Trump Slams Biden India Elections| అమెరికా మాజీ అధ్యక్షుడు జో బైడెన్, భారతదేశం పై ప్రస్తుత ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ సంచలన ఆరోపణలు చేశారు. భారతదేశంలో ఓటింగ్ శాతాన్ని పెంచేందుకు అమెరికా 21 మిలియన్ డాలర్లు ఎందుకు ఖర్చు పెట్టాలి? అని ప్రశ్నించారు. భారత ఎన్నికల్లో బైడెన్ తన పక్షాన ఎవరినో గెలిపించేందుకు ఈ డబ్బు ఖర్చు చేశారని ఆరోపించారు.
ప్రెసిండెంట్ ట్రంప్ బుధవారం మియామీలో జరిగిన ఒక సదస్సులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ట్రంప్ మాట్లాడుతూ, “భారతదేశంలో ఓటింగ్ శాతాన్ని పెంచేందుకు మనం (అమెరికా) 21 మిలియన్ డాలర్లు ఎందుకు ఖర్చు పెట్టాలి? బైడెన్ ప్రభుత్వం భారతదేశంలో ఎవరినైనా గెలిపించేందుకు ప్రయత్నించినట్లు అర్థమవుతోంది. ఈ విషయాన్ని భారత ప్రభుత్వానికి తప్పనిసరిగా తెలియజేయాలి. బైడెన్ ఎవరి కోసం డబ్బు ఇచ్చారో చెప్పాలని డిమాండ్ చేశాను. ఇది చాలా కీలకమైన అంశం” అని వ్యాఖ్యానించారు.
అయితే భారతదేశం ఎన్నికల్లో ఓటర్ల సంఖ్యను పెంచేందుకు అమెరికా కేటాయించిన 21 మిలియన్ డాలర్ల ఫండ్‌ను ఇటీవలే అమెరికా డోజె విభాగం రద్దు చేసింది. ఈ సందర్భంగానే ట్రంప్ భారతదేశం పై సంచలన వ్యాఖ్యలు చేశారు. “భారత ఎన్నికల్లో ఓటర్ల సంఖ్యను పెంచేందుకు అమెరికా డబ్బు ఎందుకు ఇవ్వాలి? 21 మిలియన్ డాలర్లు ఇవ్వడం ఎందుకు? భారతదేశం వద్దే చాలా సొమ్ము ఉంది. ప్రపంచంలోనే అత్యధిక పన్నులు వసూలు చేసే దేశాల్లో భారతదేశం ఒకటి. మాకు భారత ప్రజలు, ప్రధాని మోదీ పట్ల చాలా గౌరవం ఉంది” అని ట్రంప్ తన వ్యాఖ్యలలో పేర్కొన్నారు.
Also Read: ఉక్రెయిన్ యుద్ధం మొదలవడానికి జెలెన్‌స్కీనే కారణం.. ట్రంప్ ఘాటు వ్యాఖ్యలు
మోదీకి స్పష్టంగా చెప్పా..
ట్రంప్.. ప్రధాని నరేంద్ర మోదీతో జరిగిన సంభాషణను కూడా ప్రస్తావించారు. “టారిఫ్‌ల విషయంలో ఎవరికీ మినహాయింపు లేదని నేను మోదీకి స్పష్టంగా చెప్పాను. ఈ విషయంలో నాతో ఎవరూ వాదించలేరు. అమెరికా నుంచి దిగుమతి చేసుకునే వస్తువులపై భారత్ అత్యధిక పన్నులు విధిస్తోంది. ఇకపై మేమూ అదే రీతిలో వ్యవహరిస్తాం” అని ట్రంప్ తేల్చి చెప్పారు. ఈ విషయాన్ని ట్రంప్ ఎలాన్ మస్క్‌తో కలిసి ఒక వార్తా ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో వివరించారు. ఆ ఇంటర్వ్యూలో ట్రంప్ మాట్లాడుతూ.. “మనం ఇకపై పరస్పరం సుంకాలు విధించుకోబోతున్నాం అని నేను ఇటీవల మోదీకి చెప్పాను. మీరు ఎంత సుంకాలు విధిస్తే, నేనూ అంతే విధిస్తాను అని స్పష్టం చేశాను. అప్పుడు మోదీ ఏదో చెప్పబోయారు, కానీ నేను ఆపేశాను.” అని వివరించారు.
ఎలాన్ మస్క్ కూడా ఈ విషయంపై స్పందిస్తూ.. “అమెరికా నుంచి దిగుమతి చేసుకునే వస్తువులపై భారత్ అత్యధిక సుంకాలు విధిస్తోంది. ముఖ్యంగా ఆటోమొబైల్ రంగంలో ఇది స్పష్టంగా కనిపిస్తోంది. అమెరికా నుంచి దిగుమతి అయ్యే కార్లపై భారత్ దాదాపు 100 శాతం సుంకాలు విధిస్తోంది” అని మస్క్ పేర్కొన్నారు. ఇందుకు సమాధానంగా ట్రంప్.. “ఇది చిన్న విషయం కాదు. భారత్ కొన్ని వస్తువులపైన మరింత ఎక్కువ సుంకాలు విధిస్తోంది. నేను 25 శాతం పన్నులు విధిస్తే.. అన్ని దేశాలు భయపడిపోతున్నారు. అందుకే ఇకపై ప్రతీకార సుంకాలుంటాయి. ఇతర దేశాలు ఎంత సుంకాలు విధిస్తే, మేమూ అంతే విధిస్తాం. అప్పుడే వారు సుంకాలను తగ్గిస్తారు” అని ట్రంప్ స్పష్టం చేశారు.