India USA: అమెరికాను ఇండియా వాడుకుంటోంది.. కానీ ఇండియాను మేం వాడుకోవట్లేదు.. వాళ్ల వస్తువులను అమెరికాలో డంప్ చేసేస్తున్నారు… ఇదీ రోజూ ట్రంప్ గొడవ. వాణిజ్య లోటు భారీగా ఉంది. ఇది మాకు నష్టం అంటున్నారు. అయితే ట్రంప్ బయటకు చెబుతున్న దానికి రియాల్టీకి అసలు సంబంధమే లేదు. అమెరికన్ కంపెనీలు మనతో వేలకోట్లు సంపాదించుకున్న విషయాలను ఎక్కడా మాట్లాడట్లేదు. పైగా అమెరికాతో భారత్ కంటే ఎక్కువ వాణిజ్య లోటు ఉన్న దేశాలను వదిలేసి ఒక్క భారత్ నే టార్గెట్ చేయడం వెనుక సీక్రెట్స్ అన్నీ వెలుగులోకి వస్తున్నాయి. అవేంటో ఇప్పుడు డీకోడ్ చేద్దాం. అలాగే మనకు, అమెరికాకు తేడా ఏంటో కూడా చూద్దాం.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. రోజూ పొద్దున లేస్తే వైట్ హౌజ్ లో బిజినెస్ బిజినెస్ బిజినెస్… మిగితా దేశాలను వదిలేసి ఒక్క ఇండియాపైనే రాళ్లు విసరడం.. ద్వేషం పెంచుకోవడం, రష్యా, చైనా మరింత దగ్గరవుతున్నాయని అసూయ పడడం ఇదే పని. ఇండియాకు భారత్‌కు భారీ వాణిజ్య లోటు ఉందని, భారత్ చర్యలతో అమెరికా లాస్ అవుతోందన్నారు. ఎవరైనా వింటే ట్రంప్ చెప్పిందే నిజం అనుకుంటారు. కానీ అది కాదు. లెక్కలు ఎలా ఉన్నాయో డీకోడ్ చేద్దాం..
అమెరికాకు, చైనాతో 295.4 బిలియన్ డాలర్ల వాణిజ్య లోటు ఉంది.
అదే యూరోపియన్ యూనియన్ తో 235.6 బిలియన్ డాలర్ల లోటు..
మెక్సికోతో 157.2 బిలియన్ డాలర్లు..
వియత్నాంతో 113.1 బిలియన్ డాలర్లు..
కెనడాతో 54.8 బిలియన్ డాలర్లుగా ఉంది.
ఇప్పుడు ఇండియా విషయానికి వద్దాం.. అమెరికాతో భారత్ వాణిజ్య లోటు 45.7 బిలియన్ డాలర్లే. అంటే చైనా, ఈయూ, మెక్సికో, వియత్నాం, కెనడాలతో పోలిస్తే మనతో యూఎస్ వాణిజ్య లోటు గడ్డిపోచతో సమానం. కానీ ఇప్పుడు ట్రంప్ ఆ గడ్డి పోచనే పట్టుకుని వేలాడుతున్నాడు.
