Trump Melania Dance| అమెరికా అధ్యక్ష ఎన్నికలు మరో వారం రోజుల్లో జరగబోతున్నాయి. ప్రపంచ దేశాల చూపులన్నీ ఈ ఎన్నికల పైనే ఉన్నాయి. ఈ ఎన్నికల్లో ఢీ అంటే ఢీ అంటూ రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్, డెమోక్రాట్స్ అభ్యర్థి కమలా హ్యారిస్ మధ్యో హోరాహోరీ పోరు నెలకొంది. దీంతో ఇద్దరూ ప్రచారంలో వేడిని పెంచారు. కీలక నియోజకవర్గాల్లో ఓటర్లను ఆకర్షించేందుకు సెలబ్రిటీల చేత ప్రచారం చేయిస్తున్నారు. ముఖ్యంగా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అమెరికా ప్రధాన నగరమైన న్యూ యార్క్ లో ఒక భారీ ఎన్నికల ర్యాలీని నిర్వహించారు. ఈ ర్యాలీ నగరంలోని ప్రముఖ మాడిసన్ స్క్వేర్ గార్డెన్ లో అట్టహాసంగా ముగిసింది. ఈ ర్యాలీలో మాజీ అధ్యక్షుడు ట్రంప్ తన భార్య మెలనియాతో కలిసి డాన్స్ చేయడం అందరినీ అకట్టుకుంది.
ట్రంప్ ర్యాలీ భారీ సంఖ్యలో జనం వచ్చారు. ఈ ర్యాలీ జనసమూహాన్ని కాసేపు ట్రంప్ దంపతులు ఎంటర్‌టైన్ చేశారు. స్టేజిపై ట్రంప్ తన భార్యను ఆహ్వానించి.. ఆమెను కౌగిలించుకున్నాడు, కిస్ చేశాడు. ఆ తరువాత ఇద్దరు వైఎంసిఏ మ్యూజిక్ కు డాన్స్ చేశారు. దీంతో జనసమూహం వారిని చీర్స్ చేసింది. ఆ తరువాత ట్రంప్ భార్య మెలనియా మాట్లాడుతూ.. తన భర్త ట్రంప్‌ను ‘అమెరికా మ్యాజిక్’ గా వర్ణించింది.
Also Read: మెక్ డొనాల్డ్స్ లో వంట చేసిన ట్రంప్!.. ఎన్నికల ప్రచారంలో కీలక ఓటర్లే టార్గెట్
ఈ భారీ ఎన్నికల ప్రచార కార్యక్రమానికి ఎలన్ మస్క్, తుల్సి గబ్బార్డ్, రెజ్లర్ హల్క్ హోగన్, టక్కర్ కార్ల్ సన్, ఆర్ఎఫ్‌కె జూనియర్ లాంటి సెలబ్రిటీలు ముఖ్య అతిథులుగా వచ్చారు. వారిని చూడడానికి జనాలు వేల సంఖ్యలో వచ్చారు. ఈ ప్రచార కార్యక్రమంలో ట్రంప్ మాట్లాడుతూ.. కార్యక్రమాన్ని గ్రాండ్ లెవెల్ లో నిర్వహించిన నగర మేయర్ ఆడమ్స్ ను ప్రశంసించారు. అతని కుమారుడు బారాన్ ని కింగ్ ఆఫ్ ఇంటర్నెట్ గా అభివర్ణించారు. ఎన్నికల్లో న్యూ యార్క్ నగరాన్ని తప్పకుండా విజయం సాధిస్తానని ట్రంప్ ధీమా వ్యక్తం చేశారు. న్యూయార్క్ నగరం అమెరికా బలానికి, ఆత్మ విశ్వాసానికి ప్రతీక అని పొగిడారు.
ఎన్నికల ప్రచార ప్రసంగంలో ట్రంప్ తనపై ఉన్న కేసులు, విచారణ గురించి హాస్యం చేశారు. తనను పెద్ద పెద్ద క్రిమినల్స్ కంటే దారుణంగా విచారణ చేస్తున్నారని చెప్పారు. తాను ఎన్నికల్లో గెలిచిన వెంటనే న్యూయార్క్ నగరం నుంచి క్రిమినల్స్ ను తొలగించాలనే ఆదేశాలు జారీచేస్తానని హామీ ఇచ్చారు. నగరంలోని మౌలిక సదుపాయాలు మెరుగుపరిచేందుకు కృషి చేస్తానన్నారు. తన ప్రత్యర్థి కమలా హ్యారిస్ ని విమర్శిస్తూ.. ఆమెను ఎన్నుకోవడం చాలా పెద్ద తప్పిదమన్నారు. కమలా హ్యారిస్ అమెరికా ప్రెసిడెంట్ అయితే చాలా ప్రమాదమని చెప్పారు.
మరోవైపు ఎప్పుడూ కార్యక్రమాల్లో మాట్లాడని ట్రంప్ భార్య మెలనియా ఈ కారక్రమంలో ధాటిగా మాట్లాడడం విశేషం. తన భర్తను సమర్థిస్తూనే ఆమె న్యూ యార్క్ నగరంలో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొనే ప్రజల సంఖ్య ఎక్కువగా ఉందని.. నగరంలో జీవన ప్రమాణాల స్థాయి పడిపోయిందని బైడెన్ ప్రభుత్వం పరిపాలనపై విమర్శలు చేశారు. అయితే కార్యక్రమంలో అపశృతి కూడా జరిగింది. స్టేజిపై మాట్లాడడానికి వచ్చిన కమెడియన్ టోని హించ్‌క్లిఫ్.. తన ప్రసంగంలో జోక్ చేస్తూ.. అమెరికా లాటినోలు నిండిపోతున్నారని.. వారిని అదుపు చేయాలని చెప్పారు. పైగా సముద్రంలో చెత్త పేరుకుపోతున్నట్లుగా అమెరికాలో ప్యూర్టో రీకో వాసులు వచ్చి చేరుతున్నారని చెప్పారు. దీంతో కార్యక్రమం మధ్యలో నుంచి కొంత మంది వెళ్లిపోయారు.