GAVI Vaccine Funds Trump Health Sector Layoffs | అమెరికాలో ప్రభుత్వ ఉద్యోగుల సంఖ్యను తగ్గించడమే లక్ష్యంగా పెట్టుకున్న ట్రంప్ (Donald Trump) యంత్రాంగం.. తాజాగా ఆరోగ్య విభాగంలో సంస్కరణలకు సిద్ధమైంది. పునర్‌వ్యవస్థీకరణలో భాగంగా 10వేల ఉద్యోగులను తొలగించనున్నట్లు అమెరికా ఆరోగ్యశాఖ మంత్రి రాబర్ట్ ఎఫ్ కెనడీ జూనియర్ వెల్లడించారు. తద్వారా ఏడాదికి దాదాపు 1.8 బిలియన్ డాలర్లు ఆదా అవుతాయని అన్నారు.
అంటువ్యాధుల పర్యవేక్షణ, ఆహారం, ఆసుపత్రుల తనిఖీ, సగానికిపైగా దేశ జనాభా ఆరోగ్య బీమా కార్యక్రమాలను పర్యవేక్షించడంలో అమెరికా ఆరోగ్య విభాగం కీలకంగా వ్యవహరిస్తుంది. పునర్‌వ్యవస్థీకరణలో భాగంగా తన కార్మికశక్తిని 82 వేల నుంచి 62వేలకు తగ్గించుకోనున్నట్లు తెలిపింది. వీరిలో ముందస్తు పదవీ విరమణ తీసుకునే వారు సహా బైఅవుట్ ఆఫర్ పొందేవారు ఉన్నట్లు వివరించారు.
ఈ కోతల ప్రభావం పలు కీలక ప్రజారోగ్య విభాగాలపై పడనున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (FDA).. 3500 మంది ఉద్యోగులను తొలగించనుంది. అంటువ్యాధులను ట్రాక్ చేసే సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (CDCP)లో 2400 ఉద్యోగాలు, నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ హెల్త్‌లో 1200 మందిని, మెడికేర్ ఆరోగ్య బీమాను పర్యవేక్షించే విభాగంలో 300 ఉద్యోగాలను తొలగించేందుకు సిద్ధమైనట్లు సమాచారం.
యూఎస్‌ఎయిడ్ (USAID) సంస్థ ద్వారా అంతర్జాతీయంగా చేపడుతున్న వేలాది కార్యక్రమాలకు ముగింపు పలకనున్నట్లు అమెరికా పేర్కొన్న సంగతి తెలిసిందే. దీంతో అమెరికా సాయంపై ఆధారపడి నడిచే అనేక సంస్థలపై దీని ప్రభావం పడుతున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో అంతర్జాతీయ వ్యాక్సిన్ కూటమి గావి (Global Alliance For Vaccines and Immunization – GAVI) తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. అమెరికా నుంచి అందే ఆర్థిక సాయం ఆగిపోతే భారీ స్థాయి మరణాలు సంభవిస్తాయని.. దాదాపు 10 లక్షల మంది చనిపోయే ప్రమాదం ఉందని తెలిపింది.
“గావికి అమెరికా నుంచి వచ్చే నిధులు ఆగిపోతే ప్రపంచ ఆరోగ్య భద్రతపై వినాశకర ప్రభావం చూపుతుంది. నిర్మూలించగలిగే వ్యాధులతో దాదాపు 10 లక్షల మరణాలు సంభవించవచ్చు. ప్రమాదకర వ్యాధుల వ్యాప్తి అనేక జీవితాలపై పడనుంది” అని అంతర్జాతీయ వ్యాక్సిన్ కూటమి చీఫ్ ఎగ్జిక్యూటివ్ సానియా నిష్టర్ పేర్కొన్నారు. అయితే, నిధులు నిలిపివేస్తున్నట్లు అమెరికా నుంచి ఇప్పటివరకు ఎటువంటి సమాచారం రాలేదన్నారు. దీనిపై వైట్ హౌస్ సహా కాంగ్రెస్‌తోనూ సంప్రదింపులు జరుపుతున్నామన్నారు. ఈ ఏడాది కార్యక్రమాల కోసం అమెరికా పార్లమెంటు ఆమోదించిన 300 మిలియన్ డాలర్లను పొందేందుకు ప్రయత్నాలు చేస్తున్నామన్నారు.
అంతర్జాతీయంగా మానవతా దృక్పథంతో సహాయం చేయడానికీ, ఆయా దేశాల అభివృద్ధికీ, భద్రతకూ నిధులు సమకూర్చడానికీ ‘అమెరికా అంతర్జాతీయ అభివృద్ధి సంస్థ’ (USAID) ఏర్పాటైంది. దాదాపు 120 దేశాల్లో వివిధ కార్యక్రమాల కోసం ఏటా వందల కోట్ల డాలర్లను సహాయంగా అందిస్తున్నారు. అయితే, ఈ సంస్థను మూసివేస్తున్నట్లు ఇటీవల అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) ఇటీవల ప్రకటించడం సంచలనం రేపింది.
మరోవైపు, అనేక వారాల సమీక్ష అనంతరం దాదాపు 5వేలకు పైగా కార్యక్రమాలను రద్దు చేస్తున్నట్లు అమెరికా అధికారులు ఇటీవల ప్రకటించారు. విదేశాంగశాఖ కింద కేవలం కొన్ని కార్యక్రమాలకే ఆర్థిక సాయాన్ని అందిస్తామన్నారు. అయితే, ఇటీవల ఈ కార్యక్రమాల రద్దుకు సంబంధించి లీకైన 281 పేజీల రిపోర్ట్‌లో అంతర్జాతీయ వ్యాక్సిన్ కూటమి ‘గావి’ (GAVI) కూడా ఉండడం ఆందోళనకు కారణమైంది. బిల్ & మెలిండా గేట్స్ ఫౌండేషన్ సహా ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO), యునిసెఫ్, ప్రపంచ బ్యాంకు ఇందులో భాగస్వామ్యంతో 2000లో ఈ కూటమి ఏర్పాటైంది. పేద దేశాల్లోని చిన్నారులు ప్రమాదకర వ్యాధుల బారినపడకుండా నిరోధించే వ్యాక్సిన్‌లను ఉచితంగా అందజేస్తుంది.