వాణిజ్య లోటు ఎక్కువున్న చైనాపై 30 శాతం టారిఫ్
వాణిజ్య లోటు ఎక్కువున్న చైనాపై 30 శాతం టారిఫ్ లు వేశారు ట్రంప్. అలాగే ఈయూపై 15 శాతం టారిఫ్ లతో సరిపెట్టారు. అదే మనపై మాత్రం 50 శాతం టారిఫ్ లు బాదేశారు. ఇందులో చైనా ప్రతీకార సుంకాలకు దిగడంతో ట్రంప్ 50 శాతం నుంచి వెనక్కు తగ్గి 30 శాతానికి తగ్గించాడు. మనం కూడా మన ఐటీ ఎక్స్ పోర్ట్స్, సర్వీసెస్ సెక్టార్ లో సహాయ నిరాకరణ చేస్తే గంటలో దిగి వస్తాడు ట్రంప్. అందరినీ ఇబ్బంది పెట్టి…, ఇబ్బంది పడడం మన నైజం కాదు కాబట్టి ఆవేశంగా, భావోద్వేగాల ఆధారంగా భారత్ నిర్ణయాలు తీసుకోదు. కానీ టైం వస్తే తప్పదు. 2024లో భారత్-అమెరికా మధ్య వాణిజ్యం వాల్యూ 190 బిలియన్ డాలర్లు. వస్తువులు, సర్వీస్ సెక్టార్ కలిపి. వస్తువుల విషయానికొస్తే భారత్ ఎగుమతులు 87 బిలియన్ డాలర్లు ఉంటే.. అమెరికా నుంచి మన దేశానికి వచ్చే ఉత్పత్తుల వాల్యూ 45.3 బిలియన్ డాలర్లుగా ఉంది. సో ఇక్కడ వాణిజ్య లోటు 45.7 బిలియన్ డాలర్లే. కానీ మనకన్నా ఎక్కువ వాణిజ్య లోటు ఉన్న దేశాలు ట్రంప్ కు మంచిగా కనిపిస్తున్నాయి. తక్కువ వాణిజ్య లోటు ఉన్న మనం కఠినంగా కనిపిస్తున్నాం.. ఇదేం లెక్క.
ఐటీ, సాఫ్ట్‌వేర్,BPO సేవలతో బాగుపడుతున్నదెవరు?
వస్తువుల వాణిజ్యంలో అమెరికా లోటులో ఉన్నప్పటికీ, సర్వీసెస్ ట్రేడ్ లో అమెరికాకు లాభం ఉంది. ఐటీ, సాఫ్ట్‌వేర్, ఇతర సేవలలో భారత్ అమెరికాకు గణనీయమైన ఎగుమతులు చేస్తుంది. దీంతో అమెరికా సర్వీసెస్ రంగంలో లాభం పొందుతోంది. దీంతో ట్రేడ్ దాదాపు ఈక్వల్ అయినట్లే. ఎందుకంటే భారత్ ఐటీ, సర్వీస్ సెక్టార్‌లో, ముఖ్యంగా సాఫ్ట్‌వేర్, ఐటీ సంబంధిత సేవలు, BPO, నాలెడ్జ్ ప్రాసెస్ ఔట్‌సోర్సింగ్ రంగాల్లో ప్రపంచంలో అగ్రగామిగా ఉంది. భారత్ ఐటీ సేవలు అమెరికా కంటే తక్కువ ఖర్చుతో అందుబాటులో ఉంటాయి. ఇక్కడి ఐటీ సర్వీసెస్ తో అమెరికన్ కంపెనీలు లాభపడుతున్నది ట్రంప్ కళ్లకు కనిపించట్లేదా. TCS, ఇన్ఫోసిస్, విప్రో వంటి ఇండియన్ ఐటీ కంపెనీలు అమెరికన్ కంపెనీలకు సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్, క్లౌడ్ సర్వీసెస్, డేటా అనలిటిక్స్ వంటి సేవలను అందిస్తున్నాయి. ఇవి అమెరికాలో అదే సేవలను అందించే కంటే చాలా తక్కువ. మరి ఇక్కడ కొంచెం కాదు భారీగా లాభపడుతున్నది అమెరికన్ కంపెనీలు కాదా ట్రంప్ అన్న ప్రశ్నలు వస్తున్నాయి.
