US Elections Trump| అగ్రరాజ్యం అధ్యక్షుడిగా పదవి చేపట్టి నుంచి డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) అమెరికా వ్యవస్థ ప్రక్షాళన లక్ష్యంగా వేగంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగానే ఆయన ఎన్నికల ప్రక్రియలో భారీ మార్పులు చేయడానికి సిద్ధమయ్యారు. ఇక నుంచి ఓటు నమోదు కోసం పౌరసత్వం రుజువు (ఓటర్ ఐడి ప్రూఫ్) చూపడం తప్పనిసరి చేస్తూ.. ట్రంప్ మంగళవారం (అమెరికా కాలమానం ప్రకారం) ఒక కార్యనిర్వాహక ఉత్తర్వుపై సంతకం చేశారు. ఇండియా, బ్రెజిల్ వంటి దేశాలను ఉదాహరణగా చూపించి అక్కడ ఈ ప్రక్రియలో ఎన్నికలు నిర్వహిస్తున్నాయని ఆయన తెలిపారు.
‘‘స్వయంకృషి ఆధారంగా మనం ఇతరులకు మార్గదర్శకంగా ఉన్నప్పటికీ, ఆధునిక, అభివృద్ధి చెందుతున్న దేశాలు తమ ఎన్నికల ప్రక్రియలో అనుసరిస్తున్న ప్రాథమిక నిబంధనలను మనం అమలు చేయడంలో విఫలమయ్యాం. ఉదాహరణకు.. భారత్, బ్రెజిల్ వంటి దేశాలు ఓటర్ల గుర్తింపును బయోమెట్రిక్ డేటాబేస్‌తో అనుసంధానిస్తున్నాయి. కానీ, మనం స్వీయ ధ్రువీకరణపై ఆధారపడుతున్నాం. అలాగే, జర్మనీ, కెనడా వంటి దేశాలు పేపర్ బ్యాలెట్ల పద్ధతిని అనుసరిస్తున్నా.. మన ఎన్నికల ప్రక్రియలో అనేక లోపాలు ఉన్నాయి’’ అని ట్రంప్ ఆ ఉత్తర్వులో పేర్కొన్నారు.
Also Read: అమెరికా యుద్ధ ప్రణాళికలు మీడియాకు లీక్.. ట్రంప్ యంత్రాంగం నిర్లక్ష్యమే కారణం
ఇందుకు సంబంధించి ట్రంప్ గతంలో మాట్లాడుతూ.. ‘‘మోసాలు లేకుండా, సూటిగా, న్యాయపరమైన ఎన్నికలు నిర్వహించడం మన బాధ్యత. నిజమైన విజేతను నిర్ణయించడానికి ఈ మార్పులు అత్యంత అవసరం’’ అని పేర్కొన్నారు. 2020 ఎన్నికల్లో ఓటమి తర్వాత ట్రంప్ ఎన్నికల విధానంపై అనేక అనుమానాలు వ్యక్తం చేశారు.
ట్రంప్ ఎన్నికల నిర్ణయంపై రిపబ్లికన్ చట్టసభ సభ్యులు మద్దతు తెలిపారు. ఇది ప్రజల విశ్వాసాన్ని పునరుద్ధరించడంలో సహాయపడుతుందని వారు అభిప్రాయపడారు. జార్జియా విదేశాంగ కార్యదర్శి బ్రాడ్ రాఫెన్స్‌పెర్గర్ ఈ ఉత్తర్వు ద్వారా అమెరికా పౌరులు మాత్రమే దేశంలో జరిగే ఎన్నికల ఫలితాలను నిర్ణయించేందుకు అవకాశం ఇస్తుందని తెలిపారు. మరోవైపు డెమొక్రాట్లు ఈ ఉత్తర్వులను వ్యతిరేకించారు. వారు ఈ మార్పు వల్ల కొంతమంది ఓటర్లు తమ ఓటు హక్కును కోల్పోతారని పేర్కొన్నారు. 2023లో జరిగే నివేదిక ప్రకారం.. అర్హత కలిగిన అమెరికా పౌరులలో తొమ్మిది శాతం మందికి పౌరసత్వ రుజువు లేదని వెల్లడించారు.
మరోవైపు 18 రాష్ట్రాలలో.. ఎన్నికల రోజు తర్వాత వచ్చిన మెయిల్ ఓట్లను అంగీకరిస్తున్నాయి. ట్రంప్ ఈ విధానాన్ని ఇకపై రద్దు చేయాలని నిర్ణయించారు. కొలరాడో డెమోక్రటిక్ సెక్రటరీ ఆఫ్ స్టేట్ జెనా గ్రిస్వోల్డ్ ఈ ఉత్తర్వును చట్టవిరుద్ధమైనదిగా అభివర్ణిస్తూ.. ఇది ఓటర్ల సంఖ్యను తగ్గించేందుకు ట్రంప్ చేస్తున్న ప్రయత్నమని ఆరోపించారు.