Putin Condition End War| ఉక్రెయిన్-రష్యా మధ్య సుదీర్ఘంగా జరుగుతున్న యుద్ధం ముగించేందుకు అగ్రరాజ్యం అమెరికా మధ్యవర్తిత్వంతో చర్చలు జరుగుతున్నాయి. ఇప్పటికే అమెరికా ప్రతిపాదించిన 30 కాల్పుల విమరణకు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ అంగీకరించారు. అయితే రష్యా నుంచి మాత్రం ఏ విషయం స్పష్టం కాలేదు. ఈ పరిణామాల మధ్య రష్యా ప్రెసిడెంట్ వ్లాదిమిర్ పుతిన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఉక్రెయిన్‌లో ప్రస్తుత జెలెన్‌స్కీ ప్రభుత్వంతో చర్చలకు తాను విముఖంగా ఉన్నట్లు పరోక్షంగా చెప్పారు. అధ్యక్ష పీఠం నుంచి జెలెన్‌స్కీ దిగిపోయి.. ఉక్రెయిన్‌లో తాత్కాలిక ప్రభుత్వం ఏర్పడాలని అభిప్రాయపడ్డారు. అప్పుడైతేనే యుద్ధం ముగించేందుకు మార్గం సుగమం అవుతుందని సూచనప్రాయంగా తెలిపారు.
ముర్మాన్స్క్ ప్రాంతంలో పర్యటించిన పుతిన్ అక్కడ విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భంగా ఉక్రెయిన్‌తో చర్చలు, ఆ దేశాధ్యక్షుడిగా జెలెన్‌స్కీ చట్టబద్ధత గురించి అడిగిన ప్రశ్నకు ఆయన బదులిచ్చారు. ‘‘శాంతి స్థాపన కోసం రూపొందించిన పత్రాలపై ఎవరు సంతకం చేస్తారన్నది ఇప్పుడే తెలియదు. ఆ దేశంలో అధికారంలో ఉన్నది ఎవరో స్పష్టంగా లేదు. ఎందుకంటే రేపు అక్కడ (ఉక్రెయిన్‌లో) వేరే నేత అధికారంలోకి రావొచ్చు. ఎన్నికలు జరగొచ్చు. ఉక్రెయిన్ లో ఐక్యరాజ్యసమితి పర్యవేక్షణలో తాత్కాలిక ప్రభుత్వం ఏర్పాటుకావాలి. అప్పుడైతేనే ఆ దేశంలో కొత్తగా ఎన్నికలు జరిపేందుకు వీలుంటుంది. అలా ప్రజల విశ్వాసంతో ఏర్పాటైన నూతన ప్రభుత్వంతో శాంతి పునరుద్ధరణకు చర్చలు జరపాలనుకుంటున్నాం. యావత్ ప్రపంచం గుర్తించే ఆ కొత్త ప్రభుత్వంతో యుద్ధం ముగింపునకు అవసరమైన ‘చట్టబద్ధ పత్రాల’పై సంతకం జరగాలి’’ అని పుతిన్ వ్యాఖ్యానించారు.
Also Read: ఆరోగ్య శాఖలో 10 వేల మందిని తొలగించిన ట్రంప్ .. 10 లక్షల మంది చనిపోతారని హెచ్చరించిన గావి
ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ పదవీకాలం గతేడాదే ముగిసినా ఇంతవరకూ అక్కడ ఎన్నికలు జరగలేదని పుతిన్ గుర్తుచేశారు. అందువల్ల ఆ దేశంలో ఉన్న అధికార యంత్రాంగం చట్టవిరుద్ధమైనదని అభివర్ణించారు. ఈ యుద్ధంతో తమ లక్ష్యాలను చేరుకునే దిశగా రష్యా స్థిరంగా ముందుకెళ్తోందని పుతిన్ పునరుద్ఘాటించారు.
ఈ సందర్భంగా రెండు దేశాల మధ్య శాంతి స్థాపనకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేస్తున్న ప్రయత్నాలను పుతిన్ ప్రశంసించారు. ‘‘అమెరికాలో గత అధ్యక్షుడికి (బైడెన్) భిన్నంగా నూతనంగా ఎన్నికైన అధ్యక్షుడు ట్రంప్ యుద్ధం ముగింపును కోరుకుంటున్నారు. దీనికి కారణాలేమైనా సరే.. ఆయన మాత్రం శాంతిని కోరుకుంటున్నారని స్పష్టమవుతోంది’’ అని రష్యా అధ్యక్షుడు తెలిపారు.
త్వరలోనే పుతిన్ చనిపోతాడు: జెలెన్‌స్కీ
మరోవైపు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఆరోగ్యంపై వదంతుల నేపథ్యంలో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ సంచలన ప్రకటన చేశారు. ఆయన తొందరలోనే చనిపోతారని వ్యాఖ్యానించారు. రెండు దేశాల మధ్య యుద్ధం అప్పుడే ముగుస్తుందన్నారు. పారిస్‌లో ఓ ఇంటర్వ్యూలో జెలెన్‌స్కీ ఈ వ్యాఖ్యలు చేశారు. ఫ్రాన్స్ ప్రెసిడెంట్ మాక్రాన్‌తో బుధవారం జరిగిన సమావేశం తరువాత ఆయన మీడియాతో మాట్లాడారు.
శాంతి ప్రయత్నాలు జరుగుతున్నా రష్యా మాత్రం సంఘర్షణను ఇంకా కొనసాగిస్తుందని ఆరోపించారు. ‘‘యుద్ధం కొనసాగాలని రష్యా కోరుకుంటోంది. యుద్ధాన్ని ముగించేలా దానిపై ఒత్తిడి తేవాల్సిన అవసరముంది’’ అన్నారు. పుతిన్ ఆరోగ్యంపై కొన్ని నెలలుగా ఊహాగానాలు, వదంతులు వినిపిస్తున్నాయి.
పుతిన్ ఎడ తెరిపి లేకుండా దగ్గుతున్న వీడియోలు, చేతులు, కాళ్లు అసంకల్పితంగా కదలడం వంటివి పుకార్లకు మరింత బలం చేకూర్చాయి. 2022లో రష్యా మాజీ రక్షణ మంత్రి సెర్గీ షొయిగుతో భేటీ సమయంలో పుతిన్ టేబుల్ పట్టుకొని కుర్చీలో కూర్చున్న వీడియో వైరల్ అయ్యింది. ఆయన పార్కిన్సన్, కేన్సర్‌తో పోరాడుతున్నట్టు కొన్ని నివేదికలు కూడా వచ్చాయి. కానీ క్రెమ్లిన్ ఈ వార్తలను ఖండించింది.