శివుడికోసం యుద్ధం, అవును నిజంగా ఇది శివుడికోసం జరుగుతున్న యుద్ధమే. ఆ శివాలయం ఉన్న భూమి తమదంటే తమదంటూ థాయిలాండ్, కాంబోడియా గొడవకు దిగాయి. తాజాగా మరోసారి సరిహద్దుల్లో బాంబుల మోత మోగింది. రెండు దేశాలు తగ్గేది లేదంటున్నాయి. సైనికులు చనిపోయినా అధికారికంగా ప్రకటనలు ఇంకా వెలువడలేదు. ఈ ఘర్షణ ఆగేదెప్పుడు? ఎవరు శాంతిస్తారు? ఎవరు సర్దుకు పోతారనేది తేలాల్సి ఉంది.
ఖేమర్ పాలకులు నిర్మించిన ఆలయాలు..
13వ శతాబ్దం వరకు థాయిలాండ్ ని ఖేమర్ సామ్రాజ్యం పరిపాలించింది. ప్రీహ్ విహార్ అనే ప్రాంతంలో 11వ శతాబ్దంలో ఖేమర్ పాలకులు పలు హిందూ దేవాలయాలు నిర్మించారు. శివాలయం ఇందులో ప్రత్యేకం. ఇక్కడి శివలింగానికి నిత్యం ఖేమర్ పాలకులు పూజలు నిర్వహించేవారని చెబుతారు. బౌద్ధం, శైవం రెండూ ఈ ప్రాంతంలో విరాజిల్లడం విశేషం. ప్రీహ్ విహార్ తోపాటు, ట మోన్ థోమ్, ట మ్యూన్ థోమ్ ఆలయ సమూహాలు ఇక్కడి పర్వత ప్రాంతాల్లో ఉన్నాయి. అరణ్యాలతో కూడిన ఈ పర్వత ప్రాంతం కోసం కాంబోడియా, థాయిలాండ్ మధ్య గొడవలు జరుగుతున్నాయి. ప్రసాత్ టా ముయెన్ థామ్ ఆలయానికి సమీపంలో తాజాగా ఘర్షణలు చోటు చేసుకున్నాయి. ఇక్కడ కాంబోడియాకు చెందిన డ్రోన్లు ఎగరడంతో థాయిలాండ్ నుంచి ప్రతిఘటన మొదలైంది. రెండు దేశాలు వైమానిక దాడులకు తెగబడ్డాయి. ఈ ఉద్రిక్తతల నేపథ్యంలో రెండు దేశాలు ఒకరి రాయబారుల్ని మరొకరు బహిష్కరించారు.
శివలింగం, సంస్కృత శాసనాలు..
ప్రసాత్ టా ముయెన్ థామ్ ఆలయంలో శివలింగంతోపాటు కొన్ని సంస్కృత శాసనాలు కూడా ఉన్నాయి. ప్రాచీన భారతీయ సంస్కృతి, కళారూపాల పరిధి ఇక్కడి వరకూ విస్తరించిందని చెప్పడానికి ఇవే తార్కాణాలు. 11వ శతాబ్దంలో ఖేమర్ వంశ రాజు ఉదయాదిత్య వర్మన్ II ఆధ్వర్యంలో ఈ ఆలయం నిర్మించబడింది. డాంగ్రెక్ పర్వతాలలోని ఒక కనుమపై ఈ ఆలయం ఉంది. థాయిలాండ్, కాంబోడియాని కలిపే ప్రాంతం ఇది. ఈ ప్రాంతంపై ఇరు దేశాలు తమకే హక్కు ఉందని చెబుతుంటాయి. ఈ ఆలయ ప్రవేశ ద్వారం, దాని ముందు ఉన్న మెట్లు కాంబోడియా ప్రాంతంవైపు ఉంటాయి. అందుకే ఆ దేశం ఇది తమదేనంటోంది. కానీ థాయిలాండ్ మాత్రం ఖేమర్ రాజులు పరిపాలించిన ప్రాంతం తమవైపు ఎక్కువగా ఉందని, అందుకే ఈ ఆలయలాలన్నీ తమవేనంటుంది.
ఆరని మంట
ఈ ప్రాంతంల కాంబోడియాకు చెందినదేనని 1962లో అంతర్జాతీయ న్యాయస్థానం తీర్పునిచ్చింది. ఈ తీర్పుకి కట్టుబడి ఉంటామని థాయ్ లాండ్ అంగీకరించినా.. తరచూ స్థానికుల మధ్య మాత్రం గొడవలు జరుగుతుంటాయి. యునెస్కో ఈ ఆలయాల సముదాయాన్ని ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తించిన తర్వాత మళ్లీ గొడవలు మొదలయ్యాయి. ఆ తర్వాత వరుసగా ఘర్షణలు జరుగుతూనే ఉన్నాయి. 2011లో 10మందికి పైగా ఈ ఘర్షణల్లో చనిపోయారు. సరిహద్దు గ్రామాలకు చెందిన వేలాదిమంది ప్రజలు నిరాశ్రయులయ్యారు.
శైవం, బౌద్ధం..
వాస్తవానికి ఖేమర్ సామ్రాజ్యం ఈ శివాలయాలను నిర్మించిన తర్వాత ఆ వంశంలోని చివరి రాజులు బౌద్ధాన్ని స్వీకరించారు. దీంతో అక్కడ బౌద్ధానికి చెందిన ఆనవాళ్లు కూడా కనపడతాయి. బౌద్ధుల ఆరామాలు, విశ్రాంతి మందిరాలు అక్కడ ఉన్నాయి. ఉదయాదిత్య వర్మన్ II శివాలయం నిర్మించగా, జయవర్మన్ VII బౌద్ధ ఆరామాలను నిర్మించారు. ఇక్కడి శిల్పాలు, నిర్మాణ రీతి భారతీయ సాంప్రదాయాలను గుర్తు చేస్తాయి.
సరిహద్దుల్లో బాంబుల మోత
ఐరోపా పాలకులు వెళ్తూ వెళ్తూ థాయిలాండ్, కాంబోడియా మధ్య సరిహద్దు వివాదాన్ని సరిచేయకుండానే వెళ్లారు. ఇరు దేశాల మధ్య 508 మైళ్ల సరిహద్దు ఉంది. ఈ సరిహద్దు ప్రాంతంలో ఆలయాలు ఉన్న ప్రదేశం మాత్రమే వివాదానికి కేంద్ర బిందువుగా మారింది. ప్రస్తుతం ఈ ఆలయాలు శిథిలావస్థకు చేరుకున్నాయి. కానీ ఇరు దేశాల సరిహద్దు పోరు మాత్రం కొనసాగుతూనే ఉంది.