El Salvador Prison Trump |ఎల్ సాల్వడార్ సెంట్రల్ అమెరికాలోని ఒక దేశం. ఆ దేశంలోని టెకోలూకా ప్రాంతంలో ఒక భయంకరమైన మహా కారాగారం… ప్రపంచంలోనే అత్యంత కఠినమైన జైలుగా ఇది ‘అప్రసిద్ధి’ చెందింది. ఇక్కడి నుంచి ఖైదీలు తప్పించుకోవడం అసాధ్యం. 60 సంవత్సరాల నుంచి వేల సంవత్సరాల కారాగార శిక్షలు అనుభవిస్తున్న ఖైదీలు ఇక్కడ ఉంటారు. వెయ్యి మంది అధికారులు, 600 మంది సైనికులు, 250 మంది పోలీసులు ఈ జైలును ఎల్లప్పుడూ పర్యవేక్షిస్తునే ఉంటారు. ఇంతకీ ఈ జైలు గురించి ఎందుకు ప్రస్తావన వచ్చిందంటే.. అమెరికాలోని క్రిమినల్స్ ని ఆ దేశ కొత్త అధ్యక్షుడు ట్రంప్ ఎల్ సాల్వడార్ కారాగారానికి తరలించే యోజనలో ఉన్నారు.
అక్కడైతే ఖైదీలకు తక్కువ ఖర్చుతో పని అయిపోతుందని ఆయన ప్లాన్. కానీ అందుకు అమెరికాలో చట్టాలు అడ్డంగా ఉన్నాయి. పైగా ఎల్ సాల్వడార్ జైలు అధ్వానంగా ఉంటుందని మానవ హక్కుల ఉల్లంఘనలు ఇక్కడ ఎక్కువ అని చాలా బ్యాడ్ టాక్.
ప్రముఖ క్రిమినల్ గ్యాంగ్‌లు… ప్రత్యేకించి MS-13, బారియో-18 సభ్యులను ఇక్కడే బంధిస్తారు. ప్రభుత్వ గణాంకాల ప్రకారం, 2024 ఆగస్టు నాటికి ఇక్కడి ఖైదీల సంఖ్య 14,500. ఈ జైలు విషయంలో ప్రశంసలు తక్కువ, విమర్శలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. నేరగాళ్ల పట్ల కఠినంగా వ్యవహరించాలని భావించేవారు ఈ జైలును సమర్థిస్తున్నారు. కానీ మానవ హక్కుల సంస్థలు ఇక్కడి పరిస్థితులను తీవ్రంగా విమర్శిస్తున్నాయి. ఎల్ సాల్వడార్ ప్రభుత్వం చెప్పిన దానికంటే ఇక్కడ ఎక్కువ మంది ఖైదీలు ఉన్నారని అనధికారిక లెక్కలు సూచిస్తున్నాయి.
Also Read: బైడెెన్‌కు ఆ సౌకర్యం అవసరం లేదు – మాజీలకిచ్చే మర్యాదను తొలగించిన ట్రంప్
ఈ కారాగారం అత్యంత ఇరుకైనది. ఒక్కో ఖైదీకి లభించే స్థలం కేవలం 6.45 చదరపు అడుగులు. ఇది అంతర్జాతీయ ప్రమాణాలకు విరుద్ధం. ఇక్కడి పరిస్థితులు చాలా కఠినమైనవి, ప్రమాదకరమైనవి. దేశ జనాభా ప్రకారం, ప్రతి లక్ష మంది పౌరుల్లో 1,659 మంది ఖైదీలు ఉన్న ఎల్ సాల్వడార్… ప్రపంచంలోనే అత్యధిక తలసరి ఖైదీలున్న దేశం.
స్టీలుతో తయారు చేసిన బోనుల్లాంటి నాలుగు అరల పడకల్లో (మెటల్ బంక్ బెడ్స్) ఖైదీలు రోజంతా మోకాళ్లపై వంగి కూర్చోవాలి లేదా చతికిలబడి ఉండాలి. పరుపులు ఉండవు. వారు గుసగుసలాడుకోవచ్చు, కానీ పెద్దగా మాట్లాడుకునే అవకాశం లేదు. భోజనంగా మూడు పూటలా వరి అన్నం, బీన్స్, పాస్టా, ఉడికించిన గుడ్డు ఇస్తారు. మాంసం ఇవ్వరు.
