Trump Biden Security Clearance | అమెరికా మాజీ అధ్యక్షుడు జో బైడెన్‌పై ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రతీకారం తీర్చుకున్నారు. బైడెన్‌కు సెక్యూరిటీ క్లియరెన్స్ హోదాను రద్దు చేస్తూ ట్రంప్ తాజాగా నిర్ణయం తీసుకున్నారు. బైడెన్‌తో పాటు అధ్యక్ష ఎన్నికల్లో తన ప్రత్యర్థి అయిన మాజీ వైస్ ప్రెసిడెంట్ కమలా హారిస్, హిల్లరీ క్లింటన్, బైడెన్ కుటుంబీకులకు, ఆయన ప్రభుత్వంలో మంత్రులుగా, ఉన్నతాధికారులుగా పనిచేసిన వారికి కూడా ఈ సెక్యూరిటీ క్లియరెన్స్‌ను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు.
మాజీ అధ్యక్షులు, మంత్రులు మరియు అత్యున్నత స్థాయి అధికారులకు సెక్యూరిటీ క్లియరెన్స్‌ను కొనసాగించడం సాధారణం. ఈ హోదా ఉన్న వ్యక్తులకు ప్రభుత్వ రహస్య సమాచారం అందుబాటులో ఉంటుంది. రహస్య పత్రాలు, ఇతర ముఖ్యమైన సమాచారాన్ని చూడటానికి కూడా వారికి అనుమతి ఉంటుంది. సెక్యూరిటీ క్లియరెన్స్ ఉంటే వారికి నిఘా సంస్థల నుంచి సమాచారం అందుతూ ఉంటుంది.
2021లో బైడెన్ అధ్యక్ష పదవి చేపట్టాక ఆయన ట్రంప్‌నకు ఉన్న సెక్యూరిటీ క్లియరెన్స్‌ను తొలగించారు. 2016–2020 మధ్య అధ్యక్షుడిగా పనిచేసిన ట్రంప్, 2020 ఎన్నికల్లో బైడెన్ చేతిలో ఓటమిని అంగీకరించలేక, క్యాపిటల్ హిల్ భవనంపై దాడికి తన మద్దతుదారులను ప్రేరేపించిన సంగతి అందరికీ తెలిసిందే.
Also Read: 5 లక్షల మంది అమెరికా వదిలి వెళ్లిపోవాలి.. వారికి భారీ షాకిచ్చిన ట్రంప్
ఈ సందర్భంగా బైడెన్, “ట్రంప్ వంటి తప్పుడు ప్రవర్తన కలిగిన వ్యక్తికి రహస్య, నిఘా సమాచారం అందుబాటులో ఉండటం సరికాదు. అందుకే ఈ నిర్ణయం తీసుకుంటున్నా” అని చెప్పారు. ఇప్పుడు ట్రంప్ కూడా తన నిర్ణయానికి ఇదే కారణాలను సూచిస్తూ, “రహస్య పత్రాలు, నిఘా సమాచారం బైడెన్, ఇతరులకు అందుబాటులో ఉండటం దేశ ప్రయోజనాలకు హానికరం. పైగా బైడెన్ ను మతిమరుపు సమస్య ఉంది. ఆయన ఈ నిఘా సమాచారాన్ని బహిర్గతం చేసే ప్రమాదం ఉంది. అందుకే దేశ రక్షణ దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నాను” అని ప్రకటించారు.
బైడెన్ కుటుంబానికి సీక్రెట్ సర్వీస్ రక్షణ కూడా రద్దు చేశారు
ఇటీవలే బైడెన్ సంతానానికి సీక్రెట్ సర్వీస్ రక్షణను తొలగిస్తున్నట్లు ట్రంప్ ప్రకటించారు. ఈ నిర్ణయం వెంటనే అమల్లోకి వస్తుందని ఆయన తెలిపారు. బైడెన్ కుమారుడు హంటర్‌కు భద్రత కోసం సీక్రెట్ సర్వీస్‌కు చెందిన 18 మంది ఏజెంట్లు పనిచేస్తున్నారని ట్రంప్ వివరించారు. అలాగే బైడెన్ కుమార్తె ఆష్లేకు 13 మంది ఏజెంట్లతో కూడిన భద్రత ఉందని తెలిపారు. ఈ రక్షణను వెంటనే తొలగిస్తున్నట్లు ట్రంప్ తన సోషల్ మీడియా వేదిక ద్వారా ప్రకటించారు.
సాధారణంగా అమెరికాలో ఫెడరల్ చట్టాల ప్రకారం.. మాజీ అధ్యక్షుడు, వారి జీవిత భాగస్వాములకు జీవితకాలం సీక్రెట్ సర్వీస్ రక్షణ అందుతుంది. అయితే వారి సంతానానికి 16 సంవత్సరాలు దాటిన తర్వాత, అధ్యక్ష పదవిని వదిలిన వెంటనే భద్రతను తొలగిస్తారు. కానీ, బైడెన్ తన పదవిని వదిలే ముందు తన సంతానానికి కల్పించిన రక్షణను జులై వరకు పొడిగించుకున్నారు.
అంతకు ముందు ట్రంప్ తన మొదటి పదవి కాలంలో కూడా తన పిల్లల కోసం ఇలాంటి నిర్ణయమే తీసుకున్నారు. కానీ ఇప్పుడు బైడెన్ తీసుకున్న నిర్ణయాన్ని రద్దు చేస్తున్నట్లు ట్రంప్ తాజాగా ప్రకటించడం గమనార్హం. బైడెన్ క్షమాభిక్షల పై ట్రంప్ ఇటీవల కీలక వ్యాఖ్యలు చేసిన సంగతి అందరికీ తెలిసిందే. క్షమాభిక్ష పత్రాల పై బైడెన్ సంతకాలు చేయలేదని. ఆయన పేరిట ఆటోపెన్‌తో సంతకాలు జరిగాయని, అందుకే వాటిని రద్దు చేస్తున్నట్లు ట్రంప్ ప్రకటించారు.
బైడెన్ అధ్యక్ష పదవికాలం చివరి రోజుల్లో పలువురికి క్షమాభిక్షలు ప్రసాదించారు. డిసెంబర్ 12న ఒకే రోజులో 1500 మంది ఖైదీల శిక్షలను తగ్గించారు. మరో 39 మంది ఖైదీలను క్షమించారు. అమెరికా ఆధునిక చరిత్రలో ఈ స్థాయిలో క్షమాభిక్షలు ఎవరూ ప్రసాదించలేదు.