Putin Trump Talks| ఉక్రెయిన్ యుద్ధంలో కాల్పుల విరమణ, శాంతి చర్చల కోసం అమెరికా తదుపరి అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో తాము సిద్ధంగా ఉన్నామని.. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ అన్నారు. రష్యా లో ఒక వార్షిక టీవీ కార్యక్రమంలో ఆయన రష్యా ప్రజలనుద్దేశించి ఆయన ఈ మాటలన్నారు. ఉక్రెయిన్‌తో శాంతి చర్చల కోసం కూడా తాము ఎటువంటి షరతులు విధించలేదని, ట్రంప్ తో ఒకసారి సమావేశం కోసం ఎదురు చూస్తున్నామని ఆయన వ్యాఖ్యానించారు. ట్రంప్‌తో తాను మాట్లాడి చాలా సంవత్సరాల క్రితం మాట్లాడానని.. అప్పటి నుంచి ఆయనతో సంప్రదింపులు లేవని చెప్పారు.
ఉక్రెయిన్ పై 2022లో దాడి చేసిన తరువాత రష్యాకు మరింత బలం చేకూరిందని చెప్పారు. యుద్ధం కారణంగా రష్యా బలహీనమైపోయిందనే ప్రచారాన్ని ఆయన కొట్టిపారేశారు. కొన్ని రోజుల క్రితం అంతర్జాతీయ మీడియా కథనాల ప్రకారం.. ఉక్రెయిన్ యుద్ధం లో కాల్పుల విరమణ కోసం ట్రంప్‌తో చర్చలు సాగించడానికి రష్యా సిద్ధంగా ఉంది. కానీ ఉక్రెయిన్ భూభాగం నుంచి సైన్యం ఉపసంహరించేందుకు అంగీకరించలేదు. అన్నింటి కంటే ముఖ్యంగా నాటో దేశాల కూటమిలో చేరే ఉద్దేశం ఉక్రెయిన్ మానుకోవాల్సిందేనని రష్యా పట్టుబట్టింది. ఈ అంశంపై అంగీకరిస్తే.. ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలొడిమిర్ జెలెన్‌స్కీతో కూడా చర్చలు సిద్ధంగా ఉన్నట్లు రష్యా ప్రతినిధులు తెలిపారు.
అయితే యుద్ధంలో సంధికి అధికార గుర్తింపు ఉండాలంటే ఉక్రెయిన్ పార్లమెంట్ నాయకుడు ఆమోదం తప్పనిసరిగా కావాలని పుతిన్ అన్నారు. లేదా జెలెన్‌స్కీ మరో సారి ఎన్నికల్లో విజయం సాధించాలి. అప్పుడే ఆయనకు ఉక్రెయిన్ ప్రతినిధిగా గుర్తిస్తామని పుతిన్ ప్రభుత్వం స్పష్టం చేసింది.
ఉక్రెయిన్ తో తాత్కాలిక సంధి తమకు అవసరం లేదని, సుదీర్ఘకాలం కొనసాగే శాంతి ఒప్పందానికి మాత్రమే తాము అంగీకరిస్తామని పుతిన్ చెప్పారు. ఇంతకుముందు టర్కీ రాజధాని ఇస్తాన్‌బుల్ లో రష్యా, ఉక్రెయిన్ మధ్య జరిగిన తొలి దశ చర్చల్లో తాము చెప్పిన షరతులకు అంగీకరిస్తే.. ప్రత్యక్షంగా ఉక్రెయిన్ ప్రజాప్రతినిధులతోనే ఒప్పందానికి సిద్దమని పుతిన్ తెలిపారు. కానీ టర్కీలో జరిగిన చర్చల్లో ఉక్రెయిన్ రాజకీయ నాయకులు రష్యా షరతులను అంగీకరించలేదు. అలా చేస్తే.. మిలిటరీ పరంగా, రాజకీయ పరంగా ఉక్రెయిన్ కు భారీగా నష్టం జరుగుతుందని వాదించారు.
Also Read: కెనెడా అమెరికాలో ఒక రాష్ట్రమైతే.. ట్రంప్ వివాదాస్పద వ్యాఖ్యలు
2002 నుంచి జరుగుతున్న రష్యా, ఉక్రెయిన్ యుద్ధంలో ఇప్పటి వరకు ఇరు వైపులా దాదాపు 1,50,000 మంది చనిపోయారు. వీరిలో ఉక్రెయిన్ పౌరులు 12,000కు పైగా ఉండడం విచారకరం. యుద్దంలో రష్యా సైనికులు దాదాపు 71,000 మంది, ఉక్రెయిన్ సైనికులు 43,000 మంది చనిపోయారని అధికారిక సమాచారం. కానీ ఈ గణాంకాలు చాలా తక్కువని అంతర్జాతీయ మీడియా ఆరోపిస్తుంది. ఉక్రెయిన్ లోని దాదాపు 20 శాతం భూభాగం రష్యా ఆధీనంలో ఉంది. 2024లో రష్యా మరింత భూభాగం ఆక్రమించుకుంది.
ఉక్రెయిన్ యుద్ధంలో తాము లక్ష్యానికి చేరువలో ఉన్నట్లు పుతిన్ (Putin) చెబుతున్నారు. కానీ భవిష్యత్తు ఎలా ఉండబోతోందో అంచనా వేయడం కష్టమని అన్నారు. యుద్దం వల్ల రష్యా ఆర్థికంగా చాలా నష్టపోయిన విషయాన్ని పుతిన్ అంగీకరించారు. ఉక్రెయిన్ పై దాడి చేయడంలో తాము చాలా ఆలస్యం చేశామని.. ఒక సంవత్సర కాలం ముందే దాడి చేసి ఉంటే ఫలితాలు వేరేగా ఉండేవని పుతిన్ వ్యాఖ్యానించారు. అయితే ఎన్ని కష్టలొచ్చినా ఓర్చుకునే శక్తి రష్యాకు ఉందని, రష్యా మరింత బలంతో పోరాడుతుందని ఆయన చెప్పారు.