Ceasefire Indus Water treaty| ఇండియా, పాకిస్తాన్ మధ్య నాలుగు రోజుల పాటు కొనసాగిన యుద్ధం ఇరువైపులా మిలిటరీ ఉన్నతాధికారుల చర్చల తరువాత కాల్పుల విరమణ ఒప్పందం కుదిరింది. అయితే పాకిస్తాన్ సైన్యం ఇప్పటికే అడపా దడపా సరిహద్దు రాష్ట్రాల్లో డ్రోన్లతో దాడులు చేస్తూనే ఉంది. ఆ దాడులను భారత సైన్యం సమర్థవంతంగా తిప్పి కొడుతూనే ఉంది. ఈ నేపథ్యంలో తాజాగా పాకిస్తాన్ ఉప ప్రధాన మంత్రి, విదేశాంగ శాఖ మంత్రి ఇషాక్ దర్ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. సింధూ నదీ జలాల సమస్య పరిష్కారం జరగకపోతే భారత్, పాకిస్తాన్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కొనసాగడంపై అనుమానాలు వ్యక్తం చేశారు.
అంతర్జాతీయ మీడియా ఛానెల్ సిఎన్ఎన్ తో చేసిన పాక్ మంత్రి ఇషాక్ దర్ ఇంటర్‌వ్యూలో మాట్లాడుతూ.. “ఇండియా, పాకిస్తాన్ దేశాల మధ్య సింధూ జలాల ఒప్పంద పురాతనమైనది. కానీ భారత్ దాన్ని తాత్కాలికంగా నిలిపివేసింది. ఇరు దేశాల మధ్య యుద్ధం ఆగిపోయి కాల్పుల విరమణ కొనసాగుతోంది. సింధూ జల వివాదం పరిష్కారం కాకపోతే ఆ కాల్పుల విరమణ ఒప్పందం ప్రమాదంలో పడుతుంది. ఇది యుద్ధ పరిణామానికి దారి తీస్తుంది.” అని ఆయన అన్నారు.
ఇషాక్ దర్ చేసిన వ్యాఖ్యలు.. పాకిస్తాన్ కు యుద్ధంలో జరిగిన మిలిటరీ పరమైన నష్టాలు, అంతర్జాతీయ స్థాయిలో జరిగిన పరాభవాన్ని దాచి పెట్టేందుకే.. అని భారత్ విదేశాంగ మంత్రిత్వ శాఖ అభిప్రాయపడింది.
Also Read: త్వరలోనే పాకిస్తాన్ 4 భాగాలుగా చీలిపోతుంది.. ఇండియా మాజీ డిజిఎంవో వ్యాఖ్యలు
పాకిస్తాన్ లో భారత సైన్యం ఆపరేషన్ సిందూర్ పేరుతో ఉగ్రవాద స్థావరాలపై వైమానిక దాడులు చేసింది. ఈ దాడుల్లో సమర్థవంతంగా ఉగ్రవాదులను భారీ సంఖ్యలో మట్టుబెట్టింది. ఆపరేషన్ సిందూర్ పై సోమవారం భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ దేశాన్ని ఉద్దేశించి ప్రసంగం చేశారు. ఈ ప్రసంగంలో ఆయన సింధూ జలాలపై మాట్లాడుతూ.. రక్తం, నీరు ఒకే ప్రవాహంలా పారడం కుదరదని అన్నారు. అంతకుముందు విదేశాంగ మంత్రిత్వశాఖ ఒక ప్రకటనలో సింధూ నదీ జలాల ఒప్పందం నిలిపివేత కొనసాగుతుందని పేర్కొంది.
ఇండియా, పాకిస్తాన్ మధ్య 1960 సంవత్సరంలో సింధూ నదీ జలాల ఒప్పందం కుదిరింది. ఈ నదీ జలాలతోనే పాకస్తాన్ లో సింధ్ ప్రాంతంతో పాటు ఇతర సమీప ప్రాంతాలకు 80 శాతం నీరు అందుతోంది. అయితే ఏప్రిల్ 22, 2025న పహల్గాంలో జరిగిన ఉగ్రదాడి కారణంగా భారత ప్రభుత్వం పాకిస్తాన్ కు సింధూ జలాల ప్రవాహాన్ని తాత్కాలికంగా నిలిపివేసింది. దీంతో పాటు చీనాబ్ నది ద్వారా అందే నీటి సరఫరా కూడా తగ్గించేసింది. ఇప్పుడు ఈ నదీ జలాలను ప్రవాహం భారత ప్రభుత్వం విధించిన ఆంక్షలను ఎత్తివేయాలని పాక్ మంత్రి ఇషాక్ దార్ కోరారు.