తప్పుడు హానికర సమాచార వ్యాప్తిని కట్టడి చేసేందుకు మెటా అనుసరిస్తున్న సెన్సార్‌షిప్ విధానాల్లో మార్పులు చేసినట్లు ఇటీవల జుకర్‌బర్గ్ ప్రకటించారు. ‘‘సెన్సార్‌షిప్ తీవ్ర స్థాయిలో ఉన్న పరిస్థితికి చేరుకున్నాం. ఇప్పుడు మేం మా తప్పులను తగ్గించుకోవడంపై దృష్టిపెడతాం. మా విధానాలను సరళీకరించి, మా ప్లాట్‌ఫాంలో స్వేచ్ఛ, భావవ్యక్తీకరణను పునరుద్ధరించే దిశగా చర్యలు తీసుకుంటాం’’ అని జుకర్‌బర్గ్ ఓ వీడియో విడుదల చేశారు. జుకర్‌బర్గ్ ప్రకటన వెలువడగానే, ట్రంప్, టెస్లా అధినేత ఎలాన్ మస్క్ సానుకూలంగా స్పందించారు. ఇప్పటికే తప్పుడు సమాచారంపై ఫ్యాక్ట్ చెకింగ్ కు బదులు కమ్యూనిటీ నోట్స్ అనే ఫీచర్ ను ఎక్స్ ప్రవేశ పెట్టింది. ఫెస్ బుక్ కూడా ఇదే తరహా ఫీచర్స్ తీసుకురానుందని సమాచారం.