
Sponge Bomb : కలుగుల్లో నక్కిన హమాస్ మిలిటెంట్లను బయటకు రప్పించేందుకు ఇజ్రాయెల్ బలగాలు ఓ వినూత్న ఎత్తుగడను అనుసరించనున్నాయి. ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్(ఐడీఎఫ్)కు ఓ పట్టాన కొరుకుడుపడని గాజా సొరంగాల వ్యవస్థను ఛేదించేందుకు స్పాంజ్ బాంబులను పరీక్షిస్తున్నట్టు తెలుస్తోంది.
ఇవి ఒక రకమైన రసాయనిక బాంబులు. బాంబులు అనగానే పేలుడు పదార్థాలు ఉంటాయని అనుకుంటారు. కానీ స్పాంజ్ బాంబుల్లో పేలుడు పదార్థాలు ఏవీ ఉండవు. వీటి నుంచి నురగ(foam)లాంటి రసాయన పదార్థం విడుదలవుతుంది. అది శరవేగంగా వ్యాపిస్తూ..అంతే వేగంగా గట్టిపడిపోతుంది. టన్నెళ్ల నుంచి ఉగ్రవాదులు బయటకొచ్చి దాడి చేయకుండా వాటి ప్రవేశ ద్వారాలను ఈ ఫోమ్ మూసేస్తుంది.
అయితే ఈ స్పాంజ్ బాంబుల వినియోగంపై ఐడీఎఫ్ పెదవి విప్పడం లేదు. గాజా సరిహద్దుల్లోని జీలిమ్ ఆర్మీ బేస్‌లో సృష్టించిన కృత్రిమ సొరంగంలో ఈ బాంబ్‌ను పరీక్షించినట్టు తెలుస్తోంది. ఓ ప్రత్యేక పరికరంలో రెండు రకాల ద్రవాలను వేరు చేస్తూ మెటల్ పార్టిషన్ ఉంటుంది. ఒకసారి ఆ అడ్డు తొలగిపోయినప్పుడు రెండు ద్రవాలు కలిసిపోయి ఫోమ్‌గా.. ఆ తర్వాత గట్టి పదార్థంగా మారిపోతుంది.
దీనితోనే ఒక్కో సొరంగమార్గాన్ని మూసేసుకుంటూ వెళ్లే వ్యూహాన్ని ఇజ్రాయెల్ రచిస్తోంది. అంతే కాదు.. ఏరియల్ సెన్సర్లు, భూమిలో ఎక్కువ లోతులో ఉన్న సొరంగాలను గుర్తించే రాడార్ వ్యవస్థలు, డ్రిల్లింగ్ యూనిట్లు, నైట్ విజన్ గాగుల్స్ వంటి ప్రత్యేక పరికరాలు సైతం ఇజ్రాయెల్ బలగాల వెంట ఉంటాయి.
స్పాంజ్ బాంబులను ప్రయోగించేటప్పుడు ఎన్నో జాగ్రత్తలు అవసరం. వాటిని సరిగా ఉపయోగించక కొందరు ఇజ్రాయెల్ సైనికులు కంటిచూపును కోల్పోయినట్టు తెలుస్తోంది. టన్నెళ్ల ద్వారా వెళ్లే ఇజ్రాయెల్ సైనికులకు చేదోడువాదోడుగా రోబోలు, డ్రోన్లు ఉంటాయి. అయితే అండర్ గ్రౌండ్ ఆపరేషన్లలో వాటిని ఉపయోగించడంలో కష్టాలెన్నో ఉంటాయి.
అలాగే భూమి అడుగున రేడియో సిగ్నళ్లు బలహీనపడకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. అరచేతిలో ఇమిడిపోయే మైక్రో డ్రోన్లు ఉపయోగించి నప్పుడూ ఇలాంటి ఇబ్బందులు తప్పవు . ఇంతా చేసి సొరంగాల్లోకి ప్రవేశించినా.. 200 మంది ఇజ్రాయెలీలు హమాస్ చేతుల్లో బందీలుగా ఉన్నారన్న విషయం గుర్తెరిగి ఇజ్రాయెల్ అడుగు ముందుకు వేయాల్సి ఉంటుంది. పైపెచ్చు సొరంగాలన్నీ జనావాసాల కిందే ఉన్నాయి.
హమాస్ సొరంగ వ్యవస్థను చివరిసారిగా 2014లో 100 కిలోమీటర్ల మేర ఇజ్రాయెల్ ధ్వంసం చేయగలిగింది. కానీ ఆ తర్వాత హమాస్ మిలిటెంట్లు వాటిని మరింతగా విస్తరించుకుంటూ వచ్చారు. ప్రస్తుతం వారి సొరంగ వ్యవస్థ 500 కిలోమీటర్ల మేర విస్తరించి ఉన్నట్టు సమాచారం. గాజా కన్నా నాలుగింతలు ఉన్న ఢిల్లీలో భూగర్భ మెట్రో నెట్‌వర్క్ విస్తరించింది 392 కిలోమీటర్లు మాత్రమే. దీనిని బట్టి గాజాలోని హమాస్ టన్నెల్ వ్యవస్థ ఎంతో పెద్దదో అర్థం చేసుకోవచ్చు.