Russia Chef death | రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌ని విమర్శించిన ఒక ఫేమస్ చెఫ్ సెర్బియాలోని ఒక 5 స్టార్ హోటల్ లో శవమై తేలాడు. ఈ ఘటన బుధవారం నవంబర్ 13 2024న జరిగింది. రష్యా, యుకె దేశాలలో అలెక్సెయి జిమిన్ (52) ఒక ఫేమస్ చెఫ్. ఆయన 2014 వరకు రష్యా ప్రముఖ టివి ఛానెల్ NTVలో కుకింగ్ షో నడిపేవాడు. ఆ షో చాలా ఫేమస్ కావడంతో చెఫ్ అలెక్సెయి జిమిన్ కు మంచి పేరొచ్చింది. అయితే ఉక్రెయిన్ లో భాగమైన క్రిమియాని రష్యా 2014లో ఆక్రమించుకోవడంతో ఆయన రష్యా ప్రభుత్వంపై విమర్శలు చేశారు. దీంతో ఆయన కుకింగ్ షోని NTV ఛానెల్ రద్దు చేసింది.
ఆ తరువాత అలెక్సెయి జిమిన్‌పై రష్యా ప్రభుత్వం వేధించడంతో ఆయన రష్యా వదిలి లండన్ వలస వెళ్లారు. అక్కడ ఆయన సొంతంగా రెస్టారెంట్లు స్థాపించి బిజినెస్ చేస్తున్నారు. ఈ క్రమంలో 2022లో ఉక్రెయిన్‌పై రష్యా పూర్తి స్థాయి యుద్ధం ప్రకటించడంతో ఆయన మళ్లీ సోషల్ మీడియాపై రష్యా ప్రభుత్వం, ప్రెసిడెంట్ పుతిన్‌కు వ్యతిరేకంగా పోస్ట్ చేశారు.
Also Read: 29 మంది పిల్లలకు ఉరిశిక్ష?.. జైల్లో ఆహారం ఇవ్వకుండా వేధింపులు..
చెఫ్ అలెక్సెయి జిమిన్ మృతిపై ఆయన బిజినెస్ పార్టనర్ క్యాటరీనా టర్నోవస్కాయాతో బిబిసి మీడియా ప్రతినిధులు మాట్లాడారు. “అలెక్సెయి జిమిన్ చాలా సంతోషంగా ఉండే వ్యక్తి ఇటీవలే ఆయన బ్రిటన్ ఆంగ్లోమేనియా అనే పుస్తకం రాశారు. ఆ పుస్తక ప్రొమోషన్స్ కోసమే సెర్బియా రాజధాని బెల్‌గ్రేడ్ వెళ్లారు. నేను ఆయనతో కలిసి లండన్ లో జీమా రెస్టారెంట్ ప్రారంభించాం. ఆయన సెర్బియాకు వెళ్లే ముందు రోజు రాత్రి ఇద్దరం కలిసి డిన్నర్ కూడా చేశాం. ఆయన ఆరోగ్యంగా, సంతోషంగా కనిపించారు. ఆయనది సహజ మరణం కాదని నేను అనుకుంటున్నాను.” అని క్యాటరీనా బిబిసితో అన్నారు.
సెర్బియా రాజధాని బెల్ గ్రేడ్ లోని హోటల్ రూమ్ లో అలెక్సెయి జిమిన్ అపస్మారక స్థితిలో కనిపించారని.. హోటల్ యజమాన్యం డాక్టర్ల చేత పరీక్షించగా.. ఆయన మరణించినట్లు వైద్యులు ధృవీకరించారు. ప్రస్తుతం అలెక్సెయి జిమిన్ మృదేహాన్ని సెర్బియా పోలీసులు పోస్ట్ మార్టం కోసం తరలించారు. అయితే ఆయన మృతదేహంపై ఎలాంటి దాడి చేసిన గుర్తులు లేవని, ఇక విషప్రయోగం జరిగిందా? అనే కోణంలో కూడా విచారణ జరుగుతోందని పోలీసులు తెలిపారు. శవానికి టక్సికాలజీ పరీక్షలు చేయించిన తరువాత పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చాక వివరాలు వెల్లడిస్తామని అధికారులు చెప్పారు.
అలెక్సెయి జిమిన్ మరణం పట్ల ఆయన రెస్టారెంట్ సిబ్బంది కూడా ఇన్‌స్టాగ్రామ్ లో ఓ పోస్ట్ చేశారు. “అలెక్సెయి జిమిన్ తమకు యజమాని మాత్రమే కాదు. ఒక స్నేహితుడు, దయగల మనస్తత్వం కలవారు. సిబ్బందికి ఏదైనా సమస్య వస్తే ఆయన సాయం చేయడానికి ముందుంటారు. ఆయన చనిపోవడం చాలా బాధాకరం. జీమా రెస్టారెంట్ అలెక్సెయి జిమిన్ కు నివాళి అర్పిస్తోంది” అని రాశారు.
ఉక్రెయిన్ యుద్ధం మొదలైనప్పటి నుంచీ ఆయన రష్యా ప్రభుత్వంపై తీవ్రంగా విమర్శలు చేసేవారు. రష్యా సైనికులు ఉక్రెయిన్ భూభాగం నుంచి వైదొలగాలని ఆయన యుద్ధానికి వ్యతిరేకంగా ఒక పాట కూడా పాడారు. ఆ తరువాత నుంచి ఆయన పలుమార్లు రష్యా ప్రభుత్వం, అధ్యక్షుడు పుతిన్ పై సోషల్ మీడియా వేదికగా విమర్శలు చేశారు.
సెంట్రల్ లండన్ లో జీయా రెస్టారెంట్ స్థాపించిన తరువాత ఆయన తిరిగి రష్యా ఎప్పుడూ వెళ్లలేదు. పైగా ఉక్రెయిన యుద్ధ బాధితుల కోసం భారీగా విరాళాలు అందించారు.