Hackers Blackmail Govt| గత దశాబ్ద కాలంలో అంతర్జాతీయ స్థాయిలో సైబర్ దొంగలు రెచ్చిపోతున్నారు. సాధారణంగా ఈ ఇంటర్నేష్నల్ సైబర్ మోసగాళ్లు కార్పొరేట్ కంపెనీల డేటా దోచుకుని వారి నుంచి రూ.కోట్లు వసూలు చేసే కేసులు చూశాం. అయితే తాజాగా ఒక షాకింగ్ కేస్ వెలుగులోకి వచ్చింది. హ్యాకింగ్ సాయంతో ఒక అంతర్జాతీయ హ్యాకింగ్ దొంగల ముఠా ఒక దేశ ప్రభుత్వాన్నే టార్గెట్ చేసింది. మరీ ముఖ్యంగా ఒక ప్రముఖ నగరాన్ని లక్ష్యంగా చేసుకొని డేటా చోరీ చేసింది. ఇప్పుడు తాము అడిగినట్లు వందల కోట్లు ఇవ్వకపోతే డేటా దుర్వినియోగం చేస్తామని దొంగలు బెదిరిస్తున్నారు. ఈ కేసు జర్మనీ దేశ రాజధాని బెర్లిన్‌కు సంబంధించింది.
బెర్లిన్‌లో తాజాగా జరిగిన భారీ సైబర్ దాడి ప్రపంచవ్యాప్తంగా కలకలం రేపుతోంది. హ్యాకర్లు నగర ప్రభుత్వ వ్యవస్థల నుంచి డేటాను దొంగిలించినట్లు అధికారులు గుర్తించారు. దొంగిలించిన సమాచారాన్ని బయటపెట్టకుండా ఉండేందుకు హ్యాకర్లు బిట్‌కాయిన్స్ రూపంలో భారీ మొత్తాన్ని డిమాండ్ చేశారు. దీనిపై బెర్లిన్ మేయర్ కై వేగ్నర్ స్పందిస్తూ ఈ ఘటనను తీవ్రమైన క్షమించరాని నేరంగా అభివర్ణించారు. హ్యాకర్ల బెదిరింపులకు బెర్లిన్ ప్రభుత్వం లొంగబోదని ఆయన స్పష్టం చేశారు.
జర్మన్ వారపత్రిక డెర్ స్పీగెల్ ప్రకారం, హ్యాకర్లు 30 బిట్‌కాయిన్లను డిమాండ్ చేశారు. ఆ సమయంలో ఈ మొత్తం విలువ సుమారు 2 మిలియన్ యూరోలుగా ఉన్నట్లు సమాచారం. డబ్బు చెల్లించకపోతే దొంగిలించిన డేటాను ఆన్‌లైన్‌లో విడుదల చేస్తామని హ్యాకర్లు బెదిరించారు. బెర్లిన్ అధికారులకు రాన్సమ్ మొత్తం చెల్లించేందుకు హ్యాకర్లు ఒక వారం గడువు ఇచ్చినట్లు సమాచారం. అయితే నగర అధికారులు ఆ డిమాండ్‌ను తిరస్కరించారు. బ్లాక్‌మెయిల్‌కు తలొగ్గకుండా సైబర్ దాడిపై దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
ఈ సైబర్ దాడి ఆగస్టు 14న ప్రారంభమైనట్లు అధికారులు తెలిపారు. దీంతో బెర్లిన్‌లోని పలు ప్రభుత్వ విభాగాల కంప్యూటర్ నెట్‌వర్క్‌లు దెబ్బతిన్నాయి. ముఖ్యంగా హౌసింగ్, పర్యావరణ విభాగాల కార్యకలాపాలు ప్రభావితమయ్యాయి. కొన్ని ప్రభుత్వ విభాగాలు దాదాపు వారం రోజులపాటు తమ నెట్‌వర్క్‌లకు దూరంగా ఉండాల్సి వచ్చింది. హౌసింగ్ ప్రయోజనాలు, చెల్లింపులకు సంబంధించిన కొన్ని సేవలు కూడా నిలిచిపోయాయి. దీంతో ప్రజలు కొన్ని ముఖ్యమైన ప్రభుత్వ సేవలను ఉపయోగించడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
దాడి జరిగిన వెంటనే సున్నితమైన డేటా చోరీ కాలేదని అధికారులు తెలిపారు. అయితే తరువాత వ్యక్తిగత సమాచారం ప్రభావితమై ఉండవచ్చని అధికారులు అంగీకరించారు. ప్రస్తుతం ఏ సమాచారం చోరీ అయిందనే విషయంపై పూర్తి స్పష్టత లేదు. జర్మన్ సెక్యూరిటీ ఏజెన్సీలు ఈ అంశంపై దర్యాప్తు చేస్తున్నాయి. దొంగిలించిన డేటాలో పౌరుల వ్యక్తిగత వివరాలు ఉన్నాయా అనే విషయాన్ని కూడా అధికారులు పరిశీలిస్తున్నారు. ఈ అనిశ్చితి కారణంగా బాధితులలో ఆందోళన పెరుగుతోంది.
