Trump Inflation Crude Price| ఆర్థిక మాంద్యం పొంచి ఉందని నిపుణులు హెచ్చరించినప్పటికీ, ట్రంప్ ఈ హెచ్చరికలను తిరస్కరించారు. ప్రపంచ దేశాలపై విధించిన ప్రతీకార సుంకాల ప్రభావంతో వాణిజ్య యుద్ధం మొదలైంది. టారిఫ్‌ల కారణంగా ప్రపంచవ్యాప్తంగా స్టాక్ మార్కెట్ సూచీలు కుప్పకూలాయి. ఈ పరిస్థితిలో మాంద్య భయాలు ఏర్పడ్డాయి. దీంతో, చమురు ధరలు భారీగా పతనమయ్యాయి. మరోవైపు, ట్రంప్ సుంకాల పెంపు వల్ల ప్రపంచవ్యాప్తంగా అన్ని వస్తువులపై ధరలు పెరిగి ఆర్థిక మాంద్యానికి దారి తీస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ క్రమంలోనే ట్రంప్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.
ఆసియా, యూరప్ దేశాల స్టాక్ మార్కెట్లు భారీగా పతనం అవుతున్నా, వాణిజ్య సుంకాల విషయంలో తన నిర్ణయమే సరైనదని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చెప్పారు. ఎట్టి పరిస్థితుల్లో వాటిని ‘‘సవరించేదే లే..’’ అని ఆయన అన్నారు.
సామాజిక మాధ్యమం ‘ట్రూత్’ వేదిక ద్వారా ట్రంప్ స్పందించారు. అంతర్జాతీయంగా చమురు ధరలు తగ్గినప్పుడు, మరి ఎక్కడి మాంద్యం, ద్రవ్యోల్బణం అన్నట్లు వ్యాఖ్యానించారు. ‘‘గతంతో పోలిస్తే, ప్రస్తుతం సుంకాల కారణంగా చమురు ధరలు తగ్గాయి. వడ్డీ రేట్లు, ఆహార పదార్థాల ధరలు కూడా తగ్గాయి. అలాంటప్పుడు ద్రవ్యోల్బణం పెరుగుతుంది అనడం తప్పు. అలాంటిది ఏమీ లేదు. అమెరికా నుంచి బయటకు వెళ్లిన బిలియన్ డాలర్ల సొమ్ము టారిఫ్‌ల ద్వారా కొన్ని రోజులుగా తిరిగి వస్తోంది’’ అని ట్రంప్ తెలిపారు.
ట్రూత్ సోషల్‌లో ఆయన చేసిన తాజా పోస్ట్ సారాంశం ఇలా ఉంది: ‘‘చమురు ధరలు తగ్గాయి, వడ్డీ రేట్లు తగ్గాయి. ఆహార పదార్థాల ధరలు కూడా తగ్గాయి. కాబట్టి ద్రవ్యోల్బణం లేదు. చాలాకాలంగా అన్యాయానికి గురైన అమెరికా, ప్రతీకార సుంకాల ద్వారా సంబంధిత దేశాల నుంచి బిలియన్ల డాలర్లు తీసుకుంటోంది’’ అని ఆయన పేర్కొన్నారు.
Also Read: ట్రంప్ సుంకాల బాదుడుతో భారత్‌కు బంపర్ ఆఫర్.. ఎలాగంటే
అన్నింటికంటే, అతిపెద్ద దుర్వినియోగదారు దేశమైన చైనా మార్కెట్లు కుప్పకూలిపోతున్నాయని, ఆ దేశంపై సుంకాలను 34% పెంచినప్పటికీ, ప్రతీకారానికి దిగొద్దన్న తన హెచ్చరికను చైనా పట్టించుకోలేదని ట్రంప్ అన్నారు. ‘‘అమెరికా గత నాయకుల వల్లే చైనా దశాబ్దాలుగా అడ్డగోలుగా సంపాదించింది. ఇక, అమెరికాను మళ్ళీ గొప్పగా తీర్చిదిద్దండి!’’ అని ట్రంప్ పోస్ట్ చేశారు.
ఇదిలా ఉంటే, అమెరికా వేసిన సుంకాలకు దీటుగా చైనా స్పందించింది. చైనా తన మార్కెట్ నుండి దిగుమతి అయ్యే వస్తువులపై 34% అదనపు టారిఫ్‌లు విధిస్తామని ప్రకటించింది. అమెరికా విధించిన సుంకాలు అంతర్జాతీయ వాణిజ్య నిబంధనలకు విరుద్ధమని, ఏకపక్షంగా, ఆర్థిక బెదిరింపులకు పాల్పడుతోందని చైనా ఆరోపించింది. ఈ క్రమంలో, వాషింగ్టన్ నుంచి దిగుమతి అయ్యే వస్తువులపై 34% టారిఫ్‌లను అమలు చేస్తామని చైనా ప్రకటించింది. ఈ టారిఫ్‌లు ఏప్రిల్ 10వ తేదీ నుండి అమలులోకి రానున్నాయని చైనాకు చెందిన ది స్టేట్ కౌన్సిల్ ఆఫ్ టారిఫ్ కమిషన్ తెలిపింది.
ఈ పరిణామాలపై ట్రంప్ స్పందించారు. ‘‘చైనా తప్పు నిర్ణయం తీసుకుంది. వాళ్లు భయాందోళనకు గురయ్యారు. వారికి మరో మార్గం లేదు’’ అని ఆయన అన్నారు.