Trump Slams Zelenskyy Over Ukraine War | ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సౌదీ అరేబియాలో రష్యాతో జరుగుతున్న చర్చలకు తమను ఆహ్వానించలేదని జెలెన్‌స్కీ చేసిన వ్యాఖ్యలపై ట్రంప్ తీవ్రంగా స్పందించారు. “జెలెన్స్కీ ఒక అసమర్థ నేత. అసలు రష్యా-ఉక్రెయిన్ యుద్ధం మొదలవడానికి కారణమే జెలెన్స్కీ. యుద్ధానికి ముగింపు పలికేందుకు జెలెన్‌స్కీ.. రష్యాతో ఎప్పుడో డీల్ కుదుర్చుకోవాల్సింది.” అని ఉక్రెయిన్ అధ్యక్షుడిపై ట్రంప్ తీవ్రంగా తప్పుబట్టారు. అయినా యద్ధం ముగించేందుకు అన్ని విధాలా ప్రయత్నిస్తానని చెప్పారు.
“యుద్ధాన్ని ముగించే శక్తి నాకుందని అనుకుంటున్నాను. ఇప్పటివరకు అంతా సజావుగానే జరుగుతోంది. సౌదీలో చర్చలకు తమను పిలవలేదని జెలెన్స్కీ అంటున్నాడు. మూడేళ్ల నుంచి ఆయన ఏం చేస్తున్నాడు? ఈ నెలలోనే రష్యా అధ్యక్షుడు పుతిన్తో మాట్లాడతాను. యుద్ధం ఆపేందుకు పుతిన్, జెలెన్స్కీ ఇద్దరితో సంప్రదింపులు జరుపుతున్నాను. ఆయనే ఈ మూడేళ్లలో యుద్ధాన్ని ముగించాల్సింది. అసలు ఆయన యుద్ధాన్ని మొదలు పెట్టాల్సింది కాదు. మీరే ఓ డీల్ చేసుకొని ఉండొచ్చు.
నేను ఉక్రెయిన్ కోసం ఓ ఒప్పందం కుదర్చగలను. పోగొట్టుకొన్న దాదాపు మొత్తం ఉక్రెయిన్ భూమిని తిరిగి ఇప్పించగలను. ప్రజలు ఎవరూ చనిపోరు. ఏ నగరం నేలమట్టం కావాల్సిన అవసరం రాదు. ఒక్క ఇంటి పైకప్పు కూడా కూలదు. కానీ ఇదంతా జరగాలని ఆయన (జెలెన్స్కీ) అనుకోవడం లేదు.” అని ట్రంప్ ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీని ఉద్దేశించి అన్నారు.
జెలెన్‌స్కీ నేతృత్వంలో ఉక్రెయిన్ అతిపెద్ద విధ్వంస ప్రదేశంగా మారిపోయిందని మండిపడ్డారు. అసలు ఆ దేశంలో ఎన్నికలు నిర్వహించాలని.. జెలెన్స్కీకి కేవలం 4 శాతం మాత్రమే ప్రజామద్దతు ఉందని ఘాటుగా వ్యాఖ్యానించారు.
ఈ నెలాఖరులో తాను రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో భేటీ అయ్యే అవకాశం ఉందని ఈ సందర్భంగా ట్రంప్ వెల్లడించారు. రష్యా ఈ వినాశనం ఆపడానికి ఏదో చేద్దామనుకుంటోందని అభిప్రాయపడ్డారు. ప్రతి వారం వేల మంది సైనికులు చనిపోతున్నారని గుర్తుచేశారు. తాము దీనిని ముగించాలనుకుంటున్నట్లు పేర్కొన్నారు. ఇది బుద్ధి తక్కువ యుద్ధమని ట్రంప్ అభివర్ణించారు.
Also Read: భారత్ వద్ద చాలా డబ్బులున్నాయ్.. మరి సాయం ఎందుకు?.. ట్రంప్ ఆసక్తికర వ్యాఖ్యలు
ఉక్రెయిన్ ను పక్కకు తప్పించలేదు..
సౌదీలో మొదలైన శాంతి చర్చలపై ఇటీవల జెలెన్స్కీ అసంతృప్తి వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. దీనిపై అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో మాట్లాడుతూ ఉక్రెయిన్ ను పక్కన పెట్టారన్న ప్రచారాన్ని కొట్టిపారేశారు. ఆ దేశంతో సంప్రదింపులు జరుపుతామని పేర్కొన్నారు. ‘ఎవరినీ పక్కన పెట్టం. ఉక్రెయిన్తో పాటు మా ఐరోపా భాగస్వాములు, ఇతరులతోను చర్చలు జరుపుతాము’ అని పేర్కొన్నారు.
రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లవ్రోవ్ రియాద్లో జరిగిన చర్చల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉక్రెయిన్ నాటోలో చేర్చే అంశంపై మాత్రం తాము ఎట్టి పరిస్థితుల్లో రాజీపడమన్నారు. అది తమ దేశ భద్రతకు ముప్పుగా మారుతుందని పేర్కొన్నారు. ‘నాటో సభ్యదేశ సైన్యాలైనా.. లేదా ఐరోపా సమాఖ్య కింద వచ్చే సేనలైనా.. దేశాల పతాకాలతో వచ్చే దళాలైనా సరే.. ఉక్రెయిన్లో మోహరించడాన్ని ఏమాత్రం ఆమోదించం’ అని ఆయన తేల్చి చెప్పారు.
ట్రంప్ వ్యాఖ్యలకు జెలెన్స్కీ ఎదురు సమాధానం
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తప్పుడు సమాచారం అనే బుడగలో చిక్కుకున్నారని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ విమర్శించారు. అలాగే తనను అధ్యక్ష పదవి నుంచి దింపేయాలనుకునే ప్రయత్నం విఫలం అవుతుందని వ్యాఖ్యలు చేశారు. ఉక్రెయిన్ అధ్యక్షుడిగా జెలెన్స్కీ ప్రజామోదం తగ్గిపోతోందని ట్రంప్ వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో ఈ స్పందన వచ్చింది.
‘ఎవరైనా నా స్థానాన్ని భర్తీ చేయాలనుకుంటే ఆ ప్రయత్నం విఫలం అవుతుంది. నాకు ప్రజామోద రేటింగ్ నాలుగు శాతంగా ఉందని రష్యా ప్రచారం చేస్తున్న తప్పుడు సమాచారం. అందులో ట్రంప్ ఇరుక్కుపోయారు’ అని టీవీలో ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. ఉక్రెయిన్ గురించి ట్రంప్ బృందం వాస్తవాలను తెలుసుకోవాలని, రష్యా అధ్యక్షుడు పుతిన్ను తన దేశంలో ఏ ఒక్కరూ విశ్వసించరని అన్నారు. రష్యా ఇచ్చే రాయితీలను తన ప్రజలు అంగీకరించరని స్పష్టం చేశారు.