మన సపోర్ట్‌తోనే గ్లోబల్‌గా US కంపెనీలకీ రోల్
మన ఐటీ బ్యాక్ ఎండ్ సపోర్ట్ తోనే అమెరికన్ బ్యాంకులు, ఆరోగ్య సంరక్షణ సంస్థలు, రిటైల్ కంపెనీలు డిజిటల్ ట్రాన్స్‌ఫర్మేషన్‌ను సాధిస్తున్నాయి. 24X7 సర్వీసులు అందించగలుగుతున్నాయి. ఇండియన్ ఐటీ సేవలు అమెరికన్ కంపెనీల గ్లోబల్ సప్లై చైన్‌లో కీ రోల్ గా ఉన్నాయి. ఆ కంపెనీలు వరల్డ్ వైడ్ గా ఎఫెక్ట్ చూపుతున్నాయంటే భారతీయ ఐటీ సెక్టార్ కారణం. అంటే ఇక్కడ ట్రంప్ తెలుసుకోవాల్సింది ఏంటంటే.. ఒక ఉత్పత్తుల విషయాన్నే పట్టుకుని వేలాడితే లాభం లేదు. మనవైపు నుంచి చాలా బెనిఫిట్స్ అమెరికాకూ వెళ్తున్నాయి. సో ట్రంప్ పరిస్థితి ఎంత జోకర్ గా మారిందంటే.. ట్రంప్ ఈజ్ డెడ్ అన్న హాష్ ట్యాగ్ ట్రెండింగ్ అయింది. తాను చావలేదు అని స్వయంగా వైట్ హౌజ్ ప్రెస్ మీట్ లో చెప్పుకోవాల్సి వచ్చింది ట్రంప్. సో భారత్ పై సుంకాలు వేయడం వెనుక పెద్ద లాజిక్స్ ఏమీ లేవు. కేవలం ట్రంప్ కుటుంబ వ్యాపారాల మతలబులు ఉన్నాయ్. ఆయన వ్యక్తిగత ఇగోలే కారణం. అవేంటో కూడా వన్ బై వన్ డీకోడ్ చేద్దాం.
భారీ వాణిజ్య లోటు ఉన్న దేశాలను వదిలేసి ట్రంప్ ఒక్క భారత్ నే టార్గెట్ ఎందుకు చేశారో.. మనం చెప్పక్కర్లేదు.. అమెరికా మాజీ జాతీయ భద్రతా సలహాదారులు, వైట్ హౌజ్ మాజీ సలహాదారులు.. రక్షణ రంగ నిపుణులు, అమెరికన్ కాంగ్రెస్ సభ్యులే అంటున్నారు. ట్రంప్ కుటుంబ వ్యాపారాల కోసమే ఈ గేమ్ డైలీ సీరియల్ లా నడుస్తోందంటున్నారు. ఇంతకీ ట్రంప్ కుటుంబం పాకిస్తాన్ తో ఎలా వ్యాపారం చేయాలని స్కెచ్ వేసిందో చూద్దాం.
పాక్‌లో చమురు నిల్వ కేంద్రాలు డెవలప్ ప్లాన్
పాకిస్తాన్‌లో ఆయిల్ రిజర్వ్స్ పెంచుతాం.. ఏదో ఒక రోజు వాళ్లు భారత్ కు చమురు అమ్ముతారేమో.. అంటూ సెటైరికల్ గా మాట్లాడారు. భారత్ పై సుంకాలు ప్రకటించిన కొద్ది సేపటికే పాకిస్తాన్‌లో భారీ చమురు నిల్వలను అభివృద్ధి చేయడానికి డోనాల్డ్ ట్రంప్ డీల్ కుదుర్చుకున్నారు. పాకిస్తాన్‌తో అమెరికా ఒక ఒప్పందం పూర్తి చేసిందని ట్రంప్ తన ట్రూత్ సోషల్‌లో రాశారు. ఇందులో భాగంగా రెండు దేశాలు కలిసి పాకిస్తాన్‌లోని భారీ చమురు నిల్వ కేంద్రాలు డెవలప్ చేస్తాయన్నారు. అమెరికా-పాకిస్తాన్ వాణిజ్య ఒప్పందాన్ని ఖరారు చేయడంలో కీలక పాత్ర పోషించినందుకు అధ్యక్షుడు ట్రంప్‌కు హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని జులైలో పాక్ ప్రధాని షాబాజ్ షరీఫ్ పోస్ట్ పెట్టారు.
