E-Paper

అమెరికా-ఇరాన్ శాంతి ఒప్పందం.. ట్రంప్ సంచలన ప్రకటన!

అమెరికా-ఇరాన్ శాంతి ఒప్పందం.. ట్రంప్ సంచలన ప్రకటన!
Advertisement

గడిచిన కొన్ని నెలలుగా ప్రపంచాన్ని ఆందోళనకు గురి చేసిన పశ్చిమాసియా ఉద్రిక్తతలకు ఎట్టకేలకు ముగింపు పలికే పరిణామం చోటుచేసుకుంది. ఇరాన్ తో శాంతి ఒప్పందం కుదిరిందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. తన సోషల్ మీడియా ట్రూత్ వేదికగా ఈ విషయాన్ని వెల్లడించిన ట్రంప్, హోర్ముజ్ జలసంధిని ఎలాంటి ఆంక్షలు లేకుండా తిరిగి తెరవనున్నట్లు తెలిపారు. ఇరాన్ ఓడరేవులపై అమలులో ఉన్న దిగ్బంధనాన్ని ఎత్తివేయాలని నేవీని ఆదేశించినట్లు వెల్లడించారు. అంతేకాదు, అమెరికా నేవీ విధించిన ఆంక్షలను కూడా తొలగిస్తున్నట్లు వెల్లడించారు. ప్రపంచ వాణిజ్యానికి  కీలకమైన హోర్ముజ్ జలసంధి తిరిగి ఎలాంటి ఆంక్షలు లేకుండా తెరుచుకుంటుందన్నారు. చమురు రవాణా సాధారణ స్థితికి చేరుకునే అవకాశం ఉందన్నారు.

జూన్ 19న స్విట్జర్లాండ్‌ లో ఒప్పందంపై సంతకాలు

Advertisement

ఈ ఒప్పందంపై ఇరాన్ కూడా సానుకూలంగా స్పందించింది. అమెరికాతో అవగాహన ఒప్పందం కుదిరిందని, యుద్ధ పరిస్థితులను ముగించేందుకు రెండు దేశాలు అంగీకరించాయని ఇరాన్ డిప్యూటీ విదేశాంగ మంత్రి ఘరీబా బాదీ తెలిపారు. జూన్ 19న స్విట్జర్లాండ్‌ లో అధికారికంగా ఒప్పందంపై సంతకాలు జరగనున్నాయని వెల్లడించారు. దాదాపు రెండు నెలల పాటు సాగిన చర్చల ఫలితంగానే ఈ అవగాహన కుదిరిందన్నారు.

అమెరికాను పూర్తిగా నమ్మినట్లు కాదు!

ఒప్పందం కుదిరిందని చెప్పినంత మాత్రాన అమెరికాను పూర్తిగా నమ్మినట్లు కాదని ఇరాన్ స్పష్టం చేసింది. అమెరికా తన హామీలను ఎంతవరకు అమలు చేస్తుందో పరిశీలిస్తామని పేర్కొంది. ఈ ఒప్పందం నేపథ్యంలో లెబనాన్‌తో పాటు ఇతర ప్రాంతాల్లో కొనసాగుతున్న సైనిక చర్యలు కూడా నిలిచిపోనున్నాయి.

స్వాగతించిన ప్రపంచ దేశాలు

Advertisement

అమెరికా-ఇరాన్ శాంతి ఒప్పందాన్ని ప్రపంచ దేశాలు స్వాగతించాయి. ప్రాంతీయ స్థిరత్వాన్ని పునరుద్ధరించేందుకు, అంతర్జాతీయ వాణిజ్యానికి ఊరటనివ్వేందుకు ఇది కీలక అడుగుగా అభివర్ణించాయి. ముఖ్యంగా హోర్ముజ్ జలసంధి తిరిగి తెరుచుకోవడం ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు శుభపరిణామమని పలువురు నేతలు అభిప్రాయపడ్డారు.

ఈ చర్చల్లో మధ్యవర్తిగా వ్యవహరించిన పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్, ఇరుపక్షాలు సైనిక చర్యలను శాశ్వతంగా నిలిపివేయడానికి అంగీకరించాయని తెలిపారు. జూన్ 19న స్విట్జర్లాండ్‌లో అధికారిక సంతకాలు జరుగుతాయని వెల్లడించారు. ఈ ప్రక్రియలో సహకరించిన ఖతార్, సౌదీ అరేబియా, టర్కీ దేశాలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.

ఖతార్ ప్రధాన మంత్రి షేక్ మహ్మద్ బిన్ అబ్దుల్రహమాన్ అల్ థానీ ఈ ఒప్పందాన్ని స్వాగతించారు. భవిష్యత్తులో చర్చలు మరింత సానుకూల వాతావరణంలో కొనసాగుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. టర్కీ అధ్యక్షుడు తయ్యిప్ ఎర్డోగాన్ దీనిని చారిత్రాత్మక విజయంగా అభివర్ణించారు. యుద్ధ పరిస్థితులను ముగించడంలో ఈ ఒప్పందం కీలక మైలురాయిగా నిలుస్తుందని బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్ అన్నారు. జర్మనీ ఛాన్సలర్ ఫ్రెడరిక్ మెర్జ్ ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు ఈ ఒప్పందం ఊరటనిస్తుందన్నారు. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ హోర్ముజ్ జలసంధిని పూర్తిగా తెరవాలని కోరడంతో పాటు, ఇరాన్ అణు కార్యక్రమాలపై మరిన్ని చర్చలు జరగాలని అభిప్రాయపడ్డారు.

Read Also: సిబ్బంది నిర్లక్ష్యానికి నిండు ప్రాణం బలి.. 130 అడుగుల ఎత్తు నుంచి యువతిని తోసేసి..

Related News

సుందర్ పిచాయ్‌ కి షాక్.. ప్రసంగం మధ్యలో విద్యార్థుల వాకౌట్!

సిబ్బంది నిర్లక్ష్యానికి నిండు ప్రాణం బలి.. 130 అడుగుల ఎత్తు నుంచి యువతిని తోసేసి..

ఎట్టకేలకు యుద్ధం ముగిసింది.. ఇరాన్-అమెరికా మధ్య డీల్, ట్రంప్ కీలక ప్రకటన, జలసంధి ఓపెన్

కస్టమర్ల ప్రాణాలతో చెలగాటం.. ప్రముఖ కాఫీ షాప్‌నకు భారీ షాక్.. రూ.4 లక్షల ఫైన్!

Indian Sailors: ఒమన్‌ తీరంలో నౌకపై అమెరికా దాడి.. ముగ్గురు భారతీయులు మృతి!

అమెరికాలో భారీ బ్యాంకు మోసం.. ఆపై రూ. 950 కోట్లు, భారత సంతతి వ్యాపారి అరెస్- డ్రగ్స్ ఆపై అమ్మాయిల ఎర

హ‌ర్మూజ్ జలసంధిలో అమెరికా సీక్రెట్ ఆపరేషన్..గుట్టు బయటపెట్టిన ట్రంప్, ఇదీ అసలు మేటర్

×