Trump Musk Stargate | స్టార్‌గేట్ (StarGate) ఏఐ ప్రాజెక్టుపై ఎలాన్ మస్క్ చేసిన విమర్శలను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తోసిపుచ్చారు. ‘‘ఈ ప్రాజెక్టులో ఉన్నవారంతా ఎంతో ప్రతిభావంతులు. వీరిలో ఒకరితో మస్క్‌కు విభేధాలు ఉండవచ్చు. అలాంటి ద్వేషాలు నాకూ ఉన్నాయి’’ అని ట్రంప్ తెలిపారు.
ఓపెన్‌ఏఐ (OpenAI), సాఫ్ట్ బ్యాంక్, ఒరాకిల్ సంయుక్త భాగస్వామ్యంతో ‘స్టార్‌గేట్’ అనే భారీ ఏఐ ప్రాజెక్టు ప్రారంభమైంది. ఈ ప్రాజెక్టులో 500 బిలియన్ డాలర్ల పెట్టుబడులు పెట్టనున్నట్లు ట్రంప్ ఇటీవల ప్రకటించారు. ఈ ప్రాజెక్టు కింద టెక్సాస్‌లో అతిపెద్ద డేటా సెంటర్లు నిర్మించడానికి ఇప్పటికే 10 సెంటర్లు తయారయ్యాయి. త్వరలోనే వీటి సంఖ్య 20కి పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అమెరికాలో కృత్రిమ మేధ (ఏఐ)ను విస్తరింపజేయడం, లక్ష ఉద్యోగాలను సృష్టించడం, ముఖ్యంగా చైనాకు పోటీగా నిలవడమే ఈ ప్రాజెక్టు ప్రధాన లక్ష్యంగా ఉంది.
మస్క్ ఈ ప్రాజెక్టును విమర్శిస్తూ ఎక్స్ (మాజీ ట్విట్టర్) వేదికగా, ‘‘వారిదగ్గర అంత డబ్బు లేదు. ఆ ప్రాజెక్టు విజయవంతం అయ్యే అవకాశం కన్పించడం లేదు’’ అని వ్యాఖ్యానించారు. దీనిపై ఓపెన్‌ఏఐ సీఈఓ సామ్ ఆల్ట్‌మన్ స్పందిస్తూ, ‘‘మస్క్ చెప్పిందంతా అవాస్తవం. కావాలంటే ఆయన టెక్సాస్ వచ్చి నిర్మాణంలో ఉన్న తొలి సైట్‌ను చూసి వెళ్లాలి’’ అని చెప్పారు.
అమెరికా ప్రభుత్వంలో డిపార్ట్‌మెంట్ ఆప్ గవర్నమెంట్ ఎఫిషియన్సీకి నేతృత్వం వహిస్తున్న ఎలాన్ మస్క్.. అధ్యక్షుడు ట్రంప్ ఆధ్వర్యంలో ప్రారంభమైన ప్రాజెక్ట్ పై విమర్శలు చేయడంతో వివాదం మొదలైంది. ఈ క్రమంలో మస్క్ వ్యాఖ్యల గురించి విలేకరులు ట్రంప్‌ను ప్రశ్నించగా, ఆయన ‘‘ఈ వ్యాఖ్యల వల్ల నాపై ఎలాంటి ప్రభావం లేదు. ఈ ప్రాజెక్టు జాతీయ ప్రాధాన్యత కలిగి ఉంది’’ అని సమాధానం ఇచ్చారు.
స్టార్‌గేట్ ప్రాజెక్టు—వివాదాల నేపథ్యం
స్టార్‌గేట్ ఏఐ ప్రాజెక్టు 100 బిలియన్ డాలర్ల ప్రారంభ పెట్టుబడితో మొదలైంది. క్రమంగా మరో నాలుగు నుంచి అయిదు సంవత్సరాలలో 500 బిలియన్ డాలర్ల పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా పనిచేస్తోంది. టెస్లా అధినేత ఎలాన్ మస్క్ ఈ ప్రాజెక్టు ఆర్థిక స్థిరత్వాన్ని ప్రశ్నించడంతో, ఈ వివాదం పెద్దదైంది.
మస్క్, సామ్ ఆల్ట్‌మన్ మధ్య వివాదం
ఓపెన్‌ఏఐ స్థాపనలో భాగస్వామిగా ఉన్న ఎలాన్ మస్క్ 2018లో ఆ సంస్థను వీడారు. ఆ సమయంలో పరస్పర విరుద్ధ ప్రయోజనాలు ఉన్నాయని చెప్పారు. మానవాళి ప్రయోజనాల కోసం ఏఐ టెక్నాలజీని అభివృద్ధి చేయాలనే ప్రాథమిక లక్ష్యానికి విరుద్ధంగా శామ్ ఆల్ట్ మెన్ బృందం లాభాలకే ప్రాధాన్యం ఇస్తోందంటూ ఓపెన్ ఏఐపై మస్క్ కోర్టులో కేసు కూడా వేశారు. కానీ కథకు రెండోవైపు ఆల్ట్‌మన్ ప్రకారం.. మస్క్ ఓపెన్‌ఏఐ సంస్థను స్వాధీనం చేసుకోవాలని ప్రయత్నించి, విఫలమైనప్పుడు బయటకు వెళ్లిపోయారు.
ఇదీగాక.. భారత సంతతికి చెందిన యంగ్ టెకీ సుచిర్ బాలాజీ ఓపెన్ ఏఐ సంస్థపై తీవ్ర ఆరోపణలు చేసిన కొద్ద రోజులకే అనుమాస్పదంగా చనిపోవడంతో.. ఈ అంశంపై కూడా ఎలాన్ మస్క్ వ్యాఖ్యలు చేశారు.
సుచిర్ కొన్నేళ్లపాటు ఓపెన్‌ఏఐలో పనిచేసి.. ఆ సంస్థ కాపీరైట్ చట్టాలను ఉల్లంఘిస్తోందని తన వద్ద ఆధారాలున్నాయని సుచిర్ చెప్పాడు. ఆ తరువాత కొన్ని రోజులకే అనుమానాస్పద రీతిలో చనిపోయాడు. ఆ తరువాత సుచిర్ తల్లిదండ్రులు తమ కొడుకు ఆత్మహత్య కాదని విచారణ మళ్లీ ప్రారంభించాలని న్యాయపోరాటం చేస్తుండగా.. ఎలాన్ మస్క్ వారికి మద్దతు తెలుపుతూ.. తనకూ సుచిర్ మరణం పట్ల అనుమాస్పందంగా ఉందని ట్వీట్ చేశారు.
సత్య నాదెళ్ల వ్యాఖ్యలు
సీఎన్‌బీసీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్లను ఈ ప్రాజెక్టు గురించి ప్రశ్నించగా, ‘‘వారు ఏం ఇన్వెస్ట్ చేస్తున్నారో నాకు తెలియదు. మా (మైక్రోసాఫ్ట్) వద్ద 80 బిలియన్ డాలర్లు ఉన్నాయి’’ అని చెప్పారు. నాదెళ్ల వ్యాఖ్యలపై మస్క్ స్పందిస్తూ, ‘‘సత్య దగ్గర కచ్చితంగా డబ్బుంది’’ అని పేర్కొన్నారు.