ప్రతిదానికి పాక్ తల ఊపుతుందన్న కారణం
మరి ఉన్నట్లుండి.. ట్రంప్ కు పాకిస్తాన్ పై ప్రేమ పెరగడానికి చాలా రీజన్స్ ఉన్నాయంటున్నారు. ట్రంప్ కుటుంబంతో వాణిజ్యానికి పాకిస్థాన్ అంగీకరించింది కాబట్టే ఆయన భారత్‌ను పక్కన పెట్టారని అమెరికా జాతీయ భద్రతా వ్యవహారాల మాజీ సలహాదారు జేక్ సలీవాన్ అభిప్రాయపడ్డారు. అంటే ఇక్కడ అసలైన లాజిక్స్ అర్థం చేసుకోవచ్చు. పాకిస్తాన్ అయితే ప్రతి దానికి తల ఊపుతుంది. ఆడించినట్లు ఆడుతుంది, మన లెక్క వేరు కాబట్టి అలా ట్రంప్ అటువైపు ఫోకస్ పెంచారు. పైగా పెద్దాయనను నోబెల్ శాంతి బహుమతికి నామినేట్ చేసింది పాకిస్తాన్. భారత్ పాక్ యుద్ధాన్ని స్వయంగా ఆపానని క్లెయిమ్ చేసుకున్నాడు ట్రంప్. మనం ఆ విషయాన్ని ఒప్పుకోలేదు. ఇందులో ట్రంప్ చేసిందేమీ లేదని భారత్ బహిరంగంగానే చెప్పింది. అది కూడా ట్రంప్ కు నచ్చలేదు. సో మనపై 50 శాతం టారిఫ్ ల వెనుక ట్రంప్ కుటుంబ వ్యాపారాలు, వ్యక్తిగత ఇగోలే కారణమన్నది అమెరికన్ నిపుణులే చెబుతున్న మాట. ట్రంప్‌ను నోబెల్ శాంతి బహుమతికి నామినేట్ చేయడానికి భారత ప్రధాని మోడీ తిరస్కరించారనే కారణంతో ఇలా వ్యవహరిస్తున్నారని భారత సంతతికి చెందిన అమెరికా కాంగ్రెస్ సభ్యుడు రో ఖన్నా కామెంట్ చేశారు. ఈ రెండు దేశాల ద్వైపాక్షిక బంధాన్ని బలోపేతం చేసేందుకు 30 ఏళ్లుగా చేసిన కృషిని ట్రంప్ నాశనం చేస్తున్నారని ఆరోపించారు. ట్రంప్ విధానాలు.. భారత్‌ను చైనా, రష్యాల వైపు వెళ్లేలా ప్రోత్సహిస్తున్నాయన్నారు. అటు ఇండియాను రష్యాకు దూరం చేయడానికి దశాబ్దాలుగా పశ్చిమ దేశాలు చేసిన కృషిని ట్రంప్ మంటగలిపారని గతంలో అమెరికా భద్రతా వ్యవహారాల సలహాదారుగా పని చేసిన జాన్ బోల్టన్ అన్నారు. సో ఇలా చెప్పిన వాళ్లందరూ ఆశామాషీ వ్యక్తులు కారు.
2026 జనవరి 22 నుంచి WHOకు US గుడ్ బై
ట్రంప్ ఇదొక్కటే కాదు.. రెండోసారి అధికారంలోకి వచ్చాక చాలా చేస్తున్నారు. ఈ ఏడాది జనవరి 20న రెండోసారి అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసిన రోజున డొనాల్డ్ ట్రంప్ WHO నుండి తప్పుకునేందుకు ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ జారీ చేశారు. ఒక సంవత్సరం నోటీస్ పీరియడ్‌తో 2026 జనవరి 22 నుంచి ఇది అమలులోకి వస్తుంది. WHOకు అమెరికా నిధులు అందుతున్నాయి. దీంతో పేద దేశాలకు మేలు జరుగుతోంది. ఎంత దారుణం.. నిధుల్లేవ్.. ఏమీ లేవు… ఏమీ ఇచ్చేది లేదు.. ఎవరు ఏటైనా చావని.. అంటున్నాడు ట్రంప్. అంతే కాదు అంతకు ముందు టర్మ్ లో UNESCO నుంచి అమెరికా బయటికొచ్చేలా చేశారు. చైనా ప్రభావం పెరుగుతోందని కారణం చూపారు. ఇది కరెక్టేనా.. ట్రంప్ తన మొదటి టర్మ్‌లో పారిస్ క్లైమేట్ అగ్రిమెంట్ నుండి అమెరికాను తప్పించే నిర్ణయం తీసుకున్నారు. బైడెన్ 2021లో అమెరికాను తిరిగి ఈ ఒప్పందంలో చేర్చారు. కానీ ఇప్పుడు మళ్లీ నీలినీడలే. ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్ట్ తో సహకారాన్ని తగ్గించేశారు. అంతెందుకు వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ నుంచి కూడా బయటికొస్తానని బహిరంగంగానే బెదిరిస్తున్నాడు ట్రంప్. అమెరికాకు WTO నష్టం చేస్తోందని, చైనాకు మేలు చేస్తున్నారన్న రీజన్ చూపించారు. కారణం అది కాదు.. WTO నుంచి బయటికొస్తే ఏ దేశంపై అన్యాయంగా ఎంతైనా టారిఫ్ లు వేసుకోవచ్చు… క్వశ్చన్ చేసే వారు ఉండరు అన్నది ట్రంప్ ధీమా. అయితే అమెరికా ఏ సంస్థ నుంచి వెళ్లిపోయినా పర్వాలేదు… చూసుకుందాం అంటున్నాయి రష్యా, చైనా, భారత్. ఆఖరికి వరల్డ్ బ్యాంక్ కు బదులు బ్రిక్ బ్యాంక్, sco బ్యాంక్ ఇలా ఆల్టర్నేట్స్ చూస్తున్నాయి.
