US China Tariffs Musk| అమెరికా, చైనా మధ్య సుంకాలతో వాణిజ్య యుద్ధం మరింత తీవ్రమవుతోంది. ఈ క్రమంలో ఒక ఊహించని పరిణామం జరిగింది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌నకు సన్నిహితుడు, ప్రపంచ కుబేరుడు అయిన ఎలాన్ మస్క్.. చైనాపై విధిస్తున్న టారిఫ్‌లను వెనక్కి తీసుకోవాలని ప్రెసిడెంట్ ట్రంప్‌కు సూచించినట్లు సమాచారం. ఈ విషయం గురించి పలు ఆంగ్ల మీడియా సంస్థలు నివేదించాయి.
నివేదికల ప్రకారం.. మస్క్, ట్రంప్ మధ్య ఈ అంశంపై నేరుగా చర్చలు జరిగాయి. ఆ చర్చల్లో చైనాపై విధిస్తున్న సుంకాల విషయంపై పునరాలోచించాల్సిందిగా మస్క్ సలహా ఇచ్చారు. అయితే, ఆ చర్చలు విజయవంతం కాలేదని సమాచారం. ఈ విషయంలో ఎటువంటి అధికారిక ప్రకటన ఇంకా రాలేదు. ఇంతవరకు ట్రంప్ విధించిన టారిఫ్‌లపై మస్క్ తన అభిప్రాయాన్ని అధికారికంగా వ్యక్తపరచలేదు. అయితే, ఇటీవల ఆయన ఎక్స్ ప్లాట్‌ఫామ్‌లో ఒక వీడియోను షేర్ చేశారు. ఆ వీడియోలో ఆర్థిక శాస్త్రవేత్త మిల్టన్ ఫ్రిడ్మాన్.. అంతర్జాతీయ వాణిజ్య సహకారం వల్ల కలిగే లాభాలను వివరించారు. దీనివల్ల మస్క్ గ్లోబల్ వాణిజ్య సహకారానికి సుంకాలు హానికరమని భావిస్తున్నట్లు తెలుస్తోంది.
చైనాలో ఎలాన్ మస్క్ భారీగా పెట్టుబడులు పెట్టారు. ఆయన ప్రీమియం ఎలెక్ట్రిక్ వాహనాల కంపెనీ అయిన టెస్లా తయారీ యూనిట్ చైనాలోనే ఉంది. ఈ కోణంలో చూస్తే.. మస్క్ తన వ్యాపారాలకు నష్టం కలుగకుండా జాగ్రత్త పడుతున్నట్లు కూడా కనిపిస్తోంది.
మరొకవైపు, చైనా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ విధించిన టారిఫ్‌ల గడువు ముగిసినా తాము భయపడబోమని స్పష్టంగా తెలిపింది. ట్రంప్ ఈ విధంగా బెదిరింపులకు పాల్పడడం సరైన పద్ధతి కాదని చైనా అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది.
Also Read: చమురు ధరలు తగ్గాయి ఇంకెక్కడి మాంద్యం.. సుంకాలపై వెనక్కుతగ్గని ట్రంప్
చైనాపై ట్రంప్ 34 శాతం ప్రతీకార సుంకాలను వెనక్కి తీసుకోవాలని ఆదేశించారు. లేదంటే చైనాపై మరొక 50 శాతం టారిఫ్ విధించనున్నట్లు హెచ్చరించారు. ఈ నిర్ణయానికి చైనా 48 గంటల సమయం ఇచ్చారు.
ఈ సమయంలో ట్రంప్ విధించిన డెడ్‌లైన్‌పై చైనా ధృడంగా స్పందించింది. చైనాకు ఈ విధమైన బెదిరింపులు ప్రభావితం చేయలేవని స్పష్టం చేసింది. అమెరికాలోని చైనా రాయబార కార్యాలయం ప్రతినిధి లియు పెంగ్యు మీడియాకు మాట్లాడుతూ.. ఈ విధమైన ఒత్తిడి, బెదిరింపులు సరైన పద్ధతి కాదని, చైనా తన చట్టబద్ధమైన హక్కులను, ప్రయోజనాలను కాపాడుకుంటుందని తెలిపారు.
లియు పెంగ్యును అమెరికా మీడియా 48 గంటల డెడ్‌లైన్ గురించి ప్రశ్నించినప్పుడు, ఆయన స్పందిస్తూ.. “మేము ట్రంప్ విధించిన టారిఫ్ ఒత్తిడి, బెదిరింపులకు లొంగబోము. చైనా మెరుగైన సంబంధాలు కొనసాగించాలంటే ఈ విధమైన ఒత్తిడి చేయడం సరైన పద్ధతి కాదు. చైనా తన చట్టబద్ధమైన హక్కులను కాపాడుకుంటుంది” అని తెలిపారు.
ఇంకా, చైనా వాణిజ్య మంత్రిత్వ శాఖ కూడా ట్రంప్ వ్యాఖ్యలపై ప్రతీకార చర్యకు సిద్ధంగా ఉందని తెలియజేసింది. చైనా తన హక్కులను కాపాడుకునేందుకు అవసరమైతే మరిన్ని అమెరికా ఉత్పత్తులపై టారిఫ్‌లు విధిస్తుందని స్పష్టంగా తెలిపింది.