Salt Shortage: శ్రీలంక ప్రజలకు ఉప్పు దొరికే పరిస్థితి ఇప్పుడు అందని ద్రాక్షలా మారిపోయింది. సాధారణంగా 50 సెంట్లకు దొరికే ఉప్పు ప్యాకెట్ ధర ఇప్పుడు 1.1 నుంచి 1.25 పౌండ్లకు పెరిగింది. ధరలు పెరిగినా, దొరికితే అదృష్టం అనే స్థితి వచ్చింది. సూపర్‌మార్కెట్ల షెల్ఫ్‌లు ఖాళీగా ఉండటంతో ప్రజలు ఒక్క కిలో ఉప్పు కోసం గంటల తరబడి తిరుగుతున్నారు.
కారణం ఏంటి?
ఈ కొరత వెనక ప్రధాన కారణం భారీ వర్షాలే. మార్చి నుంచి మే మధ్యలో కురిసిన వర్షాల వల్ల హంబంటోట, ఎలిఫెంట్ పాస్, పుట్టలం వంటి ప్రధాన ఉప్పు ఉత్పత్తి ప్రాంతాల్లో ఉత్పత్తి పూర్తిగా నిలిచిపోయింది. పుట్టలంలో మాత్రమే 15,000 మెట్రిక్ టన్నుల సిద్ధంగా ఉన్న ఉప్పు నీట మునిగిపోయింది. ఇదే ప్రాంతం దేశానికి 60% ఉప్పు సరఫరా చేస్తుందన్నది గమనించాలి.
ఉప్పు కొరత వల్ల ధరలు అమాంతం పెరిగాయి. 50 కిలోల సంచి ధర 3.7 పౌండ్ల నుంచి ఏకంగా 17 పౌండ్లకు చేరింది. శ్రీలంకకు సంవత్సరానికి 1,80,000 మెట్రిక్ టన్నుల ఉప్పు అవసరం ఉండగా, గత ఏడాది కేవలం 1,00,000 టన్నుల ఉత్పత్తే సాధ్యమైంది. ఫలితంగా 80,000 టన్నుల కొరత ఏర్పడింది. ఇది నిత్యవసరాల ధరలపై తీవ్రమైన ప్రభావం చూపుతోంది.
ప్రజల అసహనం
ఇతర వస్తువుల కొరతల్ని మించి ప్రజలు ఉప్పు కోసం ఎదుర్కొంటున్న ఇబ్బందులు విపరీతంగా ఉన్నాయి. సామాజిక మాధ్యమాల్లో ఖాళీ షెల్ఫ్‌ల ఫొటోలు, ప్రజల కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. సముద్రం చుట్టూ ఉన్న దేశం, కానీ ఉప్పు దొరకడం లేదంటూ ప్రజలు ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శిస్తున్నారు.
ప్రభుత్వం ఏం చెబుతోంది?
వాణిజ్య మంత్రి వసంత సమరసింఘే ప్రకారం, మే 28న భారత్ నుంచి 3,050 మెట్రిక్ టన్నుల ఉప్పు శ్రీలంకకు రానుంది. ఇప్పటివరకు 12,500 టన్నుల ఉప్పును దిగుమతి చేశారు. మొదట దేశీయ ఉత్పత్తిదారులకు మద్దతుగా ఉప్పు దిగుమతులపై నిషేధం విధించినా, వర్షాల తీవ్రత ఆ నిర్ణయాన్ని తిరగరాసింది.
ఈ పరిస్థితి వల్ల శ్రీలంక తన వనరులను ఆధారంగా చేసుకుని స్వావలంబన దిశగా వెళ్లాల్సిన అవసరం ఎంత ఉందో స్పష్టంగా తెలుస్తోంది. 2022 ఆర్థిక సంక్షోభం నుంచి ఇప్పటికీ కోలుకోలేని ఈ దేశానికి, వాతావరణ మార్పులు మరో పెద్ద హెచ్చరికను పంపిస్తున్నాయి. సముద్రం ఉన్నా ఉప్పు దొరకకపోతే, దీర్ఘకాలిక ప్రణాళికల లోటు ఏంటో స్పష్టంగా తెలుస్తోంది.