ఎల్ సాల్వడార్లో 1990ల చివరలో MS-13, బారియో 18 అనే రెండు గ్యాంగ్‌లు మాదకద్రవ్యాల వ్యాప్తి, బలవంతపు వసూళ్లతో దేశాన్ని వణికించాయి. ఈ రెండు గ్యాంగ్‌లు పరస్పరం ప్రత్యర్థులుగా ఉండేవి. కానీ ప్రస్తుతం జైల్లో ఈ రెండు గ్రూపుల సభ్యులను కలిపే ఉంచుతున్నారు. గ్వాంటనామో బే కారాగారం కంటే ఇక్కడి పరిస్థితులు మరింత దారుణంగా ఉన్నాయి.
శిక్షాకాలం ముగిసినా ఖైదీలను సమాజంలోకి విడిచిపెట్టరు. వారు బయటి ప్రపంచాన్ని చూడలేరు. ఒకరకంగా చెప్పాలంటే, వారు జీవచ్ఛవాలుగా ఉన్నారు! తమ దేశంలో హింసకు పాల్పడే ఖైదీలను ఎల్ సాల్వడార్ జైలుకు తరలించాలన్న ట్రంప్ ప్రతిపాదనను అనైతికమని, న్యాయసమ్మతం కాదని ఆయన రాజకీయ విరోధులు విమర్శిస్తున్నారు.
‘ప్రపంచంలోనే అత్యంత ప్రశాంత నియంత’ (World’s Coolest Dictator)గా తనను తాను అభివర్ణించుకునే ఎల్ సాల్వడార్ అధ్యక్షుడు నాయిబ్ బుకేలే (Nayib Bukele), తమ జైలు సేవలకు ప్రతిగా అమెరికా అందించే ‘ఆఫర్’ కోసం ఆశగా ఎదురు చూస్తున్నారు. ఇంతకీ అమెరికా ఆఫర్ ఏమిటి? ఏ రూపంలో? ఎంత? వివరాలు బయటికి రాలేదు!
అయితే దోషులుగా నిర్ధారితులై తమ జైళ్ళలో ఉన్న కొందరు ఖైదీలను ఎల్ సాల్వడార్ జైలుకు తరలించాలని అమెరికా ఆలోచిస్తోంది. ఈ మేరకు ఎల్ సాల్వడార్‌కు అమెరికా ‘మాంచి ఆఫర్’ ఇచ్చింది. దీనిపై అమెరికా విదేశాంగ సెక్రటరీ మార్కో రూబియో కూడా స్పందించారు. “ఇది చాలా మంచి ఆఫర్ అయితే ఈ ప్రస్తావనపై మేము అధ్యయంన చేశాక నిర్ణయం తీసుకుంటాం.” కానీ అమెరికా రాజ్యాంగం తమ దేశ పౌరులకు భద్రత కల్పించింది. నేరస్థుల పౌరసత్వాన్ని లాక్కునే హక్కు ఎవరికీ లేదని అమెరికా కోర్టులు గతంలో తీర్పులు ఇచ్చాయి. దీని ప్రకారం, నేరగాళ్లను బహిష్కరించే లేదా వేరే దేశానికి పంపే అధికారం అమెరికాకు లేదు.
అయితే, తమ ఖైదీల నిర్వహణ ఖర్చు తగ్గించుకునే అవకాశాలను అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ అన్వేషిస్తున్నారు. పదే పదే నేరాలు చేసే అమెరికన్లను అతి తక్కువ ఫీజుకు ఇతర దేశాల్లో నిర్బంధించే అవకాశాలను ట్రంప్ పరిశీలిస్తున్నట్టు బాహాటంగా ప్రకటించారు. దీనిపై విపక్షం నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతోంది. అమెరికా ఖైదీలను తమ దేశంలో బంధిస్తే మానవ హక్కుల ఉల్లంఘన ఎక్కువగుతుందని, మానవ హక్కులు మరింత ప్రమాదంలో పడతాయని ఎల్ సాల్వడార్ స్వచ్ఛంద సంస్థలు హెచ్చరిస్తున్నాయి.