India Syria Travel Advisory| సిరియాలో ప్రభుత్వం, మిలిటెంట్ల మధ్య ఘర్షణ కారణంగా హింసాత్మక ఘటనలు జరుగుతున్నాయి. ఈ ఆందోళనకర పరిస్థితుల్లో భారతీయులు.. సిరియా దేశానికి ప్రయాణాలు మానుకోవాలని కేంద్ర ప్రభుత్వ హెచ్చరించింది. శుక్రవారం డిసెంబర్ 6, 2024 భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ భారతదేశ పౌరులెవరూ సిరియా దేశానికి వెళ్లవద్దని హెచ్చరిస్తూ ట్రావెల్ అడ్వైజరీ జారీ చేసింది.
“ప్రస్తుతం సిరియా దేశంలో ఆందోళనకర పరిస్థితులున్న దృష్ట్యా.. తదుపది సూచనలు చేసేవరకు భారతీయులెవరూ ఆ దేశానికి ప్రయాణాలు చేయవద్దు.” అని భారత విదేశాంగ శాఖ ప్రెస్ రిలీజ్ లో అధికారికంగా ప్రకటించింది. ఇంకా సిరియాలో నివాసముంటున్న భారతీయులు వెంటనే విమాన మార్గంలో స్వదేశానికి తిరిగి రావాలని.. రాలేని వారు ఇళ్ల నుంచి బయటికి రాకుండా.. సురక్షితంగా ఉండేందుకు అన్ని జాగ్రత్తలు పాటించాలని విదేశాంగ శాఖ సూచించింది.
సిరియాలో అధ్యక్షుడు బషర్ అల్ అసద్, ఇస్లామిక్ రెబెల్స్ గ్రూపు మిలిటెంట్ల మధ్య 9 ఏళ్లుగా జరుగుతున్న పోరాటంలో ఇటీవల మిలిటెంట్లు కీలక నగరాలను ఆక్రమించుకుంటున్నారు. ఈ క్రమంలో సైన్యం, మిలిటెంట్ల మధ్య కాల్పుల ఘటనలు జరుగుతున్నాయి. సిరియా దేశంలో అధికారిక సమాచారం ప్రకారం.. 90 మంది భారతీయులున్నారు. వీరిలో 14 మంది ఐక్యరాజ్యసమితి కోసం పనిచేస్తున్నవారు. ఈ నేపథ్యంలో భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ ట్విట్టర్ ఎక్స్ ఒక పోస్ట్ చేశారు.
Also Read: ఇండియాలో మోడీ ప్రభుత్వాన్ని కూల్చేందుకు అమెరికా కుట్ర.. బిజేపీ ఆరోపణలు
“సిరియాలో తాజాగా యుద్ధ పరిస్థితులు తీవ్రమయ్యాయి. అక్కడి పరిణామాలపై మేము నిరంతరం దృష్టి పెట్టాము. సిరియాలో దాదాపు 90 మంది భారతీయులున్నారు. ఈ 90 మందిలో 14 మంది ఐక్యరాజ్యసమితికి చెందిన వేర్వేరు సంస్థల్లో పనిచేస్తున్నారు. వీరందరినీ సంప్రదించడానికి మేము ప్రయత్నిస్తున్నాం. సిరియా భారతీయుల భద్రతే మా ప్రాధాన్యం. ” అని రణధీర్ జైస్వాల్ అన్నారు.
ఇజ్రాయెల్, అమెరికా మద్దతు ఉన్న ఇస్లామిక్ రెబెల్ మిలిటెంట్స్ సిరియాలో(syria) అంతర్యుద్ధ పరిస్థితులను విజయవంతంగా సృష్టించారు. 2020 సంవత్సరం నుంచి అధ్యక్షుడ బషర్ అల్ అసద్ సైన్యం.. రెబెల్స్ ని విజయవంతంగా కట్టడి చేసింది. సిరియాలో ఇద్లిబ్ రాష్ట్రానికే వారిని పరిమితం చేసింది. కానీ ఇటీవల కీలక వ్యాపార కేంద్రమైన అలెప్పో, హమా నగరాలు ఆక్రమించుకుంది. తాజాగా అందిన సమాచారం ప్రకారం దారా రాష్ట్రంపై రెబెల్స్ ఆక్రమించుకున్నారు.
లెబనాన్ లో హిజ్బుల్లాతో దాదాపు సంధి చేసుకున్న ఇజ్రాయెల్ తన తదుపరి టార్గెట్ అయిన సిరియాలో రెబెల్స్ కు మద్దతు ఇస్తోందని సమాచారం. ఇస్లామిక్ రెబెల్స్ కు అమెరికా, ఇజ్రాయెల్ అండదండలుంటే .. బషర్ అల్ అసద్ ప్రభుత్వానికి ఇరాన్, రష్యా నుంచి ఆయుధ సాయం అందుతోంది. దీంతో సిరియాలో ప్రజలు భయం గుప్పిట్లో బతుకుతున్నారు. రెబెల్స్ మెయిన్ టార్గెట్ రాజధాని డమాస్కస్ కావడంతో రాజధాని చుట్టుపక్కల నగరాలలో నివసించే ప్రజలు ఇతర నగరాలకు గ్రామాలకు వెళ్లిపోతున్నారని అంతర్జాతీయ మీడియా కథనాలు ప్రచురించింది.
2011లో ప్రారంభమైన ఈ అంతర్యుద్ధంలో ఇప్పటివరకు 3 లక్షల మంది పౌరులు చనిపోయారని ఐక్యరాజ్య సమితి గణాంకాల ద్వారా తెలుస్తోంది.