War Fear : ఉక్రెయిన్ యుద్ధ భూమిపై ఇన్నాళ్లు కార్యకలాపాలు జరిపిన నాటో దేశాలు క్రమంగా అక్కడి నుంచి బయటకు వచ్చేస్తున్నాయి. ఇన్నాళ్లు.. రష్యా – ఉక్రెయిన్ యుద్ధంలో వెనుక ఉండి సంప్రదాయ ఆయుధాలు మాత్రమే సరఫరా చేస్తూ వస్తున్న దేశాలు.. బైడెన్ నిర్ణయంతో యుద్ధ భయాల్లో చిక్కుకున్నాయి. రష్యా అన్నంత పని చేస్తుందన్న ఆందోళనతో వేగంగా స్పందిస్తున్నాయి. ఇందులో భాగంగానే.. ఉక్రెయినలోని తమ దౌత్య కార్యా్లయాల్ని మూసేస్తున్నాయి.
ఉక్రెయిన్ రాజధాని కీవ్ లోని అమెరికా రాయబారి కార్యాలయంపై రష్యా భారీ వైమానిక దాడులు చేస్తుందనే ఆందోళనలు రేకెత్తాయి. దాంతో హుటాహుటిన కార్యాలయాన్ని మూసేసిన యూఎస్.. నవంబర్ 20న రష్యా భారీ వైమానిక దాడులకు ప్రణాళికలు సిద్ధం చేసుకుందని కచ్చితమైన సమాచారం అందిందని తెలిపింది. అక్కడి నుంచి తమ ఉద్యోగుల్ని సురక్షిత ప్రాంతాలకు తరలించిన యూఎస్.. ఉక్రెయిన్ లోని తమ పౌరులకు ప్రత్యేక సూచనలు చేసింది.
అమెరికా నిర్ణయం తర్వాత కొద్ది గంటల్లోనే ఇటాలియన్, స్పానిష్, గ్రీక్ రాయబార కార్యాలయాలు మూసివేస్తున్నట్లు ప్రకటించాయి. కీవ్ లోని గ్రీకు రాయబార కార్యాలయం భద్రతా పరమైన కారణాలతో మూసివేస్తున్నట్లు ప్రకటించింది. తమ కార్యాలయంపై భారీ వైమానిక దాడులకు సంబంధించిన సమాచారం అందిందని స్పానిష్ కార్యాలయం ప్రకటించింది. ఇదే బాటలో ఇజ్రాయిల్ సైతం చర్యలు చేపట్టింది.
ఇన్ని దేశాలను కంగారు పెట్టేందుకు.. రష్యా – ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభమై వెయ్యి రోజులు కావడం ఒక కారణం కాగా, ఉక్రెయిన తాజా దాడులు మరో కారణం. ఇన్నాళ్లు… తన దేశీయ తయారీ ఆయుధాలు, విదేశాల నుంచి వచ్చిన సంప్రదాయ ఆయుధాలనే వినియోగిస్తూ వస్తున్న ఉక్రెయిన్.. బైడెన్ నిర్ణయంతో దీర్ఘశ్రేణి ఆయుధాలను రష్యాపై ప్రయోగించింది. ఆరు దీర్ఘశ్రేణి ATACMS క్షిపణుల్ని రష్యాలోని బ్రయాన్స్క్ పైకి ప్రయోగించింది. వీటిని రష్యా రక్షణ వ్యవస్థ ఎస్ -400 కూల్చివేసింది.
Also Read : ఆహారం, మందులు నిల్వ చేసుకోండి.. ప్రజలకు ఆ దేశాలు సూచన.. మూడో ప్రపంచ యుద్ధం పక్కా?
ఆ తర్వాతే వేగంగా యుద్ధ భయాలు ఎక్కు్వయ్యాయి. ఇతర దేశాల ఆయుధాలు తమపై ప్రయోగిస్తే.. ఎలాంటి చర్యలకైనా వెనుకాడమని పుతిన్ ప్రకటన, అణు ప్రయోగానికి అనుమతించే దస్త్రాలపై సంతకాలతో ఈ ఉద్రిక్తతలు మరింత పెరిగాయి. ఈ నేపథ్యంలోనే సరిహద్దు దేశాలు తమ పౌరులకు యుద్ధం వస్తే తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రత్యేక కరపత్రాలు పంచుతుండగా, ఇప్పుడు.. ఉక్రెయిన్ లోని దౌత్య కార్యాలయాలని మూసివేస్తున్నాయి.