Vishaka 50 Cr Scam: కొడితే అమెరికన్లనే కొట్టాలి.. పడితే డాలర్లలోనే పట్టాలి.. ఇదీ సైబర్ కేటుగాళ్ల నయా ప్లాన్. డబ్బులే డబ్బులు వస్తాయనుకున్నారు. ఏకంగా నకిలీ కాల్ సెంటరే తెరిచారు. 3 అపార్ట్ మెంట్లలో 44 ఫ్లాట్లలో ఇదే పని. అమెరికన్ కస్టమర్లకు ఫోన్లు చేయడం.. పార్సిల్ అని, గిఫ్ట్ కూపన్లు అంటూ బురిడీ కొట్టించడం. నెలకు ఏకంగా 20 కోట్ల నుంచి 50 కోట్ల దాకా కొల్లగొడుతున్నారు. సీన్ కట్ చేస్తే ఈ సైబర్ క్రైమ్ ముఠాకు విశాఖ పోలీసులు పుల్ స్టాప్ పెట్టారు. ఎలా దొరికారు? ఏం జరిగింది?
అచ్యుతాపురం పరిసరాల్లో సైబర్ ముఠాలు
అంతర్జాతీయ పరిశ్రమలకు నెలవుగా మారిన అచ్యుతాపురం.. అదే స్థాయిలో అసాంఘిక కార్యకలాపాలకు వేదికగా మారింది. అచ్యుతాపురంతోపాటు పరిసర గ్రామాల్లోని పలు అపార్ట్‌మెంట్లలో ఖాళీగా ఉండే ఫ్లాట్లల్లో ఏదో జరుగుతోందని అనుమానించిన పోలీసులు సెర్చ్ ఆపరేషన్ నిర్వహించగా.. భారీ సైబర్ క్రైమ్ ముఠా పట్టుబడింది. కోనెంపాలెంలోని అపార్ట్‌మెంట్‌లో పోలీసులు తొలుత మెరుపు దాడులు చేశారు. ఆ తర్వాత భోగాపురం, రామన్నపాలెం, దుప్పితూరు, వెదురువాడలోని పలు అపార్ట్‌మెంట్లలోనూ తనిఖీలు చేశారు. సీన్ కట్ చేస్తే అంతా ఈశాన్య రాష్ట్రాలకు చెందిన యువతీ యువకులు పట్టుబడ్డారు. వీళ్లందరినీ విచారిస్తే అమెరికన్లను ఎలా మోసం చేస్తున్నారో పోలీసులు గుర్తించారు.
200 నుంచి 250 మంది వరకు డ్యూటీలు
కాల్‌సెంటర్లు నిర్వహిస్తూ అమెరికా పౌరులను లక్ష్యంగా చేసుకుని నకిలీ ఈ-కామర్స్ యాప్‌లతో సైబర్ నేరాలకు పాల్పడుతున్నట్లు పోలీసులు గుర్తించారు. ముంబయికి చెందిన ఓ మహిళకు ఈ వ్యవహారంలో కీరోల్ ఉంది. అచ్యుతాపురం పరిసరాల్లో అపార్ట్‌మెంట్లను అద్దెకు తీసుకుని ఏడాదిన్నరగా రెండు కాల్‌సెంటర్లు నిర్వహిస్తున్నట్లు ఐడెంటిఫై చేశారు. ఈశాన్య రాష్ట్రాల వారిని తీసుకొచ్చి అమెరికన్లతో ఎలా మాట్లాడాలో ట్రైనింగ్ కూడా ఇస్తున్నారు. ఇక్కడ 200 నుంచి 250 మంది వరకు షిప్టుల వారీగా డ్యూటీలు చేస్తున్నారు. వీరికి కాల్ సెంటర్ డ్యూటీ ఆధారంగా 20 వేల నుంచి 75 వేల దాకా జీతాలు ఇస్తున్నారు.
అకౌంట్ ను వేరే వాళ్లు వాడుతున్నట్లు కలరింగ్
సైబర్ క్రైమ్ ఎలా స్టార్ట్ అవుతుందంటే.. ముందుగా వీరు అమెరికన్ పౌరులకు ఈ-కామర్స్ సంస్థ నుంచి మాట్లాడుతున్నట్లు ఫోన్ చేస్తారు. మీరు ఆర్డర్ పెట్టారు.. మీకు చేరిందా అని అడుగుతారు. తాము ఎలాంటి ఆర్డర్ పెట్టలేదని జవాబు వస్తుందని ముందే తెసులు కాబట్టి.. నెక్ట్స్ ఇక్కడే గేమ్ మొదలు పెడుతారు. మీ బ్యాంకు అకౌంట్ నుంచి క్యాష్ డ్రా అయిందని.. వేరేవారు ఎవరైనా అకౌంట్‌ను వాడుతున్నారేమో పరిశీలించవచ్చా అని తెలియనట్లు క్వశ్చన్ చేస్తారు. దీనికి గాబరా పడే వారు వెంటనే సరే అంటే రెండో దశలో బ్యాంకర్ పేరుతో మాట్లాడి వివరాలన్నీ తీసుకుంటారు. అనంతరం క్లోజర్‌తో మాట్లాడమని లైన్ కలుపుతారు. మీ బ్యాంకు అకౌంట్‌ను వేరేవారు వాడుతున్నారని, నగదు జాగ్రత్తగా ఉంచుకోండంటూ హెచ్చరిస్తున్నట్లు మాట్లాడి నగదుకు సెక్యూరిటీ పేరుతో కూపన్లు ఇస్తామని చెబుతారు.
Also Read: విజయవాడలో హై టెన్షన్.. ఆ రోడ్డు మొత్తం క్లోజ్
ఈ కేసులో 33 మందిని అరెస్ట్ చేసిన పోలీసులు
డబ్బులు చెల్లించకపోతే ఇబ్బందులు పడతారంటూ భయపెడుతారు. చివరికి ఆ కూపన్లు కొనిపించి క్యాష్ చేసుకుంటున్నారు. ఇలా రోజుకు 100 నుంచి 200 మంది అమెరికన్లతో మాట్లాడి వారిలో నమ్మిన వారి నుంచి క్యాష్ కొట్టేస్తున్నారు. ప్రస్తుతం ఈ కేసులో 33 మందిని అరెస్ట్ చేశారు. వీరిలో ముగ్గురు మహిళలు ఉన్నారు. ఇలా ఒక్కొక్కరి నుంచి వారు భయపడే తీరుపై ఆధారపడి 200 నుంచి 3 వేల డాలర్ల వరకు వసూలు చేస్తున్నారు. సైబర్ మోసాలతో ప్రతి నెలా 20 కోట్ల నుంచి 50 కోట్ల వరకు కొల్లగొడుతున్నారు. ఈ వ్యవహారం రెండేళ్ల నుంచి సాగుతోంది. ఫైనల్‌గా పరవాడ డీఎస్పీ విష్ణుస్వరూప్, అచ్యుతాపురం సీఐ గణేష్, ఐటీ కోర్ ఎస్సై సురేష్‌బాబు ఈ ముఠా ఆటకట్టించారు. అదీ మ్యాటర్. కాబట్టి బీ అలర్ట్.