Also Read: ఘోర విషాదం.. స్కూల్ బస్సు కింద పడి చిన్నారి మృతి
మరి రైట్ ట్రంప్ తన రూట్లో తాను వెళ్తే.. భారత్, చైనా, రష్యా సహా ఇతర దేశాలకూ ఓ స్ట్రాటజీ ఉంటుంది కదా. అందుకే మిగితా పవర్ ఫుల్ కంట్రీస్ ఒక్కటవుతున్నాయి. అమెరికా ఎంత రెచ్చిపోతే రష్యా మనకు అంత మేలు చేస్తోంది. మరింత తక్కువకే రష్యా చమురు అందిస్తోంది. బయటితో పోలిస్తే రష్యా చమురు బ్యారెల్‌కు సుమారు 3 నుంచి 4డాలర్ల వరకు చౌకగా లభిస్తోందంటున్నారు. అమెరికా వార్నింగ్స్ ఇచ్చినా రష్యానే భారత్‌కు అతిపెద్ద చమురు సరఫరాదారుగా కొనసాగుతోంది. ఒక్క జులై నెలలోనే రష్యా భారత్‌కు 3.6 బిలియన్ డాలర్లు అంటే 31,775 కోట్ల విలువైన చమురును విక్రయించింది. ఇదంతా భారత్, రష్యా లోకల్ కరెన్సీల్లోనే జరుగుతుండడం మనకు ప్లస్ అవుతోంది. మనకు ఇంతకంటే ఏం కావాలి. అదే కాదు.. మనకు మరిన్ని S 400 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ ఇచ్చేందుకు రష్యా సముఖత వ్యక్తం చేసింది. అలాగే ఎవరికీ భయపడేది లేదని ట్రంప్ కు జిన్ పింగ్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. మరోవైపు రష్యా-చైనా గ్యాస్ పైప్ లైన్ పై తాజాగా ఒప్పందం కుదిరింది. దీంతో ఏటా చైనాకు 106 బిలియన్ క్యూబిక్ మీటర్ల రష్యన్ గ్యాస్ సరఫరా కాబోతోంది. 2022లో ఉక్రెయిన్‌పై పూర్తి స్థాయి యుద్ధానికి ముందు, రష్యా ఏటా 150 బిలియన్ క్యూబిక్ మీటర్లకు పైగా గ్యాస్‌ను యూరప్‌కు ఎగుమతి చేసేది. అప్పుడు రష్యన్ గ్యాస్ ను కొనొద్దని ట్రంప్ ఈయూ దేశాలపై ఒత్తిడి తెచ్చారు. దీంతో రష్యా ప్లాన్ బి చేస్తోంది. చైనాకు గ్యాస్ పైప్ లైన్ పై ముందడుగు వేసింది. సో ఏ లెక్కన చూసుకున్నా ట్రంప్ కు మతడ పడడం ఖాయంగా కనిపిస్తోంది.
Story By Vidya Sagar, Bigtv