Marriage Registration At Nightclubs| ఆసుపత్రి, బ్యాంకు లేదా ఏకంగా నైట్‌క్లబ్‌లోకి వెళ్లి, అక్కడే చట్టబద్ధంగా వివాహం చేసుకుని బయటకు రావడం ఊహించగలరా? వినడానికి వింతగా ఉన్నా, ఇప్పుడు ఇది వాస్తవంగా జరుగుతోంది. పెళ్లిళ్ల సంఖ్య తగ్గుతుండటంతో రిజిస్టర్ ఆఫీస్ అధికారులు ఆఫీసులకే పరిమితం కాకుండా, జంటలకు చేరువగా రిజిస్ట్రేషన్ సేవలను అందిస్తున్నారు.
చైనాలో పెళ్లి నమోదు ప్రక్రియను సులభతరం చేసేందుకు స్థానిక అధికారులు కొత్త విధానాలను అమలు చేస్తున్నారు. ఇందులో భాగంగా ఆసుపత్రులు, బ్యాంకులు, విమానాశ్రయాలు, నైట్‌క్లబ్‌లు, పార్కులు, మెట్రో స్టేషన్లలో కూడా మ్యారేజ్ రిజిస్ట్రేషన్ సేవలను అందిస్తున్నారు. దేశంలో పెళ్లిళ్లు, జననాల సంఖ్య తగ్గుతుండటంతో ప్రభుత్వం ఈ చర్యలను ప్రోత్సహిస్తోంది. యువత పెళ్లి చేసుకుని కుటుంబాలను ప్రారంభించేలా చేయడం కోసం అధికారులు రిజిస్ట్రేషన్ ప్రక్రియను మరింత సౌకర్యవంతంగా మార్చుతున్నారు.
షాండాంగ్ ప్రావిన్స్‌లోని లింజీ జిల్లాలో ఇటీవల ఒక ఆసుపత్రి ఒక కొత్త సేవను ప్రారంభించింది. కిక్సీ ఫెస్టివల్ సందర్భంగా ఈ ప్రత్యేక మ్యారేజ్ రిజిస్ట్రేషన్ సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇప్పుడు జంటలు ఆసుపత్రి ప్రాంగణం నుంచే తమ వివాహాన్ని చట్టబద్ధంగా నమోదు చేసుకోవచ్చు. అదే సమయంలో వారు వివాహానికి ముందు ఆరోగ్య పరీక్షలు కూడా చేయించుకోవచ్చు. అంతేకాకుండా గర్భధారణ, కుటుంబ నియంత్రణకు సంబంధించిన అవసరమైన కౌన్సెలింగ్ కూడా అక్కడే పొందవచ్చు. దీంతో పెళ్లికి సంబంధించిన అనేక ప్రక్రియలను ఒకే చోట పూర్తి చేసుకునే అవకాశం లభిస్తోంది.
చైనాలో ఇలాంటి సౌకర్యాలు ఇతర ప్రాంతాల్లో కూడా ప్రారంభమవుతున్నాయి. టియాంజిన్‌లోని పోస్టల్ సేవింగ్స్ బ్యాంక్ ఆఫ్ చైనా శాఖలో మ్యారేజ్ రిజిస్ట్రేషన్ సేవలు ప్రారంభమయ్యాయి. దేశంలో ఇలాంటి సేవలు అందించిన తొలి బ్యాంకుగా ఆ శాఖ నిలిచింది. గ్వాంగ్‌జౌ బైయున్ అంతర్జాతీయ విమానాశ్రయం కూడా జంటలకు వివాహ ధ్రువీకరణ పత్రాలు అందించే సేవను ప్రారంభించింది. దీంతో జంటలు తమ వివాహాన్ని నమోదు చేసుకోవడంతో పాటు ప్రత్యేకమైన అనుభూతిని పొందుతున్నారు.
షాంఘైలోని ఒక నైట్‌క్లబ్ స్థానిక పౌర వ్యవహారాల అధికారులతో కలిసి వివాహ కార్యక్రమాలను నిర్వహించింది. కొత్తగా పెళ్లి చేసుకున్న జంటలకు ఎలక్ట్రానిక్ మ్యూజిక్ ఫెస్టివల్‌కు సంబంధించిన బహుమతులను కూడా అందించారు. మెట్రో స్టేషన్లు, పబ్లిక్ పార్కులు, చారిత్రక దేవాలయాల్లో కూడా ఇలాంటి సేవలు అందుబాటులోకి వస్తున్నాయి. దీంతో వివాహ నమోదు ప్రక్రియను ప్రజలకు మరింత చేరువ చేయాలని అధికారులు ప్రయత్నిస్తున్నారు.
చైనాలో జననాల సంఖ్య గణనీయంగా తగ్గుతోంది. అదే సమయంలో దేశంలో పనిచేసే యువత, మధ్య వయసు జనాభా కూడా తగ్గుతోంది. పెళ్లిళ్లు తగ్గడం వల్ల భవిష్యత్తులో జననాల సంఖ్య మరింత తగ్గే అవకాశం ఉంది. అందుకే యువత పెళ్లి చేసుకునేలా ప్రోత్సహించేందుకు ప్రభుత్వం వివిధ చర్యలు చేపడుతోంది.
మ్యారేజ్ రిజిస్ట్రేషన్‌ను సులభతరం చేయడం కూడా ఈ ప్రయత్నాల్లో ఒక భాగంగా కనిపిస్తోంది.
Also Read: డిగ్రీ లేకపోయినా రూ.1 లక్షకు పైగా జీతం.. ఎలా సంపాదిస్తున్నాడంటే
గత ఏడాది చివర్లో మ్యారేజ్ రిజిస్ట్రేషన్ ప్రక్రియలో కొంతకాలం పెరుగుదల కనిపించింది. అయితే తాజా గణాంకాలు పరిస్థితి ఇంకా ఆందోళనకరంగానే ఉందని సూచిస్తున్నాయి. ఈ ఏడాది మొదటి ఆరు నెలల్లో వివాహ నమోదులు 7.5 శాతం తగ్గాయి. రిజిస్ట్రేషన్ ప్రక్రియను సులభతరం చేయడం మాత్రమే ఈ సమస్యకు పూర్తి పరిష్కారం కాదని నిపుణులు భావిస్తున్నారు.
ఇళ్ల ధరలు, ఉద్యోగ భద్రత, పిల్లల పెంపకం ఖర్చులు కూడా యువత నిర్ణయాలను ప్రభావితం చేస్తున్నాయి. అందుకే చైనా ప్రభుత్వం మరిన్ని చర్యల ద్వారా పెళ్లి, కుటుంబ వ్యవస్థను ప్రోత్సహించేందుకు ప్రయత్నిస్తోంది.