డెర్ స్పీగెల్ మీడియా సంస్థ రిపోర్ట్ ప్రకారం ఈ దాడి వెనుక రైసిడా గ్యాంగ్ ఉండవచ్చని తెలిపింది. రైసిడా గతంలో కూడా పలు ప్రముఖ కంపెనీలను లక్ష్యంగా చేసుకున్న రాన్సమ్‌వేర్ గ్యాంగ్‌గా గుర్తింపు పొందింది. అయితే బెర్లిన్‌పై దాడి చేసింది రైసిడానే అని అధికారులు ఇంకా అధికారికంగా ధృవీకరించలేదు. దర్యాప్తు పూర్తయిన తర్వాతే దాడి వెనుక ఉన్న సంస్థపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.
Also Read: సాఫ్ట్‌వేర్ ఉద్యోగం వదిలి వ్యవసాయం చేశాడు.. ఏడాదికి రూ.600 కోట్లు సంపాదన.. ఎలాగంటే
2023లో బ్రిటిష్ లైబ్రరీపై జరిగిన రాన్సమ్‌వేర్ దాడికి రైసిడా బాధ్యత వహించినట్లు ప్రకటించింది. ఆ సమయంలో గ్యాంగ్.. 20 బిట్‌కాయిన్లను రాన్సమ్‌గా డిమాండ్ చేసింది. బ్రిటిష్ లైబ్రరీ ఆ మొత్తాన్ని చెల్లించేందుకు నిరాకరించింది. తర్వాత రైసిడా సుమారు 5 లక్షల ఫైళ్లను డార్క్ వెబ్‌లో విడుదల చేసింది. ఆ ఫైళ్లలో టూరిస్ట్‌లు, సభ్యులు, సిబ్బందికి సంబంధించిన పర్సనల్ డేటా ఉన్నట్లు సమాచారం.
Also Read: భారతీయులంటే లోకువ.. విదేశాల కంటే తక్కువ క్వాలిటీ ఉత్పత్తులు విక్రయిస్తున్న బడా కంపెనీలు
ఈ దాడి కారణంగా బెర్లిన్‌లో జరగనున్న ఎన్నికలకు ఎలాంటి అంతరాయం ఉండదని అధికారులు చెప్పారు. డిప్యూటీ మేయర్ ఐరిస్ స్ప్రాంగర్ సెప్టెంబర్ 20న జరిగే ఎన్నికలు సురక్షితంగా ఉన్నాయని చెప్పారు. భద్రతా బృందాలు ఎన్నికల వ్యవస్థలను కూడా పర్యవేక్షించనున్నాయి. ఇదిలా ఉండగా.. నగర సేవలను పునరుద్ధరించడం అధికారుల ప్రధాన లక్ష్యంగా మారింది.
ఈ ఘటన ప్రభుత్వ సంస్థలు సైబర్ నేరగాళ్లకు ఎంతటి లక్ష్యాలుగా మారుతున్నాయో చూపిస్తోంది. భవిష్యత్తులో ఇలాంటి దాడులను అడ్డుకునేందుకు బలమైన సైబర్ భద్రతా చర్యలు అవసరం.