Microsoft Operations Pakistan| టెక్నాలజీ రంగంలో అగ్రగామి కంపెనీల్లో ఒకటైన మైక్రోసాఫ్ట్. ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తున్న మైక్రోసాఫ్ట.. 2000 మార్చి 7న పాకిస్తాన్‌లో కూడా తన కార్యకలాపాలను ప్రారంభించింది. 25 ఏళ్లపాటు ఈ టెక్ దిగ్గజం దేశంలో డిజిటల్ వృద్ధి కోసం కృషి చేస్తోంది. అయితే.. 2025 జులై 3న, మైక్రోసాఫ్ట్ అధికారిక ప్రకటన లేకుండానే పాకిస్తాన్ నుండి నిష్క్రమించింది. ఈ వార్తను మైక్రోసాఫ్ట్ పాకిస్తాన్ కంట్రీ హెడ్ జవ్వాద్ రెహమాన్ వెల్లడించారు. మైక్రోసాఫ్ట్ కంపెనీ తన కార్యకలాపాలను పాకిస్తాన్ లో పూర్తి స్థాయిలో నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు.
పాకిస్తాన్ లో మైక్రోసాఫ్ట్ నిష్క్రమణకు కారణాలు
మైక్రోసాఫ్ట్ అధికారికంగా ఎటువంటి వివరణ ఇవ్వలేదు, కానీ దీని వెనుక పాకిస్తాన్ లో రాజకీయ, ఆర్థిక అస్థిరత ఉండడమే ప్రధాన కారణమని ఉందని నిపుణులు చెబుతున్నారు. దీనికి తోడు ఇతర కారణాలు ఇవే..
అస్థిరమైన కరెన్సీ: రూపాయి విలువ తగ్గడం వల్ల వ్యాపారం కష్టతరమైంది.
అధిక పన్నులు: ఎక్కువ పన్నులు సంస్థలకు భారమయ్యాయి.
టెక్నాలజీ, హార్డ్‌వేర్ దిగుమతిపై పరిమితులు: టెక్ ఉత్పత్తుల దిగుమతిలో ఆటంకాలు.
తరచూ ప్రభుత్వ మార్పులు: రాజకీయ అనిశ్చితి విదేశీ సంస్థలను ఇబ్బంది పెట్టింది.
2024 ఆర్థిక సంవత్సరంలో పాకిస్తాన్ వ్యాపార లోటు 24.4 బిలియన్ డాలర్లకు చేరుకుంది, జూన్ 2025 నాటికి దేశ రిజర్వ్‌లు కేవలం 11.5 బిలియన్ డాలర్లకు పడిపోయాయి. ఇది టెక్ దిగుమతులు, విదేశీ పెట్టుబడులను దెబ్బతీసింది.
స్థానిక టాలెంట్ కాదు, వ్యవస్థ సమస్య
మైక్రోసాఫ్ట్ నిష్క్రమణకు స్థానిక టాలెంట్ లేదా మార్కెట్ డిమాండ్ కారణం కాదు. పాకిస్తాన్‌లో నైపుణ్యం ఉన్న టెక్ నిపుణులు, మార్కెట్ సామర్థ్యం సమృద్ధిగా ఉన్నాయి. అయితే, రాజకీయ, ఆర్థిక పరిస్థితులు మెరుగపడుతాయని విశ్వాసం లేకపోవడం పెద్ద సమస్య. నిధులు, సాధనాలను స్వేచ్ఛగా బదిలీ చేయలేకపోవడం మైక్రోసాఫ్ట్‌ను బాగా ఇబ్బంది పెట్టింది.
భారత్-పాకిస్తాన్ వాణిజ్య సమస్యలు
భారత్-పాకిస్తాన్ మధ్య వాణిజ్యం 2018లో 3 బిలియన్ డాలర్ల నుండి 2024లో 1.2 బిలియన్ డాలర్లకు పడిపోయింది. ఔషధాల వంటి ముఖ్యమైన దిగుమతులు మూడవ దేశాల ద్వారా రావడం వల్ల ఆలస్యం అవుతోంది. పైగా ఖర్చులు కూడా పెరిగాయి. రాజకీయ ఉద్రిక్తతలు పెట్టుబడి వాతావరణాన్ని మరింత దిగజార్చాయి.
అంతా అనిశ్చితి
2022లో.. మైక్రోసాఫ్ట్ పాకిస్తాన్‌లో తన కార్యకలాపాలను విస్తరించాలని ఆలోచించింది. కానీ, పెరిగిన అస్థిరత కారణంగా సంస్థ పాకిస్తాన్ లో చేయాల్సిన టెక్నికల్ ఆపరేషన్స్‌కు వియత్నాంకు మార్చేసింది. గత రెండేళ్లలో మైక్రోసాఫ్ట్ పాకిస్తాన్‌లో బహుళ సపోర్ట్ ప్రోగ్రామ్‌లను మూసివేసి, కొత్త భాగస్వామ్యాలను నిలిపివేసింది.
పాకిస్తాన్ లో గ్రామీణాభివృద్ధికి మైక్రోసాఫ్ట్ కృషి
మైక్రోసాఫ్ట్ కేవలం కార్పొరేట్ సంస్థ కాదు, డిజిటల్ పయనీర్. గ్రామీణ ప్రాంతాల్లో కంప్యూటర్ ల్యాబ్‌లను ఏర్పాటు చేయడం, వ్యాపారాలను డిజిటలైజ్ చేయడం, విద్యకు సహకారం అందించడం వంటి వాటితో ఇది పాకిస్తాన్‌లో గణనీయమైన ప్రభావాన్ని చూపింది. జవ్వాద్ రెహమాన్ దీని గురించి మాట్లాడుతూ.. “మేము పాకిస్తాన్ యువతకు నిజమైన అవకాశాలను అందించడానికి ప్రయత్నించాము.” అని అన్నారు.
భారత్, దక్షిణాసియాపై ప్రభావం
పాకిస్తాన్‌లో మల్టి నేషనల్ కంపెనీలు నిష్క్రమిస్తుండగా.. మరోవైపు భారత్ స్థిరమైన విధానాలు, డిజిటల్ ఆర్థిక వృద్ధి, బలమైన దౌత్య సంబంధాలతో గ్లోబల్ టెక్ సంస్థలకు ఆకర్షణీయ గమ్యస్థానంగా మారుతోంది. దక్షిణాసియాలో దీర్ఘకాలిక పెట్టుబడులకు భారత్ ఎంపికగా నిలుస్తోంది.
పాకిస్తాన్‌కు హెచ్చరిక
మైక్రోసాఫ్ట్ నిష్క్రమణ పాకిస్తాన్ కు కేవలం వ్యాపార గుణపాఠం కాదు. ఆ దేశంలోని కీలక సమస్యలకు ప్రతిబింబం. ఈ సవాళ్లను పరిష్కరించకపోతే.. మరిన్ని సంస్థలు నిష్క్రమించవచ్చు.