Pakistan PM Seeks Help| పహల్గాం ఉగ్రదాడి తర్వాత భారత్‌లో పాకిస్తాన్‌పై తీవ్ర ఆగ్రహావేశం నెలకొంది. ఈ దాడిలో పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులే కాదు పాకిస్తాన్ సైనికుల పాత్ర కూడా ఉన్నట్లు వెలుగులోకి రావడంతో.. పాక్‌పై ప్రతీకార చర్యలు తీసుకునేందుకు భారత్ యోచిస్తోంది. మరోవైపు సరిహద్దుల్లో పాకిస్తాన్ రెచ్చగొట్టే చర్యల నేపథ్యంలో, భారత సైన్యం ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉంటూ యుద్ధానికి సిద్ధమవుతోంది. దీనివల్ల పాకిస్తాన్ తీవ్ర భయాందోళనలో ఉంది. భారత్ ఒకవేళ దాడి చేస్తే ఎదుర్కొనేందుకు పాక్ రక్షణ ఏర్పాట్లు చేసుకునేందుకు తలమునకలైంది. ఈ క్రమంలోనే పాక్ ప్రధాని షహబాజ్ షరీఫ్ భారత్ దాడి చేయకుండా నివారించడానికి ఇతర దేశాల కాళ్లావేళ పడుతున్నారు.
పహల్గాం ఘటన అనంతరం భారత్ ఎప్పుడైనా దాడికి దిగొచ్చే అవకాశముందని భావిస్తూ పాకిస్తాన్ ప్రభుత్వం అందోళన చెందుతోంది. ఈ దాడిని అంతర్జాతీయంగా చాలా దేశాలు ఖండించాయి. అనేక దేశాలు భారత్‌కు మద్దతుగా నిలిచాయి. భారతదేశం తీసుకునే ఏ నిర్ణయమైనా మద్దతు ఇస్తామని అగ్రరాజ్యం అమెరికా సైతం ప్రకటించింది. ఈ పరిణామాలతో పాకిస్తాన్‌లో ఆందోళన మరింత పెరిగింది. దీని ఫలితంగా పాక్ ప్రభుత్వం యుద్ధం నిలువరించేందుకు ఇతర దేశాల సహకారాన్ని కోరుతోంది. ఈ నేపథ్యంలో, ప్రధాని షహబాజ్ షరీఫ్ వివిధ దేశాధినేతలతో సమావేశాలు నిర్వహిస్తున్నారు.
ఇటీవల షహబాజ్ షరీఫ్ ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెర్రస్‌తో మాట్లాడి, భారత్‌తో నెలకొన్న ఉద్రిక్తతలు తగ్గించేందుకు చర్యలు తీసుకోవాలని అభ్యర్థించారు. అలాగే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ), సౌదీ అరేబియాతో పాటు ఇతర గల్ఫ్ దేశాధినేతలతో సమావేశమయ్యారు. యూఏఈ రాయబారి హమర్ ఒబైద్ ఇబ్రహీం అల్ జాబీతో పాటు, కువైట్ రాయబారి నాసన్ రెహ్మన్ జాసన్‌ను కూడా కలిశారు. భారత్‌పై ఒత్తిడి తీసుకురావాలని విజ్ఞప్తి చేశారు.
Also Read: పాక్ గూఢచారి అరెస్ట్.. పహల్గామ్ ఉగ్రదాడి వెనుక ఉన్నది వారే
ఈ సందర్భంగా పాక్ ప్రధాని కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది. అందులో షహబాజ్ షరీఫ్.. సౌదీ అరేబియా రాయబారితో సమావేశమైన ఫొటోను విడుదల చేసింది. ఈ సమావేశంలో, దక్షిణాసియాలో శాంతి, స్థిరత్వం కోసం పాకిస్తాన్ కట్టుబడి ఉందని షహబాజ్ పునరుద్ఘాటించినట్టు పేర్కొంది. అంతకుముందు భారత్ దాడి చేయకుండా ఆపాలని చైనా, రష్యాలను పాకిస్తాన్ సంప్రదించింది. ఈ దాడిపై నిష్పక్షపాత విచారణ జరపాల్సిందిగా పాక్ అభ్యర్థించింది.
పాకిస్తాన్ పై దాడిని వ్యతిరేకించే దేశాలు ఇవే..
భారతదేశం పాక్‌పై దాడులు జరిపితే, పాక్‌కు మద్దతుగా కొన్ని దేశాలు నిలిచే అవకాశాలున్నాయి. టర్కీ, అజర్‌బైజాన్, బంగ్లాదేశ్ వంటి కొన్ని ముస్లిం దేశాలతో పాటు చైనా కూడా పాక్‌కు అండగా నిలిచే అవకాశం ఉంది. కశ్మీర్ విషయంలో టర్కీ ఇప్పటికే పాకిస్తాన్‌కు మద్దతు తెలిపిన దేశం. ఐక్యరాజ్యసమితిలో పాక్‌కు అనేకసార్లు టర్కీ మద్దతుగా నిలిచిన సందర్భాలున్నాయి. భారత్‌తో ప్రస్తుతం స్నేహపూర్వకంగా వ్యవహరిస్తున్న చైనా కూడా పాకిస్తాన్ కు బాసటగా నిలిచే అవకాశం ఉంది. మరోవైపు, బంగ్లాదేశ్‌లో రాజకీయ సంక్షోభం కారణంగా ఏర్పాటైన కొత్త ప్రభుత్వం కూడా భారత్‌కు అనుకూలంగా లేదు. అందువల్ల బంగ్లాదేశ్ కూడా పాకిస్తాన్‌కు మద్దతుగా నిలిచే అవకాశం ఉందని అంతర్జాతీయ విశ్లేషకులు భావిస్తున్నారు.