Sunita Williams: ఎట్టకేలకు తొమ్మిది నెలలకుపైగా స్పేస్‌లో చిక్కుకుపోయిన వ్యోమగాములు సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్ లు భూమిపై అడుగుపెట్టారు. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం నుంచి ఉదయం పదిన్నర గంటలకు బయలుదేరింది క్రూ డ్రాగన్ వ్యోమనౌక. బుధవారం తెల్లవారుజామున దాదాపు మూడున్నర గంటల సమయంలో ఫ్లోరిడా తీరానికి చేరువలోని సముద్ర జలాల్లో దిగింది.
వ్యోమనౌక గంటకు స్పేస్ నుంచి 17 వేల మైళ్ల వేగంతో భూమివైపు ప్రయాణించింది. క్రమంగా వేగాన్ని తగ్గించుకుంటూ వచ్చింది క్యాప్సుల్. గంటకు వేగం 116 మైళ్లకు చేరుకున్నాక పారాచూట్లు ఓపెన్ అయ్యాయి. నాలుగు పారాచూట్ల సాయంతో వేగాన్ని మరింత తగ్గించుకుంది. క్యాప్సుల్ సురక్షితంగా సముద్ర జలాల్లో దిగింది.
అప్పటికే అక్కడున్న నాసా సిబ్బంది చిన్న చిన్న బోట్ల సాయంతో క్యాప్సుల్‌ను ఓ షిప్‌పైకి తీసుకొచ్చారు. ఆ తర్వాత క్యాప్సుల్స్‌ను ఒడ్డుకు చేర్చారు. కొద్దిసేపటి తర్వాత వ్యోమగాములను క్యాప్సుల్ నుంచి బయటకు తీశారు. అక్కడి నుంచి ప్రత్యేక వాహనంలో హ్యూస్టన్‌లోని జాన్సన్ స్పేస్ సెంటర్‌కు తరలించారు. అక్కడ వారికి వైద్య పరీక్షలు నిర్వహించారు. భూ గురుత్వాకర్షణ శక్తికి తిరిగి వ్యోమగాములు సర్దుబాటు అయ్యేలా నిపుణులు వారికి సహకారం అందించనున్నారు.
అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం నుంచి సురక్షితంగా భూమికి చేరుకున్న వ్యోమగాముల టీమ్‌కు అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా స్వాగతం పలికింది. యాత్రను సక్సెస్ చేసిన క్రూ-9 సిబ్బందికి అభినందనలు తెలిపింది. ఈ యాత్ర వెనుక కీలకపాత్ర పోషించిన స్పేస్ ఎక్స్‌ది అద్భుత పాత్రని చెప్పుకొచ్చింది.
ALSO READ: భూమిపై సునీతాకు నరకయాతనే
భారత సంతతికి చెందిన సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్ సహా మరో ఇద్దరు వ్యోమగామలు ఐఎస్‌ఎస్ నుంచి సుమారు 17 గంటలపాటు పయనించారు. అనంతరం నాసా ఉన్నతాధికారులు మీడియాతో మాట్లాడారు. స్పేస్ ఎక్స్ సంస్థ ప్రభుత్వ-ప్రైవేటు భాగస్వామ్యం శక్తిని చాటిందని నాసా అధికారులు తెలిపారు.
క్యాప్సూల్ భూమిని చేరే సమయంలో వాతావరణం అనుకూలంగా ఉండడంతో ల్యాండింగ్‌కు ఎలాంటి ఇబ్బంది ఎదురుకాలేదన్నారు. క్యాప్సుల్స్ ల్యాండింగ్ సమయంలో అమెరికా కోస్ట్‌గార్డ్ అన్ని చర్యలు చేపట్టింది. అన్‌డాకింగ్ నుంచి ల్యాండింగ్ వరకు అన్నీ అనుకున్నట్లుగా జరిగినట్టు తెలిపారు.
ప్రస్తుత పరిణామాలు రాబోయే రోజుల్లో మానవసహిత అంతరిక్షయాత్రకు కొత్తబాట వేసినట్టు చెప్పారు. ఒక వ్యోమనౌకలో అంతరిక్షంలోకి వెళ్లి వ్యోమగాములు.. మరో వ్యోమనౌకలో సురక్షితంగా తిరిగి వచ్చారని తెలిపారు. భవిష్యత్ అంతరిక్ష ప్రయోగాలు ఇదొక సరికొత్త ప్రారంభమన్నారు.
