Pakistan Attack Afghanistan| ఒకప్పుడు మిత్రదేశాలుగా ఉన్న పాకిస్తాన్, అఫ్ఘనిస్తాన్.. ఇప్పుడు శత్రుదేశాలుగా మారిపోయాయి. తాజాగా అఫ్ఘనిస్తాన్ పై పాకిస్తాన్ వైమానిక దాడులు చేసింది. డిసెంబర్ 24, 2024 రాత్రి అఫ్ఘనిస్తాన్ లోని పాక్‌టీకా రాష్ట్రం బర్మాల్ జిల్లాలో పాకిస్తాన్ మిసైల్ దాడులు చేసింది. ఈ దాడుల్లో మహిళలు, చిన్నపిల్లలు సహా మొత్తం 15 మంది మృతి చెందారని సమాచారం. మిసైల్ దాడులకు భవనాలు కూలిపోయిన కారణంగా శిథిలాల కింద చాలా చిక్కుకుపోయారని.. దీంతో మరణించివారని వారి సంఖ్యలో ఇంకా పెరిగే అవకాశం ఉందని అఫ్ఘనిస్తాన్ మీడియా ఖామా ప్రెస్ తెలిపింది.
పాకిస్తాన్ ప్రయోగించిన క్షిపణలు బార్మల్ జిల్లాలోని మొత్తం 7 గ్రామాల్లో విధ్వంసం సృష్టించాయి. ఈ 7 గ్రామాల్లో లామాన్ గ్రామం కూడా ఉంది. ఒక్క లామాన్ గ్రామంలోనే ఒకే కుటుంబానికి చెందిన అయిదుగురు సభ్యులు చనిపోయారు. బార్మల్ జిల్లాలోని ముర్గ బజార్ గ్రామస్థులు దాడులు చేసింది పాకిస్తాన్ యుద్ధ విమానాలనేని ప్రత్యక్షంగా చూసినట్లు మీడియాకు తెలిపారు.
ఈ ఘటనపై అఫ్ఘనిస్తాన్ లోని తాలిబాన్ ప్రభుత్వం మండిపడింది. పాకిస్తాన్ దాడులను ఖండిస్తూ.. ప్రతీకారం తీర్చుకుంటామని ప్రకటించింది. “మా దేశం, సార్వభౌమత్వాన్ని కాపాడే అధికారం మాకుంది. త్వరలోనే పాకిస్తాన్ పై ఎదురుదాడి చేస్తాం. చనిపోయిన వారిలో ఎక్కువగా వజీస్తాన్ కు చెందిన శరణార్థులే ఉన్నారు.” అని చెప్పారు.
పాకిస్తాన్ యుద్ధ విమానాలు చేసిన దాడుల్లో చనిపోయిన వారి సంఖ్య గురించి ప్రభుత్వం ఇంతవరకు అధికారికంగా ప్రకటించలేదు. అయితే శిథిలాల నుంచి 15 మంది మృతదేహాలను వెలికితీయడం జరిగింది.
Also Read: శాంతా క్లాజ్ ఏ దేశంలో ఉంటాడో తెలుసా?.. సమాధానం దొరికేసింది
పాకిస్తాన్, అఫ్ఘనిస్తాన్ మధ్య గత కొన్ని సంవత్సరాలుగా విభేదాలు కొనసాగుతున్నాయి. ముఖ్యంగా పాకిస్తాన్ ప్రభుత్వం, సైన్యానికి వ్యతిరేకంగా హింసాత్మక వైఖరి ఉన్న తెహ్రీకె తాలిబాన్ పాకిస్తాన్ (టిటిపి) అనే గ్రూపు మిలిటెంట్లు.. అఫ్ఘనిస్తాన్ భూభాగం నుంచి కార్యకలాపాలు సాగిస్తున్నారు. పాకిస్తాన్ లో హింసాత్మక దాడులు చేస్తున్న టిటిపి మిలిటెంట్లకు అఫ్ఘనిస్తాన్ ప్రభుత్వం అండదండలున్నాయని.. పాకిస్తాన్ ప్రభుత్వం గత కొన్ని నెలలుగా ఆరోపణలు చేస్తూ ఉంది. అయితే ఈ ఆరోపణలకు అఫ్ఘనిస్తాన్ ప్రభుత్వం ఖండించింది.
టిటిపి మిలిటెంట్లను మాత్రమే టార్గెట్ చేస్తూ దాడులు చేస్తున్నామని పాకిస్తాన్ ప్రకటించింది. కానీ చనిపోయిన వారిలో అందరూ సామాన్య పౌరులే ఉన్నారని అఫ్ఘనిస్తాన్ ప్రభుత్వం తెలిపింది. అందుకే ఈ దాడులను అంతర్జాతీయ చట్టాల ఉల్లంఘనగా తాము పరిగణిస్తూ.. తీవ్రంగా ఖండిస్తున్నామని అఫ్ఘనిస్తాన్ రక్షణ మంత్రిత్వశాఖ తెలిపింది. అమాయక పౌరలపై యుద్ధ విమానాలతో దాడులు చేయడం పాకిస్తాన్ పిరికితనాన్ని తెలియజేస్తోందని.. ఈ దాడులకు సమాధానం తప్పక చెబుతామని అఫ్ఘనిస్తాన్ రక్షణ శాఖ ప్రకటించింది.
అయితే అఫ్ఘనిస్తాన్ లో పాకిస్తాన్ విదేశాంగ శాఖ ప్రతినిధిగా వెళ్లిన మొహమ్మద్ సాధిఖ్ వారం రోజుల క్రితమే ఇరు దేశాల మధ్య వాణిజ్య సంబంధాలపై చర్చలు జరిపేందుకు పర్యటించారు. ఆయన పర్యటన ముగిసిన కొన్ని రోజులకే ఈ దాడులు జరగడం గమనార్హం.
మరోవైపు టిటిపి మిలిటెంట్లు పాకిస్తాన్ భూభాగంపై గత కొన్ని నెలల్లో హింసాత్మక దాడుల చేశారు. ఈ దాడుల్లో డజన్ల సంఖ్యలో పాకిస్తాన్ సైనికులు చనిపోయారు.