Syria Bashar Al Assad| సిరియా ప్రెసిడెంట్ బషర్ అల్ అసద్ రాజధాని డమాస్కస్ వదిలి ఒక ప్రైవేట్ విమానంలో పారిపోయారని అంతర్జాతీయ మీడియా తెలిపింది. గత నెల రోజుల్లో సిరియాలోని ఇస్లామిక్ రెబెల్స్ మిలిటెంట్లు క్రమంగా దేశంలోని కీలకమైన నగరాలు ఆక్రమించుకున్నారు. ఈ క్రమంలోనే శనివారం డిసెంబర్ 7, 2024న రాజధాని డమాస్కస్ నగరాన్ని కూడా అన్ని వైపుల నుంచి చుట్టుముట్టారు. దీంతో వారిని ఎదిరించలేక అధ్యక్షుడు అల్ అసద్ తన ప్రాణాలు కాపాడుకోవడానికి పలాయనం చిత్తగించారిని తెలుస్తోంది.
అంతర్జాతీయ మీడియా సంస్థ రాయిటర్స్ ప్రకారం.. ప్రెసిడెంట్ బషర్ అల్ అసద్ తన ప్రైవేట్ విమానంలో ఎవరికీ అధికారిక సమాచారం ఇవ్వకుండా వెళ్లిపోయారని ఇద్దరు సీనియర్ సైన్యాధికారులు తెలిపారు.
రాజధానిలో యుద్ధ వాతావరణం ఉందని.. డమాస్కస్ అంతర్జాతీయ ఎయిర్ పోర్ట్ వద్ద భయంతో భద్రతా బలగాలు, సైనికులు పారిపోయారని ఫ్రాన్స్ మీడియా ఎఎఫ్‌పి తెలిపింది.
సిరియా ప్రెసిడెంట్ బషర్ అల్ అసద్ చాలాకాలంగా లెబనాన్ లోని హిజ్బుల్లా మిలిటెంట్ల మద్దతు ఉంది. అయితే హిజ్బుల్లా ఫైటర్లు కూడా రెబెల్స్ దూకుడు చూసి సిరియా రాజధాని డమాస్కస్ లోని వారి స్థావరాలు వీడి వెళ్లిపోయారని సమాచారం.
సిరియాలోని ఇస్లామిస్ట్ హయత్ తహ్‌రీర్ అల్ షామ్ గ్రూప్ రాజధాని డమాస్కస్ లోకి తమ బలగాలు ప్రవేశిస్తున్నట్లు అధికారికంగా ప్రకటించింది. ముందుగా డమాస్కస్ లో రెబెల్స్ గ్రూప్ నకు చెందిన మిలిటెంట్లను ప్రెసిడెంట్ బషర్ సైన్యం బందీలుగా చేసి సెడ్నాయా జైలులో పెట్టింది. దీంతో రెబెల్స్ గ్రూప్ మిలిటెంట్లు ముందుగా ఆ ఖైదీలను విడిపించేందుకు జైలు గేట్లను పేల్చేశారని సమాచారం.
Also Read: సిరియాకు వెళ్లొద్దు ప్రమాదం.. భారతీయులకు కేంద్రం హెచ్చరిక!
ఇస్లామిస్ట్ రెబెల్స్ గ్రూప్ గత వారం రోజుల్లో సిరియాలోని కీలక నగరాలైన అలెప్పో, హోమ్స్ లను ప్రణాళికా బద్ధంగా ఆక్రమించుకుంది. రెబెల్స్ గ్రూప్‌నకు ఇజ్రాయెల్, అమెరికా నుంచి మద్దతు లభిస్తుండగా.. అధ్యక్షుడు బషల్ అల్ అసద్ సైన్యానికి రష్యా, ఇరాన్ నుంచి ఆయుధాలు లభించేది.
తాజాగా బషర్ సైన్యంలోని కీలక అధికారులు రెబెల్స్‌తో చేతులు కలపడంతో బషర్ అల్ అసద్ కు ఈ దుస్థితి ఏర్పడింది. ఆయన వారం రోజుల క్రితమే రష్యా అధ్యక్షుడు పుతిన్ కు ఫోన్ చేసి మరింత సైనిక సాయం కావాల్సిందిగా అడిగినట్లు సమాచారం. అయితే రష్యా నుంచి సైనిక సాయం అందే లోపే రెబెల్స్ రాజధాని డమాస్కస్ ను చుట్టుముట్టారు. దీంతో ఆయన దేశం వీడి పారిపోవాల్సి వచ్చింది.
సిరియాలో జరిగే పరిణామాలలో తమ ప్రమేయం లేదని అమెరికా తెలిపింది.