బయలు దేరి నుంచి దిగేవరకు
కేవలం వారం రోజుల యాత్ర కోసం గతేడాది జూన్ 5న ఐఎస్‌ఎస్‌కు వెళ్లారు వ్యోమగాములు సునీత, విల్మోర్. అంతరిక్ష కేంద్రంలో ఏకంగా 286 రోజులు గడపాల్సి పరిస్థితి ఏర్పడింది. అంతరిక్ష కేంద్రం నుంచి తిరిగి బయలుదేరే ముందు ఐఎస్‌ఎస్‌లోని వ్యోమగాములకు సునీత, విల్మోర్, నిక్ హేగ్, గోర్బునోవ్ వీడ్కోలు పలికారు. అందరూ కలిసి ఫొటోలు తీసుకున్నారు. సునీత బృందం తమ వస్తువులను ప్యాక్ చేసుకుంది.
అంతరిక్ష కేంద్రానికి అనుసంధానమై ఉన్న క్రూ డ్రాగన్ వ్యోమనౌకలోకి వచ్చారు. మంగళవారం ఉదయం 8.15 గంటలకు క్రూ డ్రాగన్ వ్యోమనౌక తలుపు మూసివేత ప్రక్రియ జరిగింది. అంతా ఒకే అయిన తర్వాత ఉదయం 10.15 గంటలకు క్రూ డ్రాగన్ ఐఎస్‌ఎస్‌తో విడిపోయే ప్రక్రియ మొదలైంది. పదిన్నర గంటలకు పూర్తిగా విడిపోయింది.
క్రూ డ్రాగన్ వ్యోమనౌక భూమి దిశగా 17 గంటల ప్రయాణాన్ని మొదలుపెట్టింది. భూమిపై ల్యాండింగ్ ప్రదేశం కోసం క్రూ డ్రాగన్ ముందుభాగంలో నాలుగు డ్రాకో ఇంజన్ల ప్రజ్వలన మొదలైంది. దాదాపు ఏడున్నర నిమిషాలపాటు ఈ ప్రక్రియ సాగింది. భూ వాతావరణంలోకి ప్రవేశం కోసం కోన్ భాగాన్ని మూసి వేసింది వ్యోమనౌక.
ఆ తర్వాత భూవాతావరణంలో తలెత్తే వేడి నుంచి వ్యోమగాములను సురక్షితంగా ఉంచే వ్యవస్థను ఆన్ అయ్యింది. భూ వాతావరణంలోకి వ్యోమ నౌక చాలా వేగంగా ప్రవేశించింది. అయితే ఆ రాపిడి కారణంగా దాదాపు 1650 డిగ్రీల సెంటిగ్రేడ్‌ల వేడి ఉత్పన్నమైన్నట్లు తెలుస్తోంది. వ్యోమ నౌక చుట్టూ ప్లాస్మా పేరుకుంది.
కొంతసేపటికి వ్యోమనౌకతో కమ్యూనికేషన్ తెగిపోయింది. ఆపై ఉత్కంఠ నెలకొంది. వ్యోమ నౌక చుట్టూ ఉష్ణ కవచం సమర్థంగా పనిచేయడంతో ఆ వేడిని తట్టుకుంది. కమ్యూనికేషన్ అందుబాటులోకి వచ్చిన తర్వాత కమాండర్ నిక్ హేగ్ మాట్లాడటంతో కమాండ్ సెంటర్‌లో శాస్త్రవేత్తల్లో ఆనందం కనిపించింది.
సముద్రంలో 18 వేల అడుగుల ఎత్తులో వ్యోమనౌకలోని డ్రోగ్ చూట్లు విచ్చుకున్నాయి. ఆ సమయంలో వ్యోమనౌక వేగం గంటకు 560 కిలోమీటర్లు వస్తోంది. డ్రోగ్ చూట్లు సమర్థంగా పని చేయడంతో క్రూ డ్రాగన్ వేగం గణనీయంగా తగ్గిపోయింది. వ్యోమనౌక వేగం గంటకు 190 కిలోమీటర్లకు చేరుకుంది.
సాగర జలాల నుంచి 6,500 అడుగుల ఎత్తులో పారా చూట్లు విచ్చుకున్నాయి. చివరకు ఫ్లోరిడాలోని తలహాసీ తీరంలో వ్యోమనౌక నెమ్మదిగా దిగింది. నిమిషాల వ్యవధిలో స్పీడ్ బోట్లలో సిబ్బంది అక్కడికి వెళ్లారు. పరిస్థితులు అనుకూలంగా ఉండడంతో వ్యోమనౌకను షిప్ పైకి తీసుకొచ్చారు.
Splashdown confirmed! #Crew9 is now back on Earth in their @SpaceX Dragon spacecraft. pic.twitter.com/G5tVyqFbAu
— NASA (@NASA) March 18, 2025